తేనె పట్టుంచుకోండి!

Special Story on International honey bee day - Sakshi

అనుక్షణం శ్రమించే అన్నదాతకు దీటుగా అవిశ్రాంతంగా రెక్కలను ముక్కలు చేసుకునే జీవి ఏదైనా ఈ భూతలమ్మీద ఉన్నదీ అంటే అది తేనెటీగ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. తెల్లారింది మొదలు ప్రతి పువ్వునూ ముద్దాడే తేనెటీగ మకరందాన్ని, పుప్పొడినీ విసుగూ విరామం లేకుండా పోగేసి.. రైతు మాదిరిగా అమూల్యమైన అమృతాహారాన్ని (తేనెను) నిండుమనసుతో మన దోసిట్లో పోస్తుంది. అంతేకాదు.. పనిలో పనిగా పంట మొక్కల్లో, ఔషధ మొక్కల్లో పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది.

జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని జీవవంతం చేస్తుంటుంది. అయితే, పొలం అంతా ఏదో ఒకే రకం పంటల(మోనోకల్చర్‌)ను మాత్రమే సాగు చేస్తూ, అతి ప్రమాదకర రసాయనిక పురుగుమందులు (నియోనికుటినాయిడ్స్‌) వాడుతూ తేనెటీగల మనుగడను దెబ్బతీస్తున్నాం. ప్రకృతి, వ్యవసాయం పదికాలాల పాటు పచ్చగా పరిఢవిల్లాలంటే.. తేనెటీగలను కంటి రెప్పల్లా కాపాడుకోవాలి. ఇందుకు మనందరం దీక్షగా పనిగట్టుకోవాలని అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం (మే 20)  పిలుపు ఇస్తోంది.. అందిపుచ్చుకుందాం రండి..

తేనెటీగల పెంపకం ఎలా?
ఆధునిక పద్ధతుల్లో పెట్టెలను అమర్చి, వాటిలో తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పంటల్లో దిగుబడి పెంచేందుకు తేనెటీగలు ఉపయోగపడతాయి. నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేసి మంచి ఆదాయం పొందవచ్చు. తేనెతోపాటు మైనం, రాయల్‌ జెల్లీ (రాజాహారం), పుప్పొడి తదితర ఉప ఉత్పత్తులను పొందవచ్చు. తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణులు, ముఖ్యంగా మహిళలు, గ్రామాల్లోనే ఉపాధి పొందవచ్చు.

శిక్షణ ఎవరిస్తారు?
కేంద్ర లఘు పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌(కెవిఐసి) తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయ్‌ గ్రామంలో రాష్ట్ర స్థాయి తేనెటీగల పెంపకం విస్తరణ కేంద్రం ఉంది. రెండు పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంటారు.
ఈ కేంద్రం ఆవరణలో 5 రోజుల పాటు తేనెటీగల పెంపకంలో రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తారు. రుసుము రూ. 1,500. 18 ఏళ్లు వయసు నిండిన వారెవరైనా అర్హులే. ప్రతి నెలా ఒక బ్యాచ్‌కు ఈ విధంగా శిక్షణ ఇస్తుంటారు.  

దీనితోపాటు..
హనీ మిషన్‌ ప్రోగ్రామ్‌ కింద కెవిఐసి సిబ్బంది ఎంపిక చేసిన గ్రామాలకు తరలివెళ్లి అక్కడి వారికి తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 200 మందికి తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో 128 మందికి పదేసి చొప్పున తేనెటీగల పెట్టెలను సైతం అందించామని టీ వీ రావు (94410 51039) ‘సాక్షి’తో చెప్పారు. విజయరాయ్‌లోని కెవిఐసి తేనెటీగల పెంపకం శిక్షణ కేంద్రంలో ఆయన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. 4 జాతులకు చెందిన ఐరోపా తేనెటీగలను మన దేశంలో పెంచుతున్నారు. వీటిని ఆధునిక పద్ధతుల్లో పెంచడంలో మెలకువలను నేర్పడంతోపాటు నాణ్యమైన తేనె సేకరణ, ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తున్నామని రావు వివరించారు. ఒక్కో పెట్టెలో 50 వేల నుంచి పది లక్షల వరకు తేనెటీగలు ఉంటాయి. ఒక్కో పెట్టె ద్వారా 20–30 రోజుల్లో 5–10 కిలోల తేనె దిగుబడి వస్తుంది.

ముచ్చటగా మూడో ఏడాది!
అంటన్‌ జన్స... ఆధునిక తేనెటీగల పెంపకం పితామహుడు. ఆయన పుట్టిన రోజు అయిన మే 20వ తేదీన వరల్డ్‌ బీస్‌ డే జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 2018 నుంచి అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. ఇది మూడో ఏడాది. స్లొవేనియా దేశస్థుడైన అంటన్‌ జన్సకు తేనెటీగలే పంచప్రాణాలు. క్రీ. శ. 1734 మే 20న జన్మించిన ఆయనే తొలి తేనెటీగల పెంపకందారుడు. చిత్రలేఖనంలో నిష్ణాతుడైనప్పటికీ తేనెటీగల పెంపక శాస్త్ర అధ్యాపకుడిగా సేవలందించాడు. 1771లో తేనెటీగలపై తొలి గ్రంథాన్ని రచించాడు. తేనెటీగల్లో 20 వేల జాతులున్నాయి. అయితే, ఐరోపాకు చెందిన 4 జాతుల తేనెటీగలను భారత్‌ సహా అనేక దేశాల్లో విరివిగా పెంచుతున్నారు.

