కొత్తరకం మూలకణాల గుర్తింపు!

Recognition of new stem cells - Sakshi

మన పేగుల్లో కొత్త రకం మూలకణాలు కొన్ని ఉన్నట్లు జూరిక్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కణాలు తమ పరిసరాల్లోని మూలకణాలను చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు. పేగుల్లోపలి పొర ఎప్పటికప్పుడు కొత్తగా మారేందుకు కూడా ఈ కణాలే కారణం. ఈ కణాలు మూలకణాలను ప్రేరేపించకపోతే పొర నశించిపోతుంది. అవసరమైన దాని కంటే ఎక్కువసార్లు ప్రేరేపిస్తే పేగు కేన్సర్‌ లక్షణాలు కనిపిస్తాయి. కొత్తగా గుర్తించిన ఈ విషయాలన్నీ పేగు కేన్సర్, మంట/వాపు చికిత్సలకు ఉపయోగపడుతుందని అంచనా. మన పేగుల్లోపలి పొర నిర్దిష్ట కాలం తరువాత నశించిపోయి కొత్త పొర ఏర్పడుతూంటుందని మనం చదువుకుని ఉంటాం.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిరోజూ దాదాపు వెయ్యి కోట్ల కొత్త కణాలు పాతవాటి స్థానంలో వచ్చి చేరుతూంటాయి. శరీరం పోషకాలను శోషించుకునేందుకు ఈ పొరే కారణం. పొర నశించిపోయింది, కొత్త పొర ఏర్పాటు చేయాలన్న సంకేతాలు మూలకణాల్లాంటి కణాలు అందిస్తాయని, ఇవి పేగుల్లో అక్కడక్కడ ఉండే చిన్న ముడుతల్లో ఉంటాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కోనార్డ్‌ బాస్లర్‌ అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో ఈ కణాలు ఏం చేస్తాయో తెలిసిందని, నిర్దిష్ట ప్రోటీన్‌ రూపంలో ఈ కణాల నుంచి అందే సంకేతాలు పేగుల్లోపలి పొరను పునరుజ్జీవింప చేస్తుందని వివరించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top