జయగీత

November 30 Geeta Jayanti - Sakshi - Sakshi

నవంబర్‌ 30 గీతాజయంతి

ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్‌ కావాలంటే వందల పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప వ్యక్తి కావాలంటే, మనిషి శాశ్వతుడు కావాలంటే ‘గీతా మార్గదర్శకత్వం’లో నడిస్తే చాలు! పరమాత్ముడు మనిషిని సృష్టించి, సన్మార్గంలో నడిపించడానికి అందించిన ‘ప్రొడక్ట్‌ మాన్యువల్‌’ భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి చేసిన కర్తవ్య బోధ! ఏది తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా తెలుసుకోవలసి ఉంటుందో దాన్ని ‘సైన్స్‌’ అంటారు. కానీ ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదో దాన్ని ‘స్పిరిట్యువల్‌ సైన్స్‌’ అంటారు.అదే.. ఆధ్యాత్మిక జ్ఞానం! ఆ అధ్యాత్మిక జ్ఞాన సారమే.. భగవద్గీత!

సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీతకు తొలిగా భాష్యం రాసిన శంకరాచార్య శ్లోకం – 

నారాయణః పరోవ్యక్తాత్‌ అండమవ్యక్త సంభవమ్‌!
అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచమేదినీ
అనే ప్రాచీన శ్లోకాన్ని ఉదహరిస్తారు.

అంటే..
పరమేశ్వరుడు, అంటే శ్రీమన్నారాయణుడు– మొదటివాడు, అవ్యక్తానికి అతీతుడు. 
అవ్యక్తాన్నే మాయ, అవిద్య లేక ప్రకృతి అంటారు.

అవ్యక్తం నుండే బ్రహ్మాండం ఉద్భవించింది.

బ్రహ్మాండంలోనే 14 లోకాలు ఉన్నాయి.

లోకాల్లో ఒకటి సప్తద్వీపాలతో కూడిన ఈ భూగోళం!

భూగోళంపై 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి.

వీటిలో మానవులు ఒక జీవరాశికి చెందినవారు. ఈ జీవరాశులు అన్నింటిలోనూ మానవజన్మ అత్యున్నతమైనది.

ఈ మానవులు సక్రమమార్గంలో ప్రవర్తించడానికి పరమేశ్వరుడు ధర్మాన్ని ఏర్పాటు చేశాడు.

ధర్మాలను వివరించడానికి పరమేశ్వరుడు అందించినవే వేదాలు.

 వేదాలలోని మొదటి మూడు భాగాలైన సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకాలు ప్రవృత్తి ధర్మాన్నీ.. అంటే.. కర్మమార్గాన్ని, నాల్గవ భాగమైన ఉపనిషత్తులు నివృత్తి మార్గాన్ని అంటే.. మోక్షమార్గాన్ని వివరిస్తాయి. వీటన్నింటి సారాంశమే భగవద్గీత!

జ్ఞాన పరిణతిని బట్టి ఒక్కో స్థాయిలో ఒక్కో విధంగా అర్థమయ్యే నిత్యనూతన, సార్వజనీన గ్రంథం భగవద్గీత!

భగవద్గీత ఏం చెబుతుంది?
చేయవలసిన పనిపైన లోతైన అవగాహన, నిశితమైన దృష్ణి, లక్ష్యంపైన ఏకాగ్రత ఉండాలి. 

♦ పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యంతో లక్ష్యంవైపు అడుగువెయ్యి. 

♦ అనవసరమైన విషయాలగురించి బాధపడకు. 

♦ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో! 

♦ ఆత్మకు శాంతి, అశాంతి అనేవి ఉండవు. (కాబట్టి చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడంలో అర్థం లేదు.) 

♦ గౌరవం తెచ్చిపెట్టే పనులే చెయ్యి. అపకీర్తి తెచ్చే పనులు చెయ్యకు. 

♦ జయాపజయాలతో ప్రమేయం లేకుండా ధర్మం కోసం పోరాడు. 

♦ ఏవిషయమైనా బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయానికి రావాలి. 

♦ ఫలితంకోసం ఎదురుచూడకుండా నువ్వు చేయవలసిన పనిని చేసుకుంటూ వెళ్లు!

