
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్స్ పేరుతో కొత్త దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో నైపుణ్య శిక్షణ వక్రమార్గం పడుతోంది. ముఖ్యంగా స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రైవేటు కాలేజీలు స్కిల్స్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. కాలేజీతో సంబంధం లేని కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వకుండా కేవలం ఉద్యోగం పొందేందుకు చాట్ జీపీటీ, ఏఐ సంబంధిత టెక్నాలజీపైనే షార్ట్ కట్స్ బోధిస్తున్నాయి. ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీల్లో కాకుండా, స్కిల్ కేంద్రాల్లో బోధిస్తున్నారు. పరీక్షలు నిర్వహించడం, డిగ్రీలు ఇవ్వడం మాత్రం కాలేజీల్లో జరుగుతోంది. ఈ క్రమంలో కీలకమైన ఫ్యాకలీ్టని తగ్గిస్తున్నాయి.
ఇదంతా చట్టవిరుద్ధమని గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. హైదరాబాద్‌లో ఉన్న రెండు డీమ్డ్ వర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల ఆఫ్–క్యాంపస్‌పైనా ఇలాంటి ఫిర్యాదులొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
ఉద్యోగం వచ్చినా తిప్పలే..
ఇంజనీరింగ్ కాలేజీలు ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పారిశ్రామిక భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి కోడింగ్‌పై పట్టు సాధిస్తాడు. చాట్ జీపీటీ, ఏఐని తేలికగా ఉపయోగిస్తాడు. ఏఐ చేసే కోడింగ్, డీ–కోడింగ్ కచ్చితమైనదేనా? కాదా? అనేది సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఉదాహరణకు పైథాన్ నేర్చుకునే విద్యార్థికి ముందుగా సీ, సీ ప్లస్ ప్లస్‌పై కనీస పరిజ్ఞానం ఉండాలి.
అప్పుడు ఏఐలోని లాంగ్వేజ్ అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు కాలేజీలు దీన్ని విస్మరించడంతో కేవలం ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్‌ను మాత్రమే నేర్పడంతో ఉద్యోగం వచ్చినా, పనిలో పురోగతి సాధించలేకపోతున్నారు. గత ఐదేళ్లలో ఐటీ కంపెనీల్లో 560 మంది కోడింగ్‌పై పట్టు లేకపోవడం వల్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఏఐకి ఫీడ్ చేసే డేటా ఆధారంగా వచ్చే కోడింగ్‌ను అర్థం చేసుకోకపోవడం వల్ల ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్దఎత్తున డేటా గందరగోళం ఏర్పడినట్టు ఆ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ తెలిపారు.
ఏఐసీటీఈకి ప్రభుత్వం ఫిర్యాదు
డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణ అధికారం ఉండదు. అవి ఇచ్చే డిగ్రీల్లో నాణ్యతపైనా ప్రశ్నించే అధికారం అనుమతి ఇచ్చిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కూడా ఉండదు. ఒక్కో విద్యార్థి నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు రూ. 16 లక్షల నుంచి రూ.24 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ బేసిక్స్ విస్మరించడం, సబ్జెక్టు అధ్యాపకులను తగ్గించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం ఏఐసీటీఈ దృష్టికి తేవాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా ఎమర్జింగ్ కోర్సుల్లో తగ్గించిన ఫ్యాకలీ్ట, స్కిల్‌పై శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలకు ఉన్న అర్హతలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరనుంది.
కోడింగూ కీలకమే: హరీశ్ చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ
భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. చాట్ జీపీటీ, జనరేటివ్ స్కిల్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండాలి. అయితే, బేసిక్స్ నేర్పకుండా కేవలం స్కిల్‌పైనే దృష్టి పెడితే, భవిష్యత్‌లో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం కష్టం. సెల్‌ఫోన్ వాడే వ్యక్తికి దాని తయారీ తెలియనవసరంలేదు. వాడకం తెలిస్తే చాలు. కానీ దాన్ని తయారు చేసే ఇంజనీర్‌కు అన్నీ తెలిసి ఉండాలి. కోడింగ్, డీకోడింగ్‌లో ఏఐ తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత ఇంజనీర్‌దే. కాబట్టి ఇంజనీరింగ్‌లో బేసిక్ కోడింగ్‌పై శిక్షణ తప్పించడం సరికాదు.