పంటల దిగుబడి పెంచుకోవడం ఎలా?
పండ్ల తోటలు / వార్షిక పంటలు పూతకు వచ్చే దశలో తెనెటీగల పెట్టెలను పొలాలకు దగ్గరలో సుమారు 30 రోజులపాటు ఉంచితే.. ఆయా పంటల్లో పరపరాగ సంపర్కం బాగా జరిగి, దిగుబడి పెరుగుతుంది. తేనెటీగల పెంపకం దారులకు పెట్టెకు కొంత మొత్తం అద్దెగా చెల్లించి రైతులు తమ పొలాల వద్ద తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేయించుకుంటూ ఉంటారు. ఎకరానికి 3 నుంచి 5 పెట్టెలు అవసరం ఉంటుంది. పూత సీజన్‌ (సాధారణంగా 40 రోజులు) గడిచిన తర్వాత తేనెటీగలు సహా తమ పెట్టెలను తేనెటీగల పెంపకందారులు మరో ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ఇటువంటి తేనె రైతులు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఉన్నారు.
పూత లేని కాలాల్లో తేనెటీగలు ఆకలితో చనిపోకుండా పంచదార ద్రావణాన్ని ఆహారంగా ఇస్తూ కాపాడుకుంటూ ఉంటారు. సాధారణ తేనెటీగలు 50 రోజులు బతుకుతాయి. రాణి ఈగ 1–3 సంవత్సరాలు బతుకుతుంది.

తేనెలూరే సంగతులు
► మనం ఆహారంగా తిసుకునే తిండి/నూనె గింజలు, పండ్లను అందించే ప్రతి నాలుగు రకాల పంటలు/తోటల్లో మూడు రకాలు పరాపరాగ సంపర్కం కోసం (ఎంతో కొంతవరకైనా) తేనెటీగలు, ఈగలు, సీతాకోకచిలుకలు తదితర ఎగిరే చిరు జీవులపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో తేనెటీగల పాత్ర 90% ఉంటుంది.

► ప్రపంచవ్యాప్తంగా 87 రకాల ఆహార పంటలు/తోటలు తెనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం చెంది చక్కని పంట దిగుబడులను అందిస్తున్నాయి. సాగు భూమి విస్తీర్ణపరంగా చూస్తే ఇది 35 శాతం.

► పంటలపై ఈ ఎగిరే చిరు జీవుల ప్రభావం ఎంత అనేది ఆయా ప్రాంతాల్లో వాటి సంఖ్యను బట్టి, వైవిధ్యాన్ని బట్టి ఉంటుంది.  

► ఇవి మనకు అందించే ఆహారోత్పత్తులు ఆరోగ్యదాయకమైనవి, పౌష్టిక విలువలు కలిగినవీను.

► అమూల్య సేవలందించే ఈ చిరు జీవుల మనుగడకు రసాయనిక సాంద్ర వ్యవసాయం, ఒకే రకం పంటలు సాగు చేయడం ముప్పుగా పరిణమించాయి.

► అనేక రకాల పంటలతో, వ్యవసాయక జీవవైవిధ్యంతో తులతూగే రసాయన రహిత పంట పొలాలు మనుషుల మనుగడకు, భూసారం పెంపునకు, పర్యావరణ పరిరక్షణతో పాటు తేనెటీగలకూ జీవనావసరమే. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తేనెటీగల పరిరక్షణకు దోహదపడతాయి.

► తేనెటీగలు 20,000 జాతులు. అడవుల్లో ఎక్కువ జాతులు ఉంటాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకల జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
(మూలం : ఆహార, వ్యవసాయ సంస్థ– ఎఫ్‌.ఏ.ఓ. )

ఏయే పంటలకు ఉపయోగం?
తేనెటీగల ద్వారా కొన్ని రకాల పంటల్లో పరపరాగ సంపర్కం మెరుగ్గా జరుగుతుంది. దాదాపు 75 శాతం పంటల్లో ఎంతో కొంత స్థాయిలో పరపరాగ సంపర్కానికి తేనెటీగలు దోహదపడుతున్నాయి.  ప్రకృతిసిద్ధంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో తేనెటీగల పెంపకందారుల నుంచి తేనెటీగల పెట్టెలను తెప్పించి పొలాల దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం వస్తున్నది. కొబ్బరి, నిమ్మ, బత్తాయి, జామ, పుచ్చ, గుమ్మడి, దానిమ్మ, జీడిమామిడి వంటి ఉద్యాన తోటలు.. పొద్దుతిరుగుడు, నువ్వులు, గడ్డి నువ్వులు / వెర్రి నువ్వులు, ఆవాలు వంటి నూనె గింజల పంటలు.. ధనియాలు, వాము వంటి సుగంధ ద్రవ్య పంటలతోపాటు కందులు వంటి పప్పు జాతి పంటల్లో తేనెటీగల ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చని  విజయరాయి లోని కెవిఐసి తేనెటీగల శిక్షణా కేంద్రం జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ టీ వీ రావు (94410 51039) ‘సాక్షి’తో చెప్పారు. నిజామాబాద్‌ ప్రాంతంలో ఆవాలు సాగు చేసే రైతులు ప్రతి ఏటా తేనెటీగల పెట్టెలను అద్దెకు తీసుకొని తమ పొలాల్లో పెట్టించుకుంటూ దిగుబడి పెంపొందించుకుంటున్నారు. 40 రోజుల పూత కాలానికి గాను పెట్టెకు రూ. 1,500 వరకు అద్దె చెల్లిస్తున్నారని రావు వివరించారు.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top