పాప ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది...

Some Genetic Problems Are Communicated By Crying Children - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా పాపకు రెండున్నర నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది.  డాక్టర్‌గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’ అంటూ కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు పరిష్కారం సూచించండి.  

పిల్లలు అదేపనిగా ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలాంటి ప్రమాదమూ  లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలివి... ఆకలేయడం, దాహంవేయడం, భయపడటం, మూత్ర విసర్జన కారణంగా డయపర్‌ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (ఇలాంటివి ఏవైనా సెలబ్రేషన్‌ సందర్భంగా బాణాసంచా కాలుస్తున్నప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం చాలా సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, వారున్నచోట పొగ కమ్ముకుపోయి ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉండటం.

వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్‌ఫెక్షన్‌లు రావటం, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్‌ కోలిక్‌), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను అన్నింటినీ పిల్లలు ఏడుపు ద్వారానే కమ్యూనికేట్‌ చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫెన్‌టైల్‌ కోలిక్‌) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది.

ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపునకు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్‌ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్‌ రైట్‌ పొజీషన్‌), లేదా కొద్దిసేపటికోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్‌ పొజిషన్‌), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్‌ బర్పింగ్‌)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్‌ సెడేషన్‌ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్‌ సెడేషన్‌ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

పాప ఒంటిమీద ఈ మచ్చలేమిటి?
మా పాపకు 13 ఏళ్లు. దాదాపు ఆర్నెల్లుగా ఆమె ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు రావడానికి కారణం ఏమిటి? అవి పోవడానికి ఏం చేయాలి?

మీ పాపకు ఉన్న కండిషన్‌ నీవస్‌ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్‌ నీవస్‌ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్‌డ్‌ స్పాట్స్‌ ఆన్‌ ద స్కిన్‌) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివి. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్‌ మచ్చలు. ఒంటిపై మచ్చలు పుట్టకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు  10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్‌ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా  ఎక్స్‌పోజ్‌ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్‌ బేసల్‌ సెల్‌ కార్సినోమా అనే కండిషన్‌ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది.

వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్‌నార్మాలిటీస్‌ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖం ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి పైన చెప్పిన అపాయకరమైన పరిస్థితులేమీ మీ పాపకు లేనట్లుగా తెలుస్తోంది. కాబట్టి మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్‌ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా  క్యాన్సర్‌ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది.

ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్‌... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్‌... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్‌... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం)  పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావయొలెట్‌ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... వాటిని ఎక్సెషన్‌ థెరపీతో  తొలగించవచ్చు. మీరొకసారి చర్మవ్యాధి నిపుణులను కలవండి.
డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top