కర్తవ్యమ్‌

 Special Stories On Chaganti Koteswara rao Pravachanalu - Sakshi

స్త్రీ వైశిష్ట్యం – 10

మామూలుగా సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలని ఉంటాయి. ఈ దేశానికున్న గొప్పతనం ఏమిటంటే... ‘పతివ్రతా ధర్మం’ అని ఒక ధర్మం ఉంది. దానితో స్త్రీలు ఏ పురుషుడికీ అందనంత పైస్థాయికి చేరుకున్నారు. ఆ మాటకు అర్థం – పతి లోటుపాట్లతోకానీ, ఆయనకున్న గుణ విశేషాలతో కానీ ఆమెకు సంబంధం ఉండదు. ఆమె భర్తను పరదైవంగా భావించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ పోతుంది. మనం ముందే చెప్పుకున్నట్లు అవతలివారి వలన ఇవతలి వారి ధర్మం మారదు. నేను ఒక ప్రదేశంలో ప్రవచనం చేస్తున్నాను. మీకు అర్థం అయ్యేటట్లు మాట్లాడితే దానిని ప్రవచనం అంటారు. ప్రవచనం చేసేటప్పుడు నా బుద్ధికి తోచిన విషయాన్ని నేనెప్పుడూ చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. అనవసరమైన విషయాన్ని కానీ, నేనిలా అనుకుంటున్నానని కానీ ఎప్పుడూ ప్రతిపాదన చేయకూడదు. అదే నేను వేదిక దిగి వెళ్ళిపోయాననుకోండి. నా భార్య ఎదురుగా నిలబడితే నా భర్తృ ధర్మం.

నా కుమారుడి ముందు నిలుచుంటే పితృధర్మం. నేను పట్టణంలో నిలబడితే పౌర ధర్మం. నేనెక్కడ నిలబడ్డాను, ఎవరి ముందు నిలబడ్డాను...అన్న దానినిబట్టి ధర్మం నిరంతరం మారిపోతుంటుంది.మారుతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి తప్ప అవతలివాడు అలా ఉంటాడు కాబట్టి నేనిలా ఉంటాననకూడదు. అప్పుడు అది ధర్మం కాదు. ధర్మం ‘కర్తవ్యమ్‌’ రూపంలో ఉంటుంది. ఆర్ష వాఙ్మయాన్ని పరిశీలిస్తే బాధ్యత అన్న మాట కనపడదు. ‘కర్తవ్యమ్‌’–అనే మాటే కనిపిస్తుంది. అందుకే రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్ర లేపితే..‘‘కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్‌’ అంటాడు. కర్తవ్యం అంటే ఏమిటి? సూర్యోదయమవుతోంది. అంతకన్నా ముందే విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేసాడు, అర్ఘ్యమిచ్చాడు. రామలక్ష్మణులిద్దరూ నిద్రపోతున్నారు. నిద్రలేపేటప్పుడు ఎప్పుడూ భగవత్‌ సంబంధం చెప్పి నిద్రలేపాలి తప్ప ఇంకొకలా నిద్రలేపకూడదు. అందుకే ...‘‘అదుగో సూర్యోదయమవుతోంది, రామా! లక్ష్మణా ! లేచి సంధ్యావందనం చేయండి.కర్తవ్యమ్‌ దైవమాహ్నికమ్‌... అది మీరు చేయవలసినది, నేను చెప్పవలసినది. అక్కడితో నా కర్తవ్యం పూర్తయింది.

ఒకవేళ వారు నిద్రలేవలేదనుకోండి. మరో మారు గుర్తుచేస్తాడు, జీవితాంతం అలా గుర్తు చేస్తూనే ఉంటాడు తప్ప కించిత్‌ బాధపడడు. రాముడు చేస్తే పొంగిపోడు, చేయలేదని కుంగిపోడు... చెప్పవలసినది చెప్పాడు. అంతవరకే. తన కర్త్యవ్యాన్ని నెరవేర్చాడు.అలాగే నేను ప్రవచనం చేయాలి కాబట్టి చేస్తాను. ఎంతమంది వచ్చారన్న దానితో నిమిత్తం లేదు. ఒకడే వస్తే ఒకలా, పదివేలమంది వస్తే ఒకలా చెప్పకూడదు. ఎంతమంది వచ్చారన్న దానితో నాకు సంబంధం లేదు. ఎంతమంది వింటున్నారన్న దాన్నిబట్టి చెప్పాల్సి వస్తే... ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు ఒక్క రాముడికే చెప్పకూడదు, భగవద్గీతను ఒక్క అర్జునుడికే శ్రీ కృష్ణుడు చెప్పకూడదు, భాగవతాన్ని శుకబ్రహ్మ ఒక్క పరీక్షిత్తుకే చెప్పకూడదు. అంటే ధర్మ నిర్వహణ అవతలివారిని బట్టి ఉండదు. నేను నా ధర్మం చేసుకెళ్ళి పోతానంతే. ఇందులో రాగద్వేషాలుండవు.ఈ దేశంలో స్త్రీలు పరమాద్భుతమైన ఉపాసన చేసారు. ఆయనకున్న గుణ విశేషాలతో సంబంధం లేకుండా దైవస్వరూపమయిన భర్తను దైవంగానే భావించారు. ధర్మశాస్త్ర విశేషమేమిటంటే... పురుషుడు చేసిన పుణ్యంలో సగం భార్యకు వెడుతుంది. కానీ ఆమె చేసే పుణ్యంలో సగభాగం పురుషుడికివ్వరు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top