వెండితెర వెనుక స్త్రీ మహాలక్ష్మి

Sakshi Exclusive Interview With Krishnaveni And Anuradha

భానుమతి డైనమిక్‌ కృష్ణవేణి

కోట్లుంటే సరిపోదు అనురాధ

స్త్రీకి ఉండనిదే ఆర్థిక స్వాతంత్య్రం. అదుంటే అన్ని స్వాతంత్య్రాలూ వచ్చేస్తాయి. ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. చేతి నిండా డబ్బు ఉండటం కాదు. ఆ డబ్బును ఇష్టానికి ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండటం. కృష్ణవేణి, ఆమె కూతురు అనురాధ.. స్వప్నాదత్, ప్రియాంకాదత్, లక్ష్మీ మంచు .. వీళ్లకు.. సినిమాలు నిర్మించడం ఇష్టం. నిర్మిస్తే డబ్బు రావచ్చు.. పోవచ్చు. పోతుందేమోనని ఇష్టాన్ని చంపుకోలేదు వీళ్లు! మంచి మంచి సినిమాలు తీశారు. తీస్తున్నారు. రేపు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా.. మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’గా వెలిగిన.. వెలుగుతున్న.. సినీ మహిళా నిర్మాతలతో సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలు ఇవి. 

►చిత్రసీమకు సంబంధించిన తొలి తరం తారల్లో గాయనిగా, నటిగా, నిర్మాతగా మీకు మంచి పేరు ఉంది. నటిగా కెరీర్‌ ఎలా మొదలైందో చెబుతారా?
కృష్ణవేణి: ‘సతీ అనసూయ’ (1936)లో బాలనటిగా నటించాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. అంతకుముందు డ్రామాల్లో నటించాను. అప్పట్లో మా పాత్రలకు మేమే పాడుకోవాలి. అలా గాయనిగా కూడా మంచి పేరు వచ్చింది. మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య అప్పారావుగారు నిర్మించిన ‘భోజ కాళిదాసు’కి నన్ను సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్నారు. అందులో కన్నాంబ ఫస్ట్‌ హీరోయిన్‌. ఆ తర్వాత ఆయన బేనర్‌లోనే ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా చేశాను. నటిగా నన్ను బాగా ఎస్టాబ్లిష్‌ చేసిన సినిమా అది. 15 సినిమాలకు పైగా హీరోయిన్‌గా నటించాను.

►మరి నిర్మాణరంగంవైపు ఎలా వచ్చారు?
కృష్ణవేణి: ‘జీవనజ్యోతి’ తర్వాత మీర్జాపురం రాజాగారితో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. అప్పుడు నాకు 17 ఏళ్లు. జయా పిక్చర్స్‌పై నా భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేదాన్ని. అలా నిర్మాణరంగంవైపు వచ్చాను. ఆ సంస్థ పేరుని ఆ తర్వాత ‘శోభనాచల పిక్చర్స్‌’గా మార్చాం. ‘గొల్లభామ’ (1947), ‘మన దేశం’ (1949), ‘లక్ష్మమ్మ’ (1950), ‘దాంపత్యం’ (1957) వంటి సినిమాలు నిర్మించాం. కొన్నింటిలో నేను కూడా నటించాను. ‘మన దేశం’తో ఎన్టీఆర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఇది నిర్మాతగా నాకు కంప్లీట్‌ సినిమా. ఎన్టీఆర్‌తో ‘పల్లెటూరి పిల్ల’ కూడా తీశాం. నా భర్తతో కలిసి ప్రొడక్షన్‌ చూసుకునేదాన్ని. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కూడా కూర్చునేదాన్ని. షూటింగ్‌ షెడ్యూల్స్‌ ప్లాన్‌ అంతా చేసేదాన్ని.

►భానుమతిగారు, విజయ నిర్మలగారు, మీరు.. ఇలా కొందరు నిర్మాతగా చేశారు. తర్వాత మీ అమ్మాయి (అనురాధా దేవి). ఇప్పుడు కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మహిళా నిర్మాతలే ఉన్నారు...
కృష్ణవేణి: భానుమతి డైనమిక్‌. ఆవిడని చూసి అందరూ గడగడలాడేవాళ్లు. అంత ధైర్యం ఉంటే ఇక్కడ నిర్మాతగా రాణించవచ్చు. లేకపోతే కష్టం. ఇక విజయనిర్మల కూడా చాలా ధైర్యవంతురాలు. చాలా స్వీట్‌ పర్సన్‌. భానుమతి, విజయనిర్మలలది ఒక మొండి వైఖరి. అలా ఉంటే నిర్మాతలుగా చేయొచ్చు. నిర్మాత అంటే మగవాళ్లే అనే ఫీలింగ్‌ ఏదో పడిపోవడం వల్ల కొందరు రావడంలేదేమో.
అనురాధ: అమ్మాయి అంటే నటిగా ఓకే కానీ నిర్మాతలుగా రానివ్వరు. బ్యాకింగ్‌ ఉంటే ఓకే. కోట్లు ఉన్నాయి.. నిర్మాత అయిపోవచ్చు కదా అనుకుంటే కుదరదు. ర్యాపో ఉండాలి. ఎంతోమంది నా దగ్గరకు సినిమాలు తీస్తామని వస్తారు. కానీ ఎంకరేజ్‌ చేయను. ఎందుకంటే బ్యాగ్రౌండ్‌ లేకపోతే కష్టం.

