దారి చూపిన ఊరు | Shown to lead to hometown | Sakshi
Sakshi News home page

దారి చూపిన ఊరు

Jul 21 2014 11:04 PM | Updated on Sep 2 2017 10:39 AM

దారి చూపిన ఊరు

దారి చూపిన ఊరు

ఏ ఇబ్బందో, కష్టమో వచ్చినప్పుడో... ప్రత్యామ్నాయం కోసం వెదుకుతాం. కొత్త దారి ఒకటి కనుక్కుంటాం. కొందరు మాత్రం కష్టాలు, నష్టాలు దరి చేరక మునుపే ప్రత్యామ్నాయాలను వెదుకుతారు.

 స్ఫూర్తి
 
కొత్తదారి ఎప్పుడు కనిపిస్తుంది?

ఏ ఇబ్బందో, కష్టమో వచ్చినప్పుడో... ప్రత్యామ్నాయం కోసం వెదుకుతాం. కొత్త దారి ఒకటి కనుక్కుంటాం. కొందరు మాత్రం కష్టాలు, నష్టాలు దరి చేరక మునుపే ప్రత్యామ్నాయాలను వెదుకుతారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు.
 
కంబకాయ గ్రామం అలాంటి ముందు చూపుతోనే వ్యవహరించింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. ‘గ్యాస్ ధరల కష్టాలు’ అనే మాట వినిపించక ముందే ఊళ్లోకి బయోగ్యాస్‌ను ఆహ్వానించింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం గా నిలవడమే కాదు తెలుగునాట అగ్రస్థానంలో నిలిచింది.
   
ఇంట్లోకి వంటగ్యాస్ రాగానే పండగ కాదు. రోజురోజూకు పెరుగుతున్న ధరను తట్టుకునే శక్తి ఉండాలి. అలాంటి శక్తి ఎంతమందికి ఉంది? కంబకాయ గ్రామంలో చాలామందికి గ్యాస్‌ధరల పెరుగుదలతో సంబంధం లేదు. ‘గ్యాస్ ధర మళ్లీ పెరిగింది’లాంటి వార్తలు చదివి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితమే ఆ గ్రామానికి ‘బయో గ్యాస్’ రూపంలో ఒక వరం లభించింది. ఇక భయమెందుకు?
 
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉంది కంబకాయ గ్రామం. రెండు దశాబ్దాల క్రితం అప్పటి గ్రామ సర్పంచ్ పాగోటి రాజారావునాయుడు పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేశారు. అప్పటికది ఊరికి కొత్త. దాని ప్రయోజనాల గురించి కూడా ఎక్కువమందికి తెలియదు. అయితే కాలక్రమంలో బయోగ్యాస్ విలువ తెలుసుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు ఒక్క కంబకాయ గ్రామంలోనే 320కి పైగా బయోగ్యాస్ ప్లాంట్‌ల నిర్మాణం జరిగింది. ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. చుట్టుపక్కల 70 గ్రామాల వరకు ఈ ఊరిని స్ఫూర్తిగా తీసుకొని బయోగ్యాస్ ప్లాంట్‌లు నిర్మించాయి, నిర్మిస్తున్నాయి.
 
ఎలా తయారుచేస్తారు?


మొదట ట్యాంకు నిర్మిస్తారు. ఈ ట్యాంకు భూమి అడుగు భాగంలో ఉంటుంది. ట్యాంకుకు ప్రక్కన కానీ, ట్యాంకు పైన కానీ ఒక కుండీ నిర్మిస్తారు. ఆ కుండీ ద్వారా పేడ, నీరు కలిపి బాగా చిక్కటి ద్రవ పదార్థంలా తయారు చేసి ట్యాంకులోకి విడిచిపెడతారు. ట్యాంకులో ప్రవేశించిన పేడ మూడు రోజులకి (ప్రారంభంలో) గ్యాస్‌గా మారుతుంది. ఆ ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్ సహాయం తో గ్యాస్ పొయ్యి వరకు సరఫరా అవుతుంది. మరో వైపు ట్యాంకు లోపల వ్యర్థపదార్థం రెండవ వైపు ఏర్పాటు చేసిన ఔట్‌లెట్ ద్వారా బయటకు వెళుతుంది. దీన్ని ‘స్లర్రీ’ అంటారు. ప్రతిరోజూ పశువుల పేడను ద్రవపదార్థంగా మార్చి ట్యాంకులో వేస్తుండాలి.
 
