సత్య ధర్మ పరిరక్షణే  ధ్యేయం...

Purpose of preserving truth - Sakshi

ముత్యపు చిప్ప

‘‘మీ ఇళ్లల్లో మీరే హోమాలు చేయండి. శక్తిమంతులుకండి. తద్వారా సమాజానికి సేవచేయండి. మంత్రదీక్ష తీసుకుని సమస్యలు పరిష్కరించుకోండి... వ్యాధులు నయం చేసుకోండి... ధర్మాన్ని కాపాడండి...’’ అంటున్నారు కుర్తాళం పీఠాధిపతి.. పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి. 83 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వామీజీ నిరాడంబరతకు మారుపేరు. ఆయన జీవితంలో వెయ్యి పున్నములను చూసిన సందర్భంగా ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సహస్రచంద్ర దర్శనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో.. శ్రీనాథ పీఠం ఆధ్వర్యాన గుంటూరులో ఈ ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామీజీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. కుర్తాళం పీఠం కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికలతోపాటు ధర్మపరిరక్షణకు చేస్తున్న కృషిని వివరించారు. ఇంకా సాక్షి అడిగిన పలు సందేహాలకు సవివరమైన సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు స్వామీజీ మాటల్లోనే....

నా గురించి...
పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాలలో ప్రధాన అధ్యాపకుడిగా పనిచేశాను. వెంకట లక్ష్మీ వరప్రసాదరావు అనే నేను ప్రసాదరాయ కులపతిగా అందరికీ సుపరిచితుడిని. పరమ గురువు త్రివిక్రమ రామానంద భారతీస్వామి ప్రేరణతో అరవైఏళ్ల క్రితమే సన్యాసాన్ని స్వీకరించాలని భావించి నా తల్లిదండ్రులైన పోతరాజు పురుషోత్తమరావు, స్వరాజ్యలక్ష్మిలకు మనసులోని మాట చెప్పాను. వారు అంగీకరించలేదు. 2002లో భార్యాపిల్లల సమ్మతితో నా కోరిక నెరవేరింది. హిమాలయాలు, బృందావనం, కాశీ, కామాఖ్య, కుర్తాళం తదితర ప్రదేశాల్లో తపస్సు చేశాను. రాధాదేవి, కాలభైరవుడు, కాళీమాత వంటి దేవతల దర్శనభాగ్యం కలిగి అనుగ్రహం పొందాను. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించాను.

పీఠం కార్యకలాపాలు
భారతదేశంలోని పీఠాల్లో శంకర పీఠాలకు సంబంధించింది మా పీఠం. కుర్తాళంతోపాటు తిరుమల, గుంటూరుల్లోనూ పీఠాలున్నాయి. నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలలో ఉప శాఖలున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ, వారి మనశ్శక్తి పెరిగేందుకు ప్రయోజన హోమాలు చేయిస్తున్నాం. కుర్తాళం పీఠానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, అమెరికా, శ్రీలంకల్లో ఆలయాలను నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్‌లో 32 ఆలయాలు, తెలంగాణలో 8 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ట్రస్టుబోర్డుల అధీనంలోనివే.భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, శ్రీలంక, టిబెట్, నేపాల్‌ దేశాల్లో పర్యటించి సప్తాహాలు నిర్వహించాం. హిందూ ధర్మ రక్షణ, మంత్రశాస్త్రం, పురాణాలు, వేదాంత సంబంధ విషయాలపై వేలాది ఉపన్యాసాలు ఇచ్చాను. సామూహిక యజ్ఞాలు నిర్వహించాం. 20 మంది శిష్యులకు సన్యాసదీక్ష ఇప్పించాం. విశ్వవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు కుర్తాళం పీఠాలకు వస్తుంటారు. వారందరికీ మార్గనిర్దేశం చేస్తూ రుషులు బోధించిన మార్గాల్లో  నడిపిస్తున్నాం. సామాజిక సేవల విషయానికొస్తే.. నిరంతర అన్నదానం, ఉచిత ధ్యాన శిబిరాల ఏర్పాటు ప్రధానమైనవి. కవితా గోష్ఠులను ఏర్పాటుచేసి కవులను భారీగా సన్మానిస్తుంటాం.

భవిష్యత్‌ ప్రణాళిక 
అమెరికాలోని అట్లాంటాలో 500 ఎకరాల స్థలం పీఠానికి ఉంది. ఇక్కడ 108 కుండాలు ఏర్పాటుచేసి యజ్ఞాలు నిర్వహించాం.. 108 మంది సువాసినీలకు పూజలు జరిపించాం. ఈ ప్రాంతంలో ఒక నది, ఆరు సరస్సులు కూడా ఉన్నాయి. ఆదిశంకరాచార్యులవారి 108 అడుగుల లోహపువిగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఏడాదిలోగా  ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తాం.

నమ్మకమే గెలుపు
మనం ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుందనే విశ్వాసం తొలుత కలగాలి. అప్పుడే ముందడుగు వేయగలుగుతాం. పీఠానికొచ్చిన నాస్తికులు ఆస్తికులుగా మారిన సందర్భాలు అనేకం. నమ్మి వచ్చినవారికి భక్తి మరింత పెరిగి ఆధ్యాత్మికానందంలో మునిగి తేలిన సంఘటనలూ చాలానే ఉన్నాయి.

యోగులు–సూక్ష్మ శరీరులు
 ధ్యాన సమయంలో కొందరు సూక్ష్మ శరీరంతో వచ్చి సందేశమిచ్చేవారు. కొందరు స్నేహపూర్వకంగా పలకరించి వెళ్లేవారు. మరికొందరు మహనీయులు ఆశీర్వదించి కర్తవ్య ఉపదేశం చేసేవారు. ఇంకొందరు తమ సాధనలో ముందుకెళ్లడానికి దారి చూపాలని కోరేవారు. ఇలా అశరీరులతో సంభాషించవలసి వచ్చేది. అలా నేను గుంటూరులోని ఇంట్లో ఆత్మావాహన విద్య ద్వారా అప్పటికే దేహం వదిలిన జిల్లెళ్లమూడి అమ్మతో మాట్లాడుతుంటాను. ఆమె అనేక సిద్ధసంబంధ విషయాలను చెప్పి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించారు. ఆ అమ్మ ఆశీస్సులు ఇప్పటికీ నాకు అడుగడుగునా అందుతూ ఉంటాయి. 

కోరికలను జయించడమెలా?
మనిషన్న తర్వాత కోరికలుంటాయి. వాటిని హద్దుల్లో ఉంచుకోవాలి. ఆదిశంకరాచార్యులవారి వేదాంతగ్రంథాలను చదవడం ద్వారా, ధ్యానం.. తపస్సు చేయడం ద్వారా కోరికలను అదుపులో ఉంచొచ్చు.ఇటీవలి కాలంలో యువతలోనూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. ఆలయాలకు వెళ్తున్నారు. టీవీలో భక్తి కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నారు. ఇది శుభ పరిణామం.

స్వయంసిద్ధ కాళీ పీఠం
గుంటూరు రవీంద్రనగర్‌ కొత్త పట్టాభిపురంలో ఉంది. ఆలయంలో అమ్మవారి ఎదురుగా హోమకుండాన్ని నిర్మించి నిత్యం హోమాలు చేయిస్తున్నాను. ఇది నిత్యాగ్నికుండం. ఇక్కడ ఎవరు హోమం చేసినా వారి సంకల్పం సిద్ధిస్తుంది. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహిస్తుంటాం’అంటూ సంభాషణను ముగించిన స్వామీజీ కాళికా మాతకు హారతివ్వడానికి ఉపక్రమించారు.

కుర్తాళం పీఠం విశేషాలు
శ్రీ శివచిదానంద సరస్వతీస్వామి (మౌనస్వామి) 1916లో హిమాలయాలకు వెళ్లి సన్యసించారు. అనంతరం తమిళనాడు రాష్ట్రం.. తిరునల్వేలి జిల్లాలోని కుర్తాళంలో దత్తాత్రేయ మఠాన్ని నిర్మించారు. కొంతకాలం తర్వాత శ్రీ సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించి అద్భుతమైన సిద్ధశక్తులను సాధించారు. ఆయన తదనంతర పీఠాధిపతులుగా శ్రీ విమలానంద భారతీస్వామి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతీస్వామి, శ్రీ శివచిదానంద భారతీస్వామి వ్యవహరించారు. ఐదో పీఠాధిపతిగా శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి 2002లో బాధ్యతలు స్వీకరించారు.

అపురూపం
ముత్యాల గురించి అందరికీ తెలుసు. నవరత్నాలలో ముత్యాలను చంద్ర గ్రహ దోష పరిహారం కోసం ఉపయోగిస్తారు. ముత్యాలను ఉంగరాల్లో ధరిస్తారు. ముత్యాల హారాలను ధరిస్తారు. జాతకచక్రంలో చంద్రుని కారణంగా ఏర్పడిన దోషాలకు పరిహారంగా ముత్యాలు ఎలా ఉపయోగపడతాయో, ముత్యపు చిప్పలు కూడా దాదాపు అలాగే ఉపయోగపడతాయి.  ముత్యపు చిప్పలతో తయారు చేయించిన లాకెట్లు, బ్రాస్‌లెట్లు వంటి ఆభరణాలు చంద్రదోషాలను పరిహరిస్తాయి. ఏదైనా సోమవారం లేదా అక్షయ తృతీయ, ధనత్రయోదశి, దీపావళి వంటి పర్వదినాల్లో లక్ష్మీపూజ చేసేటప్పుడు ముత్యపుచిప్పలను కూడా పూజలో ఉంచి, వాటికి ధూపదీపాలను సమర్పించడం వల్ల ఆర్థిక ఇక్కట్లు తొలగిపోతాయి. కుటుంబంలోని కలతలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. గోమతి చక్రాల మాదిరిగానే, ముత్యపు చిప్పలను కూడా ఇళ్లలోను, వ్యాపార కేంద్రాల్లోను డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది.  – పన్యాల జగన్నాథదాసు 
– సంభాషణ: చెన్నాప్రగడ వీఎన్నెస్‌ శర్మ
సాక్షి, విజయవాడ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top