♦ పనిలో నైపుణ్యాన్ని పెంచుకో!

♦ ధ్యాస మరల్చకుండా ఏకాగ్రచిత్తంతో పనిచెయ్యి. 

♦ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చలించక స్థితప్రజ్ఞుడిలా ఉండు. 

♦ ఉత్తమ జీవితం గడపాలంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. 

♦ అథః పతనానికి దారితీసే స్వార్థపరమైన కోరికల విషవలయంలో చిక్కుకోకు. 

♦ శాంతం ఉన్నవానికే సౌఖ్యం లభిస్తుంది. 

♦ లోకకల్యాణం కోసం ఆలోచించే నిస్వార్థపరుడిలా, జ్ఞానిలా జీవించు
 
♦ విషయభోగాలపైన ఆసక్తి ఉన్నవాడు శాంతిని పొందలేడు. 

♦ నీవు చేయవలసిన పనిని ఫలాపేక్షారహితంగా, లోకహితార్థమై, ఇతరులకు ఆదర్శం అయ్యేటట్లుగా చెయ్యి. 

♦ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించి జీవనపోరాటాన్ని సాగించు. 

♦ రాగ ద్వేషాలకు లోనుకాకుండా పని చెయ్యి. 

♦ నీకు విధించబడిన ధర్మాన్నే ఆచరించు. అది నిన్ను రక్షిస్తుంది. 

♦ కోరికలను తప్పనిసరిగా జయించు. 

♦ అధర్మాన్ని ఆచరించకు. దేవుడు శిక్షిస్తాడు.

♦ భగవంతుణ్ణి ఏదృష్టితో సేవిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తాడు. 

♦ గుణాలను, కర్మలను బట్టి నాలుగు వర్ణాల వ్యవస్థను పరమాత్మ ఏర్పాటు చేశాడు. 

♦ పూర్వులు నడిచిన కర్మమార్గంలోనే ప్రయాణించు. 

♦ నిస్వార్థ బుద్ధితో పనిచెయ్యి. అప్పుడు నీకు ఏ పాపమూ అంటదు. 

♦ పవిత్రమైన భావనతో పనులు చెయ్యి. లేకపోతే జీవితానికి అర్థంలేదు. 

♦ భక్తి శ్రద్ధలతో గురువులను సేవించడం వల్ల పొందే జ్ఞానానికి విలువ, శాశ్వతత్వమూ ఉంటాయి. 

♦ ∙జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది మరియొకటి లేదు. కాబట్టి జ్ఞాని కావడానికి ప్రయత్నించాలి. 

♦ జ్ఞానాన్ని ఆర్జించడానికి శ్రద్ధ, పట్టుదల, ఇంద్రియ నిగ్రహం అవసరం. 

♦ జ్ఞానం లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, నిశ్చయాత్మకత లేకపోయినా జీవితంలో ఏమీ సాధించలేము. 

♦ లే..! సందేహిస్తూ కూర్చోకు. కార్యరంగంలోకి దూకు! 

♦ ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టి, పనులు చేసేవాడికి పాపపుణ్యాలంటవు. 

♦ నువ్వు చేసే పాపపుణ్యాలతో పరమాత్మకు సంబంధం లేదు. ఆ రెండూ నువ్వే అనుభవించాలి. 

♦ జ్ఞానం సూర్యుడు వంటిది. దానివల్ల పరమార్థతత్త్వం స్పష్టంగా బోధపడుతుంది. 

♦ పరమాత్మే సర్వమని నమ్మిన వాడికి మోక్షం తప్పక లభిస్తుంది. 

♦ సర్వప్రాణుల యందు సమదృష్టికలవాడే పండితుడు. 

♦ ఆనందంగా జీవించాలంటే ఉద్వేగాలను అణచుకోవాలి. 

♦ వృద్ధి, పతనాలు రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి నిన్ను నువ్వే ఉద్ధరించుకో! 

♦ ఉత్తమ లక్షణాలను, ఉత్తముల లక్షణాలను అలవరుచుకో! 

♦ ఆహార నియమాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకో! 

♦ ∙అభ్యాసంతో, వైరాగ్యంతో మనస్సును నిగ్రహించుకోవచ్చు. 

♦ నువ్వు చేసే మంచి పనులే నిన్ను రక్షిస్తాయి. 

♦ పరమాత్మ సర్వవ్యాప్తి అని తెలుసుకో! 

♦ ఏ దేవత ద్వారా మన అభీష్టాలు నెరవేరినా అది పరమాత్మ అనుగ్రహమే! 

♦ పరమాత్మను చేరడమే అంతిమ గమ్యంగా పెట్టుకో! 

♦ కనిపించనంత మాత్రాన దేవుడు లేడనుకోకు. యోగమాయ కారణంగా దేవుడు కనిపించడు. 

♦ మనం చేసే పనుల్ని పరమాత్మ గమనిస్తున్నాడు. 

♦ అభ్యాసంతో, ఏకాగ్ర చిత్తంతో పనిచేసేవాడు పరమలక్ష్యాన్ని తప్పక చేరతాడు.

♦ ప్రాణులు నశించినా పరమాత్మ మాత్రం శాశ్వతుడు. 

♦ అనన్యభక్తితో సేవించే వారిని దేవుడు కంటికి రెప్పలా కాపాడతాడు. 

♦ దేవుణ్ని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. 

♦ ఈ జగత్తు పరమాత్మలోని ఒకానొక అంశం మాత్రమే! 

♦ పరమాత్మ దృష్టిలో మనం నిమిత్తమాత్రులమే అయినప్పటికీ మన కర్తవ్యాన్ని ఆచరించవలసిందే! 

♦ ఉన్నతమైన లక్ష్యాన్ని చేరడానికి అనన్యమైన శ్రద్ధ, భక్తి అవసరం. 

♦ పరమాత్ముడే సర్వమని జీవించేవాడు పరమాత్మని చేరతాడు.

♦ ధర్మ మార్గంలో నడిచేవాడు పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

♦ పరమాత్మ సర్వవ్యాప్తి కనుక ఎవరూ తమను తాము హింసించుకొనరాదు. (13–28)

♦ మనం పనిచేసే విధానాన్ని బట్టే ఫలితాలుంటాయి. 

♦ సత్త్వ రజస్తమోగుణాలకు అతీతంగా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి. 

♦ ఈ జన్మలో మనం చేసే పనులను బట్టే మరుజన్మ ఆధారపడి ఉంటుంది. 

♦ ‘వైశ్వానరుడ’ను జఠరాగ్ని స్వరూపంలో ఉన్న పరమాత్మే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు. 

♦ మనిషి పతనానికి కారణాలైన కామ, క్రోధ, లోభాలను వదిలివేయాలి. 

♦ ధర్మమార్గాన్ని వదలి, విశృంఖలంగా ప్రవర్తించేవాడు ఇహ పర లోకాల్లో సుఖాన్ని పొందలేడు. 

♦ ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించడానికి శాస్త్రమే (వేదమే) ప్రమాణము. 

♦ శాస్త్ర విరుద్ధంగా, శరీరాన్ని కృశింపజేయడమంటే–పరమాత్మను హింసించడమే. 

♦ ఎవరి మనసునూ నొప్పించకుండా – సత్యము, ప్రియము, హితము అయిన విధంగా మాట్లాడు. 

♦ నీ గౌరవాన్ని పెంచుకోవడం కోసం ఆడంబరంతో ఏ పనులూ చేయకు. 

♦ ప్రతిఫలాన్ని ఆశించకుండా దేశ, కాల, పాత్రముల నెరిగి దానం చేయడమే ఉత్తమం. 

♦ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించడమే త్యాగం. ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. 

♦ నీ సామర్థ్యాన్ని సరిగా తెలుసుకోకుండా, కలుగబోవు దుష్పరిణామాలను సరిగా అంచనా వెయ్యకుండా– ఏ పనీ ప్రారంభించవద్దు. 

♦ అహంకార, మమకారాలను వదిలిపెట్టి, ఫలితం గురించి ఆలోచించకుండా, ధైర్యోత్సాహాలతో పనిచెయ్యి. 

♦ తొలుత కష్టంగా ఉన్నా చివరకు సుఖాన్నిచ్చే పనులనే చెయ్యి. 

♦ తొలుత సుఖంగా ఉండి చివరకు కష్టాలలోకి నెట్టే పనులు చేయకు.

♦ సోమరితనాన్ని పెంచే సుఖాల జోలికి పోవద్దు. 

♦ పరమాత్మే సర్వమనుకుని ప్రవర్తిస్తే అంతా శుభమే జరుగుతుంది. కాదని అహంకరిస్తే పతనం తధ్యం. 

♦ పరమాత్మను శరణు కోరితే శాంతి, మోక్షమూ లభిస్తాయి.

♦ ఏ పనైనా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. 

♦ సమస్తాన్నీ పరమాత్మకు అర్పించి శరణు వేడితే ఆయనే రక్షిస్తాడు. 

♦ ఏ విషయాన్నైనా శ్రద్ధాసక్తులు ఉన్నవారికే బోధించాలి. 

పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే విజయాన్ని తప్పక సాధిస్తావు. 

♦ ఇవీ ‘గీత’ ధర్మసింధు చెప్పే ప్రధానమైన విషయాలు.

♦ ‘గీత’లో మానవ జీవన విధానానికి సంబంధించి ప్రస్తావించని అంశం అంటూ లేదు. అందుకే ‘గీత’ ప్రపంచం చేత ‘గ్రేట్‌’ అనిపించకునే ‘మేనేజ్‌మెంట్‌ గ్రంథం’ అయ్యింది. శ్రీకృష్ణుడు ‘బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ గురు’ అయ్యాడు.

గీత చదివితే ఏమొస్తుంది?
‘గీత’లోని 700 శ్లోకాలను బట్టీ పట్టేసినంత మాత్రాన ఫలితమేమీ ఉండదు. ‘గీత’ పఠనా గ్రంథం కాదు. ఆచరణ గ్రంథం. అదే గీత పరమ ప్రయోజనం! ఇది రిటైర్మెంట్‌ సబ్జక్టు కాదు. జీవితానికి గైడ్‌! దీన్ని జీవితం ప్రారంభదశలోనే తెలుసుకుని ఆచరించడం ప్రారంభిస్తే మనిషి మనీషి అవుతాడనడంలో సందేహం లేదు. అందుకే విద్యార్థిదశ నుండే భగవద్గీతను నేర్పించాలి.
‘మత మంటే’ ఒక వర్గానికి చెందినది. ‘ధర్మం’ అంటే సార్వజనీనమైనది. భగవద్గీత జగత్తులోని ప్రతి మానవుణ్ణీ ఉద్దేశించి చేసిన మహోదాత్తమైన ధర్మోపదేశం! గీతోపదేశ ప్రారంభానికి ముందు యుద్ధ విముఖుడైన అర్జునుడు గీతాబోధ తర్వాత కర్తవ్యోన్ముఖుడయ్యాడు. మరీ ‘గీతా’ వైద్యం అర్జునుడికి పనిచేసినప్పుడు మనకు పనిచేయదా? ఇదే లాజిక్కు! అందుకే కర్తవ్యదీక్షకు, నైతికవిలవల ప్రబోధానికి, ఉత్తమ సమాజ నిర్మాణానికి ‘భగవద్గీత’కు మించిన మార్గదర్శక గ్రంథం, వ్యక్తిత్వ వికాస గ్రంథం మరొకటి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. వృత్తిగత, వ్యక్తిగత జీవితాలు ధర్మబద్ధంగా నడవాలంటే, ఆదర్శవంతమైన సమాజ స్థాపన జరగాలంటే గీతాచరణం ఒక్కటే మార్గం. ‘గీత’ చదివితే డిక్షనరీ లోనుంచి ‘నేను’ అనే అహంకారం, ‘నాది’ అనే ‘మమకారం’, ఇతరులు హర్షించని ‘స్వార్థం’... అనేవి తొలగిపోతాయి.

కర్తృత్వ భావన పోయి కర్తవ్యదీక్ష మొదలవుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు! 
ఎల్వీ గంగాధర శాస్త్రి

గాయకుడు, సంగీత దర్శకుడు.
వ్యవస్థాపకుడు – భగవద్గీతా ఫౌండేషన్‌

ఐశ్వర్యానికి, బలానికి, కీర్తికి, సంపదకు, జ్ఞానానికి, వైరాగ్యానికి.. ఈ ఆరింటికీ ‘భగం’ అని పేరు. 
ఈ ఆరూ కలిగిన వాడికి భగవంతుడని పేరు. అటువంటి వాడు చెప్పింది కాబట్టి దీనికి ‘భగవద్గీత’ అని పేరొచ్చింది. 

