ఒక నిమిషం - ఒక విషయం

 One minute - one thing

ఈశాన్యాన దేవుణ్ణి పెట్టే వీలులేకపోతే?
మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహణల వల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి మందిరం మన కనుదృష్టికి సరిగ్గా ఎదురుగా ఉండాలి.

పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?
పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేకమంది తాపసులు కైలాసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతీదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధికోసం సృష్టించినవి. జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని పండితోక్తి.

మహాభారత రచన ఎక్కడ జరిగింది?
వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారతదేశ చివర గ్రామమైన ‘మాన’లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. బద్రినాథ్‌ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. ‘జయ’ కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల, ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనంగా ప్రవహించిందట.

హనుమంతుడికి, సువర్చలకు వివాహం జరిగిందా?
కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top