ప్రయోజనం ఏమిటి?

‘‘బయోగ్యాస్ వినియోగం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది’’ అంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్ పి.కుసుమకుమారి. గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయమనే కాకుండా, బయోగ్యాస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి.
     
వంట చేసే మహిళలకు కళ్ల జబ్బులు, ఇతర హానికరమైన సమస్యలు ఉండవు. బయోగ్యాస్ వినియోగం అనంతరం విడుదలయ్యే వ్యర్థ పదార్థం ‘స్లర్రీ’ని పంట పొలాలలో ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ సేంద్రియ ఎరువు వినియోగం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
     
గ్యాస్ వృథా అవుతుందనిగానీ, ప్రమాదాలు సంభవిస్తాయనే భయం కానీ గృహిణులకు ఉండదు.  
     
బయోగ్యాస్‌ద్వారా విద్యుద్దీపాలనూ వెలిగించుకోవచ్చు.
 
ప్రభుత్వ చేయూత...
 
ఒక ప్లాంట్ నిర్మాణానికి సుమారు ఇరవైవేల రూపాయల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ (నెడ్‌కాప్) ద్వారా ఒక్కో ప్లాంట్‌కు ఎనిమిదివేల రూపాయల సబ్సీడి ఇస్తోంది. సబ్సీడీలో భాగంగా పొయ్యి, ఇతర పరికరాలను కూడా సరఫరా చేస్తారు.
 
పర్యావరణ మిత్ర...
 
బయోగ్యాస్‌కు ముందు వంటచెరుకు కోసం చెట్లను నరికేసేవారు. దీని ప్రభావం పర్యావరణంపై పడేది. బయోగ్యాస్ పుణ్యమా అని చెట్లకు ముప్పు తప్పింది. దోమల బెడద తప్పింది. రసాయనిక ఎరువులు కొనే అవసరం తప్పింది. ఒక్కటా రెండా... బయోగ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ్యాస్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ తెలుగునాట అగ్రస్థానంలో నిలిచి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న కంబకాయ బాటలో ప్రయాణించడానికి ఎన్నో గ్రామాలు స్ఫూర్తి పొందుతున్నాయి.

 - సదాశివుని కృష్ణ, సాక్షి, నరసన్నపేట
 ఫొటోలు: చల్ల మల్లేశ్వరరావు

 
 1. ట్యాంక్‌లో పేడ కలుపుతున్న దృశ్యం
 2. స్లర్రీ వినియోగించిన పొలంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం
 3. బయోగ్యాస్ ద్వారా వంట చేస్తున్న గృహిణి

 
 ఎలాంటి సమస్యా లేదు...
 ఇరవై సంవత్సరాల నుంచి బయోగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాం. ఇప్పటికి వరకు ఏ విధమైన సమస్య రాలేదు. ప్లాంట్ నిర్మాణానికి స్వామిబాబు వజ్రమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (ఎస్‌వీసిటీ) స్వచ్ఛంద సంస్థ సహకరించింది.
 - పాగోటి లక్ష్మి, గృహిణి, కంబకాయ
 
 వంటతో పాటు వ్యవసాయోత్పత్తికీ...
 బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్లర్రీని సేంద్రియ ఎరువుగా వినియోగించడం వల్ల అధిక దిగుబడి, భూమి సారవంతంగా తయారవడం వంటి మంచి ఫలితాలు ఉన్నాయి. వంట ప్రయోజనం కంటే వ్యవసాయోత్పత్తికి ఇది మరీ ప్రోత్సాహంగా ఉంది.
 - గుజ్జిడి నాగేశ్వరరావు, రైతు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement