దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు?

Prabhu kiran about lord jesus - Sakshi

‘యేసు పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు’ అని బైబిల్లో ఉంటుంది (మార్కు 1:35). ప్రార్థన చేయడానికి యేసుప్రభువు తరచు అరణ్యప్రదేశానికి ఏకాంతంగా వెళ్లేవాడన్నది బైబిల్‌లోని నాలుగు సువార్తల్లోనూ తరచుగా చదివే ఒక ప్రధానాంశం. ప్రశాంత వాతావరణంలో, ఏకాంతంలో ఆయన ప్రార్థించేవాడన్నది సుస్పష్టం. దేవునితో ఏకాంతంగా ఆరాధనలో గడిపే అనుభవం ప్రతి విశ్వాసికీ అత్యంత విలువైనది. దేవునితో విశ్వాసి అత్యంత సన్నిహితంగా మనసు విప్పి మాట్లాడే అనుభవం, దేవుడు కూడా విశ్వాసితో ఎంతో ప్రియంగా, స్పష్టంగా, మృదువుగా మాట్లాడే అనుభవం అది.

ఇలాంటి అనుభవంలోనే విశ్వాసి ఎంతో బలవంతుడవుతాడు, తనను బలపరిచే దేవుని శక్తితో దేనినైనా సాధించగలనన్న నమ్మకంలోకి ఎదుగుతాడు (ఫిలిప్పి 4:13). యేసు విశ్రాంతి దినం నాడు సమాజ మందిరానికి వెళ్లి అక్కడ ఇతరులతో కలిసి దేవుని ఆరాధించేవాడు. ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం నాడు చర్చికెళ్తున్నాం. కానీ ప్రభువుతో ఏకాంతంగా ఆరాధనలో, ప్రార్థనలో గడిపే అత్యంత విలువైన వ్యక్తిగత అనుభవానికి మాత్రం మనలో చాలామంది ఎంతో దూరంగానే ఉన్నారు. దేవునితో లోతైన వ్యక్తిగత ప్రార్థనానుభవం లేని క్రైస్తవులు, శ్వాస తీసుకోకుండా బతకాలనుకునే జీవులే!!

దేవుడు వారంలోని ఏడు రోజుల్లో ఒక రోజును విశ్వాసి తనను ఆరాధించడానికి నియమించాడు. ఆ దినాన్ని సంపూర్ణంగా తనతోనే గడపాలని దేవుడు నిర్దేశించారు. దాన్నే సబ్బాతు లేదా విశ్రాంతి దినం అని బైబిల్లో పేర్కొన్నారు. అపొస్తలులు కొత్త నిబంధన కాలంలో ప్రభువుదినమైన ఆరాధనా దినంగా ఆదివారాన్ని నిర్ణయించి పాటించారు. దాన్నే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు పాటిస్తున్నారు. కాదు ఆదినుండీ ఉన్నట్టుగానే విశ్రాంతి దినాన్ని శనివారంగానే కొంతమంది పరిగణిస్తున్నారు. గల్ఫ్‌ లాంటి దేశాల్లోని విశ్వాసులైతే అక్కడి పరిస్థితులను బట్టి శుక్రవారాన్ని ఆరాధన దినంగా పాటిస్తున్నారు. వారంలో అది ఏ దినం అన్నది ప్రాముఖ్యం కానే కాదు.

ఆ రోజును ఎంత నాణ్యమైన ఆరాధనలో గడుపుతున్నామన్నది, ఆ ఆరాధన విశ్వాసిలో ఎంతటి మార్పు తెస్తోందన్నదే దేవుని దృష్టిలో అత్యంత విలువైన విషయం. దేవునితో ఏకాంత ఆరాధనానుభవంలో విశ్వాసిలో క్రమంగా సాత్వికత్వం, దేవుని పట్ల విధేయత, నమ్మకత్వం, పొరుగు విశ్వాసుల పట్ల ప్రేమ, సహోదరభావం పెంపొందుతాయి. ఆ ఆరాధనానుభవంలోనే దేవుడు విశ్వాసిని నలుగగొట్టి తన సారూప్యంలోకి మార్చుకుంటాడు. ఆరాధనానుభవం లేనివారే అహంకారులు, అతిశయపడే వారుగా మిగిలిపోతారు. వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. దేవుని సన్నిధిలో తలవంచే అనుభవం ద్వారానే, విశ్వాసికి లోకాన్ని తలెత్తి ఎదిరించే ధైర్యం, తెగింపూ వస్తుంది.

అత్యాధునిక జీవన శైలిలో, దైనందిన జీవనోపాధి కోసం గడిపే సమయం పోగా మిగిలిన సమయాన్నంతా మనం సెల్‌ఫోన్, టివి, వాట్స్‌అప్, ఫేస్‌బుక్‌ లాంటి ప్రసార మాధ్యమాలకే మనం కుదువబెట్టేస్తున్న పరిస్థితుల్లో ఇక దేవునితో గడిపే సమయం మనకెక్కడిది? దేవునితోనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా బాగా తగ్గిపోయింది. అందుకే విశ్వాసులు, చర్చిలు, కుటుంబాలు తద్వారా సమాజం కూడా నానాటికీ బలహీనపడుతున్నాయి. ఇదంతా మనందరి ‘ప్రైవసీ’ మీద జరుగుతున్న సాంకేతిక దాడి!! సకాలంలో కళ్ళు తెరవకపోతే దేవునికే కాదు, మన జీవిత భాగస్వాములకు, పిల్లలకు, తోబుట్టువులకు కూడా పరాయివాళ్లమవుతాం. సెల్‌ఫోన్‌తోనే ఆరంభమై, దాంతోనే మీ రోజు ముగుస్తూ ఉంటే, మీరు ఆ ప్రమాదానికి దగ్గర్లోనే ఉన్నారు. అలాకాకుండా మీ దినం దేవునితో ఆరంభమై, దేవునితోనే ముగుస్తూ ఉంటే అపారమైన ఆశీర్వాదాలు మీవెంటే!!

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top