‘గీతా బోధ’ జరిగి ఇప్పటికి 5118 సంవత్సరాలైంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలంపై 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు నివసించాడు. గీత బోధించే సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు సుమారు 87 సంవత్సరాలు.

ఇది ‘జీవన గీత’.. ‘మరణ గీత’ కాదు.. 
‘భగవద్గీత’లో ఒక్క శ్లోకమైనా గురు ముఖతః అధ్యయనం చేసినవాడు ధన్యుడవుతాడని జగద్గురు శంకరాచార్య, తన కర్తవ్య దీక్షకు ‘భగవద్గీత’ ఎప్పుడూ శక్తినిస్తూ ఉండేదని మహాత్మా గాంధీ, ఉత్తమ లక్ష్యానికి చేర్చే ‘ధర్మసింధు’ గీత అని స్వామి వివేకానంద వంటి భారతీయులు, భగవద్గీత లేకపోతే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమైనట్టు కాదని ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ (ఇంగ్లండ్‌ కవి), జ్ఞానానికి పరాకాష్ట భగవద్గీత అని మాక్స్‌ ముల్లర్‌ (జర్మనీ సాహితీవేత్త), అణుబాంబు ప్రయోగ సమయంలో తనకు గీతే’ గుర్తొచ్చిందని జె.రాబర్ట్‌ ఓపెన్‌ హామర్‌ (అమెరికా అణుశాస్త్రవేత్త), ఇంకా వారన్‌ హేస్టింగ్స్, ఐన్‌స్టీన్, ఆల్డస్‌ హక్స్‌లీ వంటి పాశ్చాత్తులు భగవద్గీత గొప్పతనాన్ని అనుభవ పూర్వకంగా ప్రశంసిస్తూంటే – మన తెలుగు వాళ్లు మాత్రం – భగవద్గీత ఎక్కడైనా వినిపిస్తుంటే ఎవరో చనిపోయారని నిశ్చయించుకునే స్థాయికి తీసుకురావడం అత్యంత దురదృష్టకరం... అజ్ఞానం! ఈ దుష్ట సంప్రదాయాన్ని తొలగించడంలో ప్రతీ తెలుగువాడూ కంకణ బద్ధుడు కావాలి. భగవద్గీత ‘జీవనగీత’.. ‘మరణగీత’ కాదు, కారాదు. 

కృష్ణం వందే జగద్గురుమ్‌ 
ఇహ పరలోకాలలో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. ‘శాశ్వతానందమయ స్థితి’ అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి చెందిన, ఒక ప్రాంతానికి చెందిన, ఒక మనిషి అభ్యుదయాన్నీ, శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువవుతాడు. సర్వదేశాలకు, సర్వకాలాలకు, సర్వజాతులకూ వర్తించే విధంగా – జగత్తులోని ప్రతి మానవుణ్నీ ఉద్దేశించి అభ్యుదయ, నిశ్రేయాస మార్గాలను రెండింటినీ మహోదాత్తమైన పద్ధతిలో, విశ్వజనీనమైన భగవద్గీతా రూపంలో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. 
∙భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేతనే ఉపదేశింపబడుటవలన ‘భగవద్గీత’ అనీ.. 
∙వేదాంతములను సంగ్రహించి చెప్పినందున ‘ఉపనిషత్సారమ’ అనీ..
∙పరబ్రహ్మమును తెలిపే విద్య కాబట్టి ‘బ్రహ్మవిద్య’ అనీ..
∙ఆత్మనాత్మే వివేకమును స్పష్టపరిచే సౌఖ్యయోగము, కర్మ యోగము చెప్పినందున ‘యోగశాస్త్రమ’ అనీ..
∙ కృష్ణ పరమాత్మకూ, అర్జునునకూ జరిగిన ప్రశ్నోత్తర రూపంగా ఉన్నందున ‘శ్రీకృష్ణార్జున సంవాదమ’ నీ భగవద్గీతను చెబుతుంటారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top