►మీరన్నట్లు నిర్మాతలంటే పురుషులే అనే ఫీలింగ్‌ చాలామందిలో ఉంది. అలాంటి పరిస్థితిలో మీకు నిర్మాణం ఏమైనా అసౌకర్యంగా అనిపించేదా?
కృష్ణవేణి: చాలా హ్యాపీగా ఉండేది. కాశీమజిలీ కథలు చదివేదాన్ని. ఇంకా చాలా పుస్తకాలు చదివి, వాటిలో ఉన్న మంచి పాయింట్స్‌తో సినిమాలు నిర్మించేవాళ్లం. అంతా సాఫీగా సాగేది. కొన్ని సినిమాల్లో డబ్బులు పోయినా అదేం పెద్ద బాధ అనిపించలేదు. 
అనురాధ: శోభనాచల స్టూడియో మాదే. నాన్నగారు పెద్ద బ్యాకింగ్‌. ఇక అసౌకర్యంగా ఎందుకు ఉంటుంది? (నవ్వుతూ). చెప్పాలంటే చాలామంది అవకాశాల కోసం అమ్మని కాకాపట్టేవాళ్లు. స్ట్రాంగ్‌ బ్యాగ్రౌండ్‌ ఉంటే ఎలాంటి అసౌకర్యం ఉండదు.

►అమ్మ తర్వాత మీరు నిర్మాతగా మారారు. మీరు ఇష్టపడి వచ్చారా? వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనా?
అనురాధ: నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నన్ను నిర్మాతగా కంటిన్యూ అవ్వమన్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నాకంతగా లేదు. అయితే అప్పటికి కన్నడంలో రాజ్‌కుమార్‌గారితో ‘భక్త కుంభార’ అనే సినిమాని నాన్నగారు నిర్మిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కంటిన్యూ చేయలేనని నన్ను, నా భర్త (నంగనూరు శ్రీనివాసరావు) ను ఆ సినిమా ప్రొడక్షన్‌ చూసుకోమన్నారు. ఆ సినిమాని నాగేశ్వరరావుగారితో తెలుగులో ‘చక్రధారి’గా రీమేక్‌ చేశాను. ఆ తర్వాత ఆయనతోనే ‘రాముడే రావణుడైతే’ సినిమా తీశాం. ఈ సినిమాకి దాసరిగారు డైరెక్టర్‌. మా బేనర్‌లో ఆయనకు ఫస్ట్‌ సినిమా. ఏయన్నార్‌గారికి ఇది ఫస్ట్‌ సినిమా స్కోప్‌ పిక్చర్‌. ఆ తర్వాత ఏయన్నార్‌–దాసరిగార్ల  కాంబినేషన్‌లో ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే సినిమా తీశాం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనే తీసిన ‘రాముడు కాదు కృష్ణుడు’ కూడా సూపర్‌ హిట్‌ అయింది. అలాగే ఏయన్నార్‌ హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తీసిన ‘అనుబంధం’ సూపర్‌ హిట్‌ అయింది. మురళీమోహన్, శోభన్‌బాబులతో కూడా సినిమాలు తీశాం.

►నిర్మాణం మీకెలా అనిపించింది? ఏవైనా చేదు అనుభవాలు?
అనురాధ: నేను పెరిగిందే సినిమా ఇండస్ట్రీలో. నాగేశ్వరరావుగారు నన్ను బాగా ఎత్తుకునేవారు. ఎన్టీఆర్‌గారు బాగా తెలుసు. మా బేనర్‌లో శోభన్‌బాబుగారు నటించారు. అందరూ తెలిసినవాళ్లే కావడంతో నిర్మాతగా ఇబ్బందిపడలేదు. పైగా దాసరి నారాయణరావుగారు నన్ను సొంత సిస్టర్‌లా అనుకునేవారు. ఆయన నాకు ‘రాఖీ బ్రదర్‌’.

►బ్యాగ్రౌండ్‌ లేనివాళ్లకయితే ఇబ్బందులు ఎదురవుతాయా?
అనురాధ: బ్యాడ్‌ సైడ్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ నాకు తెలియదు. ఎందుకంటే నా లైఫ్‌ అంతా బాగా గడిచింది. అయితే ఇక్కడ పురుషాధిక్యం ఉంటుంది. నిర్మాత పురుషుడైతే ఒక రకంగా, ఆడవాళ్లయితే ఒకరకమైన ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. బేసిక్‌గా మేల్‌ డామినేషన్‌. అంత ఈజీగా స్త్రీలను నిర్మాతలుగా అంగీకరించే పరిస్థితి లేదు. చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. కానీ ఎక్కడ లేవని సినిమా పరిశ్రమ విషయాలను బయటకు చెప్పమంటారు? ప్రపంచం మొత్తం జరుగుతున్నదే సినిమా పరిశ్రమలోనూ జరుగుతోంది.

►అయితే ఒక లేడీ నిర్మాత ఉన్నప్పుడు ఫీమేల్‌ టెక్నీషియన్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వీలు ఉంటుంది కదా?
అనురాధ: అది కరెక్ట్‌. నా బేనర్‌లో సినిమా చేసిన ఎవరూ ఇబ్బందిపడలేదు. వాళ్లు సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించేవాళ్లం. అయితే హీరోయిన్‌ సాక్షీ శివానంద్‌ లాంటి వాళ్లు మమ్మల్నే ఇబ్బందిపెట్టేవాళ్లు. వాళ్లంతట వాళ్లు కాస్ట్యూమ్స్‌ తెచ్చుకుని, డైరెక్టర్‌కి కూడా చూపించకుండా నేరుగా లొకేషన్‌కి వచ్చేయడం వంటివి చేసేవాళ్లు.

►17 సినిమాలు నిర్మించిన క్రెడిట్‌ మీది. ఎక్కువ సినిమాలు నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్‌గా ‘లిమ్కా బుక్‌’ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు సినిమా నిర్మాణం ఆపేశారు?
అనురాధ: ఆలయ దీపం (1984), ఇల్లాలే దేవత (1985) వంటి సినిమాలు తీశాం. ‘ఇల్లాలే దేవత’ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఓ పదేళ్లు నిర్మాణం మానుకున్నాం. నవీన్, అబ్బాస్, సిమ్రాన్‌ హీరో హీరోయిన్లుగా ‘ప్రియా ఓ ప్రియా’ (1997) సినిమాతో మళ్లీ నిర్మాణం మొదలుపెట్టాను. ఆ తర్వాత నవీన్, రవితేజతో ‘ప్రేమించే మనసు’, జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్‌ జంటగా ‘మా పెళ్లికి రండి’ సినిమాలు నిర్మించాను. అయితే ‘మా పెళ్లికి రండి’ (2001) సినిమా అప్పుడు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సినిమా థియేటర్‌లో ఉండగానే మాకు తెలియకుండా ఎవరో అమ్మేశారు. దాంతో కేబుల్‌లో వచ్చింది. సినిమా బాగున్నా నిర్మాతగా నష్టపోయాను. ఇక ఆ తర్వాత నిర్మాతగా ఫుల్‌స్టాప్‌ పెట్టేశాను. ఆ సినిమా అప్పుడు నిర్మాతగా నన్ను అణగదొక్కాలని చాలామంది ప్రయత్నించారు. సినిమా విడుదల చేయకుండా అడ్డుకోవడానికి ట్రై చేశారు. దాసరిగారి సహాయంతో ఎలాగో విడుదల చేశాను. 2005లో మావారు చనిపోయారు. నాకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. మూడో అమ్మాయి మ్యారీడ్‌ లైఫ్‌ బాగుంది. అయితే భర్త, ఇద్దరు కుమార్తెలు చనిపోవడంతో ఇక నేను ప్రొడక్షన్‌ కొనసాగించలేకపోయాను.

సౌత్‌ అంటే చిన్నచూపు – అనురాధ
నాకు ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు వచ్చింది. ఆ అవార్డుకి ఎవరో ఒకరు నా పేరుని రిఫర్‌ చేయాలి. అవార్డు తీసుకుని వచ్చేశాక ఎవరు రిఫర్‌ చేసి ఉంటారా? అని అడిగితే.. మన తెలుగు పరిశ్రమ నుంచి నా పేరుని ప్రతిపాదించలేదు. కన్నడ పరిశ్రమ తరఫున నాకు వచ్చిన అవార్డు అది. కన్నడంలో మమ్మల్ని చాలా గౌరవిస్తారు. రాజ్‌కుమార్‌గారితో తీసిన ‘భక్త కుంభార’కి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. కన్నడ స్టేట్‌ అవార్డు కూడా వచ్చింది. అయితే నేషనల్‌ అవార్డు విషయంలో చిన్న చేదు అనుభవం ఎదురైంది. మన దక్షిణాది పరిశ్రమవారంటే ఉత్తరాదివారికి చిన్న చూపు. ‘భక్త కుంభార’ సినిమాని నేషనల్‌ అవార్డుకి పంపించాం. అయితే అవార్డు దక్కలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. అసలు ఆ సినిమా బాక్సుని అవార్డు కమిటీవాళ్లు ఓపెన్‌ కూడా చేయలేదట. సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అంటే అక్కడివారికి అంత చిన్న చూపు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top