లాహోర్‌ బిడ్డ | Sakshi
Sakshi News home page

లాహోర్‌ బిడ్డ

Published Wed, Nov 6 2019 3:48 AM

Ravinder Kaur \Who Came To India From Lahore - Sakshi

నవంబర్‌ 12న గురునానక్‌ జయంతి. ఇండో–పాక్‌ సరిహద్దుకు ఆవల ఉన్న గురుద్వారా సందర్శనకు రెండు దేశాలు కలసి తలపెట్టిన కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఈ నెల 9న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సందర్భాల నేపథ్యంలో.. దేశ విభజన సమయంలో లాహోర్‌ నుంచి ఇండియాకి వచ్చి, పెళ్లితో హైదరాబాద్‌కి వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయి, మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న 84 ఏళ్ల రవీందర్‌ కౌర్‌తో మాటామంతి.

1947. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. సరిగ్గా ఆ సమయంలో కోటీ ఇరవై లక్షల మంది శరణార్థులు.. విడిపోయిన భూభాగం నుంచి కట్టుబట్టలతో వచ్చి భారత్‌ను ఆశ్రయించారు. వాళ్లలో ఓ పన్నెండేళ్ల అమ్మాయి రవీందర్‌ కౌర్‌. లాహోర్‌ నుంచి సరిహద్దు రేఖ దాటి ఇండియాలో అడుగుపెట్టింది. ఇది జరిగిన పదేళ్లకు ఆమె పెళ్లి చేసుకుని కోడలిగా హైదరాబాద్‌కు వచ్చింది.  

బస్తీ నానమ్మ
రవీందర్‌ కౌర్‌ నివాసం హైదరాబాద్, దేవర కొండ బస్తీలో. ఆమె రోజూ సాయంత్రం బస్తీ పిల్లలకు ట్యూషన్‌ చెప్తుంటారు. కౌర్‌ ఇచ్చిన అసైన్‌మెంట్‌ పూర్తి చేసిన తర్వాత పిల్లలు ‘‘ఇక చాయ్‌ తాగుతాం’’ అని సొంత నానమ్మను అడిగినట్లే ఆమెను తడుతూ అడుగుతుంటారు. ఫీజు తీసుకోకుండా చదువు చెప్పడమే కాకుండా పిల్లలకు చాయ్‌ బిస్కెట్‌ ఇవ్వడం కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చుకున్నారు కౌర్‌. ‘‘గురునానక్‌ చెప్పిన సూక్తులతో నన్ను నేను ఇలా మలుచుకున్నాను’’ అంటారు రవీందర్‌ కౌర్‌.

దేశం కోసం పోరాటం
‘‘ఇండియా విభజన ముందు ఏడవ తరగతి వరకు లాహోర్‌లో ఉన్నాం. మా తాత భగవాన్‌దాస్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి. ఆయన పేరు మీద లాహోర్‌లో వీధి కూడా ఉంది. నాన్న వైపు ముత్తాత ఖడక్‌ సింగ్‌ ఫ్రీడమ్‌ ఫైటర్‌. ఆయన పేరుతో ఢిల్లీలో ఇప్పటికీ బాబా ఖడక్‌ సింగ్‌ మార్గ్‌ ఉంది. దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను అంకితం చేసిన కుటుంబాలు మావి. తీరా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఫలాలను అందుకోవాల్సిన తరుణంలో బతుకుజీవుడా అని పారిపోవాల్సి వచ్చింది. కారులో స్కూలుకెళ్లిన బాల్యం గుర్తుంది.

విభజన తర్వాత కాందిశీకుల్లా ఇండియాకి వచ్చిన తర్వాత కొత్త షూస్‌ కొనుక్కోలేక పగిలిపోయిన బూట్లతోనే స్కూలుకెళ్లిన బాల్యాన్నీ మర్చిపోలేను. బీఎస్‌సీ, బీఈడీ వరకు స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏ పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నా భర్త మన్మోహన్‌ సింగ్‌ది కూడా పార్టిషన్‌ సమయంలో పొట్ట చేత పట్టుకుని వచ్చిన కుటుంబమే. వాళ్లు కొన్నాళ్లు నార్త్‌లో ఉండి తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను పెళ్లితో హైదరాబాద్‌ కోడలినయ్యాను.

నానక్‌ నాకు స్ఫూర్తి
నాకు చదువుకోవడం, చదువు చెప్పడం రెండూ ఇష్టమే. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురిని పోగేసి చెప్పేదాన్ని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అత్తగారింట్లో వాళ్లకు చదువు చెప్పాను. ఆర్థిక అవసరాలు చుట్టుముట్టినప్పుడు సంపన్న వర్గాల పిల్లలకు ట్యూషన్‌ చెప్పాను. నా పిల్లలు ముగ్గురూ బాగా చదువుకుని పెద్ద పొజిషన్‌లో స్థిరపడ్డారు. నా భర్త ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. డబ్బు అవసరం తీరింది. అయినా నేను పని చేయడం మాత్రం మానలేదు.

ఓ ముప్పై ఏళ్ల కిందట హైదరాబాద్‌లో బస్తీల్లో గవర్నమెంట్‌ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆ స్కూళ్లకు, పిల్లలకు చేయాల్సింది ఎంతో ఉందనిపించింది. గురునానక్‌ చెప్పిన తొలి సూక్తి ‘షేర్‌ అండ్‌ కేర్‌’. నాకున్న నాలెడ్జ్‌ని షేర్‌ చేయడం మొదలుపెట్టాను. ఆ పిల్లల పట్ల కేరింగ్‌గా ఉండడంతో ప్రభుత్వ అధికారులు నాకో బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం స్కూళ్ల కోసం రూపొందించిన పథకాలు అమలవుతున్న తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ‘ఎదుటి వారిని సంతోషంగా ఉంచడానికి నీకు చేతనైన పని చెయ్యి’ అని చెప్పారు నానక్‌.

ఆయన సూక్తిని ఆచరణలో పెట్టడానికి నాకు అవకాశం అంది వచ్చినట్లయింది. నా బాధ్యతలను సమర్థంగా సమన్వయం చేసినందుకు 2010లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నాను. ఖైరతాబాద్‌లోని నిష్‌షుల్క్, బంజారాహిల్స్‌ బస్తీల్లో ఉన్న మరో రెండు స్కూళ్లలో ఇప్పటికీ వారానికి ఒకటి రెండుసార్లు వెళ్లి పిల్లలకు కొత్త టాస్క్‌లు ఇస్తున్నాను. స్కూళ్ల వరకు ఫర్వాలేదిప్పుడు. కానీ అంగన్‌వాడీల్లో చేయాల్సిన పని ఇంకా ఉంది. నాకిప్పుడు శక్తి తగ్గింది. చురుకైనవాళ్లు ముందుకు రావాలి’’ అని ముగించారు రవీందర్‌ కౌర్‌.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: కె. రమేష్‌ కుమార్‌

మంచి అనే మొక్కలు
గురునానక్‌ సమాజంలో స్త్రీ స్థానాన్ని చాలా గొప్పగా చెప్పారు. సమాజాన్ని నిలబెట్టే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని చెప్పారు. ఇతరుల కోసం పనిచేసే ఆసక్తి ఉన్న స్త్రీలు ఇంటి గుమ్మం దాటి బయటకు రావాలి. ఆడవాళ్ల నిర్వహణలో ఉన్న సమాజంలో అకృత్య భావనలు అంకుర దశలోనే అంతరించిపోతాయి. ఆయన సూక్తులను ఉర్దూ, ఇంగ్లిష్‌లో కవితలు రాసి పిల్లలకు నేర్పిస్తున్నాను. నా వంతుగా సమాజంలో మంచి అనే మొక్కలను కొన్నింటిని నాటుతున్నాను.
– రవీందర్‌ కౌర్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement