పొట్టకు హుచారు

Special Dishes For Rasam Recipe - Sakshi

పండగ హడావుడి ముగిసింది. అయినవాళ్ల మధ్య, ఆత్మీయుల మధ్య విందులు హెవీగా సాగి ఉంటాయి. గారెలు, బూరెలు, చికెన్, మటన్‌... ఒకటికి నాలుగు ముద్దలు పొట్టకు ఎక్స్‌ట్రా పని పెట్టి ఉంటాయి. ఇక చాలు... ఒకటి రెండు రోజులు డైనింగ్‌ టేబుల్‌ని తేలిగ్గా ఉంచుదాం. జీర్ణాశయానికి విశ్రాంతినిద్దాం. అందుకు మార్గం? చారును శరణు కోరడమే. మిరియాలు, జీలకర్ర, నిమ్మకాయ, కొత్తిమీర, టొమాటో వీటన్నిటితో పొగలుగక్కే చారు చేయండి. రసంతో అజీర్తికి విరసం పలకండి.

నిమ్మరసం – కొత్తిమీర రసం
కావలసినవి: కంది పప్పు – పావు కప్పు (తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించాలి); పసుపు – పావు టీ స్పూను. పొడి కోసం: కొత్తిమీర – అర కప్పు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5

పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఎండు మిర్చి – 2; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నిమ్మ రసం – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా.

తయారీ:
►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేయాలి
►మిక్సీలో అర కప్పు కొత్తిమీర, రెండు టీ స్పూన్ల జీలకర్ర, అర టీ స్పూను మిరియాలు, రెండు పచ్చి మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా చేసి, పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి కాగాక, అర టీ స్పూను ఆవాలు వేసి చిటపటలాడించాలి
►కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి
►కొత్తిమీర మిశ్రమం జత చేయాలి ∙ఇంగువ, పసుపు జత చేసి మరోమారు కలపాలి
►పప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి
►సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాక, దింపేయాలి
►నిమ్మ రసం జత చేసి కలియబెట్టాలి
►కొత్తిమీరతో అలంకరించాలి.

మైసూర్‌ రసం
కావలసినవి: పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు ; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, టొమాటో తరుగు – అర కప్పు; చింతపండు రసం – ఒక కప్పు (పల్చగా ఉండాలి); కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; బెల్లం పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు;

పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ముప్పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి
►మంట బాగా తగ్గించి మరోమారు వేయించాలి
►కొబ్బరి తురుము జత చేసి మరి కాసేపు వేయించి దింపేయాలి
►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో ముందుగా టొమాటో గుజ్జు, చింతపండు రసం వేసి ఉడికించాలి
►కరివేపాకు, పసుపు, ఉప్పు, బెల్లం పొడి జతచేసి బాగా కలిపి మరిగించాలి
►ఉడికించిన కందిపప్పు, నీళ్లు జత చేసి కొద్దిసేపు మరిగించాలి
►తయారుచేసి ఉంచుకున్న మైసూర్‌ రసం పొడి జత చేయాలి
►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, మరుగుతున్న రసంలో వేసి కలపాలి
►చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి.

మిరియాలు జీలకర్ర రసం
కావలసినవి: మిరియాలు – అర టేబుల్‌ స్పూను; జీలకర్ర – అర టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 7.
చింతపండు – అర టేబుల్‌ స్పూను (అర కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి); టొమాటో తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత.

పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు –పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►చింతపండు రసం తీసి పక్కన ఉంచాలి
►మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి
►కరివేపాకు, మిరియాల పొడి మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి
►చింతపండు రసం, నీళ్లు, ఉప్పు జత చేసి, బాగా కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి
►సుమారు పావు గంట సేపు మరిగించాక దింపేయాలి.

పైనాపిల్‌ రసం
కావలసినవి: కంది పప్పు – పావు కప్పు; నీళ్లు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనా పిల్‌ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; రసం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత.

పొడి కోసం: జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు –ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6

పోపు కోసం: నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా

తయారీ:
►కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి, దింపి, పప్పు గుత్తితో మెత్తగా చేసి, పక్కన ఉంచాలి
►మిక్సీలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు (పొడి కోసం చెప్పిన వస్తువులు) వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి, తీసి పక్కన ఉంచాలి
►అర కప్పు పైనాపిల్‌ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి
►పావు కప్పు టొమాటో ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి, తీసి పక్కనుంచాలి
►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి
►మిరియాల పొడి మిశ్రమం జత చేసి కొద్దిసేపు వేయించాలి
►కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి
►టొమాటో గుజ్జు జత చేసి బాగా వేయించాలి
►పైనాపిల్‌ గుజ్జు జత చేసి రెండు నిమిషాల పాటు వేయించాక, ఉడికించిన పప్పు జతచేసి బాగా కలపాలి
►పైనాపిల్‌ తరుగు, టొమాటో తరుగు, ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి, బాగా కలపాలి
►రెండు టీ స్పూన్ల రసం పొడి వేసి బాగా కలియబెట్టాలి
►పదినిమిషాల పాటు మరిగించాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి.

పన్నీర్‌ రసం
కావలసినవి: చింత పండు – నిమ్మకాయంత; నీళ్లు – 3 కప్పులు; రోజ్‌ వాటర్‌ (పన్నీరు) – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిర్చి – 3; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; రోజ్‌ పెటల్స్‌ – కొన్ని ; ఉప్పు – తగినంత; పంచదార – తగినంత; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – అర టీ స్పూను.

తయారీ:
►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాక, ఉడికించిన పప్పు నీళ్లు జత చేయాలి
►తగినంత ఉప్పు, పంచదార వేసి కలియబెట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె/నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►చింతపండు రసం జత చేయాలి
►రెండు నిమిషాల పాటు మరిగాక దింపేసి, రోజ్‌ వాటర్‌ జత చేయాలి
►కొత్తిమీర, గులాబీ రేకలతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి.

టొమాటో చారు
చారుకావలసినవి: బాగా పండిన టొమాటో తరుగు – 2 కప్పులు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); నీళ్లు – 2 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 4; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; బెల్లం పొడి – అర టేబుల్‌ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను

పొడి కోసం: ఎండు మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ధనియాలు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు

తయారీ:
►స్టౌ మీద బాణలి వేడయ్యాక పచ్చి సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి
►ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, మిరియాలు జత చేసి బాగా వేయించాక, జీలకర్ర జత చేసి మరోమారు వేయించి దింపేయాలి
►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే, చారు పొడి సిద్ధమైనట్లే.
►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడం మొదలయ్యాక, ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి
►కరివేపాకు జత చేసి ఒక నిమిషం వేయించాక, టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు జత చేసి కొద్దిసేపు వేయించాలి
►టొమాటో గుజ్జు బాగా మెత్తబడ్డాక, వెల్లుల్లి తరుగు, చింత పండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టాలి
►నీళ్లు పోసి మరిగించాక, మంట బాగా తగ్గించి, రసం పొడి జత చేయాలి
►కొత్తిమీర వేసి బాగా కలిపి దింపి, మూత ఉంచాలి
►వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది
►సూప్‌లా తాగినా కూడా రుచిగానే ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top