
అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు
జేఎన్‌టీయూహెచ్ గ్రీన్ సిగ్నల్
కాలేజీల్లో తనిఖీ నివేదికలన్నీ నామమాత్రమే
50 కాలేజీల్లో డేటాసైన్స్‌కు బోధకులు కరువు
38 కాలేజీల్లో సీఎస్‌ఈకి అనుభవజ్ఞులైన అధ్యాపకుల్లేరు
తనిఖీ నివేదికలపై తూతూ మంత్రం సమీక్ష
అనుబంధ గుర్తింపులో భారీగా రాయ‘బేరాలు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాదాపు అన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం (జేఎన్‌టీయూహెచ్) అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు కాలేజీల తనిఖీ నివేదికలపై వర్సిటీ అధికారులు గురువారం సమీక్షించారు. అనేక కాలేజీల్లో సరిపడా బోధకులు లేరని, మౌలిక వసతులు లేవని తనిఖీ బృందాలు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, వర్సిటీ ఉన్నతాధికారులు వీటిని పెద్దగా పరిగణనలోనికి తీసుకోకుండా, లోపా లను సరిచేసుకునేందుకుమరో అవకాశం ఇవ్వాలని మాత్రమే నిర్ణయించినట్టు సమాచారం.
కాలేజీలు ప్రారంభించే నాటికి ఫ్యాకల్టీని నియమించుకోవాలని, లేబోరేటరీలు, మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేటు కాలేజీలకు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తు న్నాయి. ఫ్యాకల్టీ లేకుండా గుర్తింపు ఇవ్వడం ఏమిటని విద్యావేత్తలు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు ఇచ్చాక కాలేజీలు స్పందించకపోతే చేసేది ఏమీ లేదని పేర్కొంటున్నారు.
ఒత్తిడా? డీలానా?
ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేని కాలేజీల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆగ్రహం వ్యక్తంచేసింది. తనిఖీల్లో ఈ అంశాలను ప్రధానంగా చూడాలని సూచించింది. వాస్తవానికి ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేనప్పుడు సెక్షన్లు తగ్గించడమో, గుర్తింపు నిలిపివేయడమో చేయాలి. కానీ, వీటి ఏర్పాటుకు కాలేజీలకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించా రు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ డీల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక ప్రైవేటు కాలేజీకి చెందిన వ్యక్తితో యూనివర్సిటీ కీలక అధికారి అంటకాగడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం వల్లే అందరికీ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వస్తోందని ఆయన సమర్థిచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ కోర్సులకు అధ్యాపకులెక్కడ?
ఇంజనీరింగ్ కాలేజీలను జేఎన్‌టీయూహెచ్ బృందాలు కొన్ని నెలల క్రితమే తనిఖీ చేశాయి. 140 కాలేజీల్లో వాస్తవ పరిస్థితితో నివేదిక ఇచ్చాయి. 50 కాలేజీల్లో డేటాసైన్స్ బోధించేందుకు మాస్టర్ డిగ్రీ చేసిన నిపుణులు లేరని తేల్చారు. కొన్ని కాలేజీలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారిని బోధకులుగా చూపించే ప్రయత్నం చేశాయి. వారి పాన్‌కార్డులను పరిశీలిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తు న్నట్టు తేలింది. ఆల్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐఎంఎల్ కోర్సుల్లో సీట్లు పొందిన కాలేజీల్లోనూ నిపుణుల కొరత కనిపిస్తోంది.
గుర్తింపులేని సంస్థల నుంచి డిప్లొమా కోర్సులు చేసిన వారిని బోధకులుగా చూపించినట్టు తేలింది. రెండుమూడు సెక్షన్లకు ఒకే అధ్యాపకుడు ఉన్న కాలేజీల సంఖ్య 24 ఉందని గుర్తించారు. డిజిటల్ లేబొరేటరీలు పేరుకు మాత్రమే ఉంటున్నాయి. అందులో లాంగ్ లెర్నింగ్ లాంగ్వేజ్, ఇతర ప్రోగ్రామింగ్ ఫైల్స్ కూడా కన్పించడం లేదని తనిఖీ బృందాలు వర్సిటీకి నివేదించినట్టు తెలిసింది. డేటాసైన్స్‌ను విశ్లేషించేందుకు లేబోరేటరీలో అవసరమైన ప్రోగ్రామింగ్ లేదని గుర్తించారు.