అనాథ బాలికలకు అమ్మ ఒడి | Mom's lap orphaned girls | Sakshi
Sakshi News home page

అనాథ బాలికలకు అమ్మ ఒడి

Mar 3 2015 11:14 PM | Updated on Sep 2 2017 10:14 PM

అనాథ బాలికలకు అమ్మ ఒడి

అనాథ బాలికలకు అమ్మ ఒడి

కడుపులో ఉన్నప్పుడు కొందరు.. పురుడు పోసుకున్నాక మరికొందరు.....

హమారా ఘర్

కడుపులో ఉన్నప్పుడు కొందరు.. పురుడు పోసుకున్నాక మరికొందరు.. ఆడపిల్లలను హతమార్చే దుర్మార్గానికి పాల్పడుతున్న
 ఈ సమాజంలో... ఏ ఆసరా లేని ఆడ పిల్లలను చేరదీయడమే కాదు, తన ‘హమారా ఘర్’లో అన్నం పెట్టి, విద్యాబుద్ధులు నేర్పి..
 తుదకు పెళ్లి సైతం చేసే బృహత్తర బాధ్యత భుజానికెత్తుకున్నారు అబూ రిజ్వాన్. అంతేకాదు, ఓ అనాథ అయిన అమ్మాయిని తన
 కోడలుగా చేసుకుని  ఆచరణ శీలతకు నిదర్శనంగా నిలిచారు. కర్నూలు నగరంలోని లతీఫ్ లావుబాలి దర్గా సమీపంలో
 ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటైన హమారా ఘర్‌లో ప్రస్తుతం 45 మంది అనాథ బాలికలు ఉన్నారు. వారి ఆలనాపాలన,
 సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికల గురించి ఘర్ నిర్వాహకుడు అబు రిజ్వాన్ సఖిబ్‌తో ఇంటర్వ్యూ.
- ఎస్.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు
 
హమారా ఘర్ ఆలోచన ఎలా వచ్చింది?

నా బాల్యం, విద్యాభ్యాసం అంతా అనాథాశ్రమంలో, పేద విద్యార్థుల మధ్యే సాగింది. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని అప్పుడే అనుకున్నా. పురుషులు ఎలాగోలా ఈ సమాజంలో నెగ్గుకు రాగలరు కాని ఆడపిల్లల మాటేమిటి? పైగా ఆడపిల్లలకు చదువు తప్పనిసరి. ఇంటిని, పిల్లలను, సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకురావడంలో స్త్రీల పాత్ర చాలా ఉంటుంది కదా. అందుకే  మొదట... అనాథలైన ఆరుగురు అమ్మాయిలను చేరదీసి హవూరా ఘర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. ఇందుకు నా స్నేహితులు, దాతల సహకారం చాలా ఉంది.

పిల్లల చదువులు, వారి సంరక్షణ ఎలా?

హమారా ఘర్‌లో ఇంతమంది అనాథలకు ఆశ్రయం లభించిందంటే దాతలు ఇచ్చిన సహకారంతోనే. వారిచ్చిన చందాలు, కానుకలు, వస్తువుల ద్వారా పిల్లలకు భోజనంతో పాటు దుస్తులు, దుప్పట్లు, కొబ్బరినూనె,  అనారోగ్యంపాలైన సందర్భాల్లో చికిత్సలు... ఇలా అన్ని విధాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. తెలుగు, గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్ భాషల్లో చదువు  నేర్పిస్తున్నాం. వీరి చదువు, వుంచి చెడు, బాగోగులు చూసేందుకు నలుగురు వుహిళా టీచర్లను నియుమించాం. ఆసక్తి ఉంటే టైలరింగ్, ఎంబ్రారుుడరింగ్‌తోపాటు అల్లికలు, చేతికుట్లు కూడా నేర్పిస్తున్నాం.  పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపే బాధ్యతలూ తీసుకున్నాం.
 
పెళ్లిళ్ల బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నారు?

మంచి సంబంధాలు వెతికి ఇస్లాం సాంప్రదాయ పద్దతిలో నికాహ్ జరిపించి పంపుతున్నాం. ఇప్పటి వరకు నలుగురికి పెళ్లిళ్లు చేయగలిగాం. మిడ్తూరుకు చెందిన అతియా హమారా ఘర్‌లో పెరిగింది. ఈమెకు 2012 సెప్టెంబరు 8న అనంతపురం జిల్లా పామిడికి చెందిన బట్టల వ్యాపారి రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశాం. రెండో అమ్మాయి (కాల్వగ్రామం) మైమునాను నా చిన్న కొడుక్కి ఇచ్చి చేశాను. కల్లూరు ఎస్టేట్‌కు చెందిన నసీమాను కోవెలకుంట్లకు, మరో అమ్మాయి రుక్సాన (పీలేరు పట్టణం)ను మహబూబ్ నగర్ జిల్లా అమరచింత ఆత్మకూరు మండలంలోని బాలకృష్ణాపురం యువకుడికి ఇచ్చి నికాహ్ చేశాం.

‘హమారా ఘర్’ పేరు ఎంపిక ఎలా జరిగింది?

సంరక్షకులు లేని ఏ చిన్నారి కూడా నేను అనాథ, నాకు ఎవరూ లేరని అనుకోకూడదు. అనాథాశ్రమం అనే పేరు పెడితే ‘మేము అనాథలం.. అనాథాశ్రమంలో ఉన్నాం.. మాకు ఎవ్వరూ లేరు’ అనే భావన  పిల్లల్లో ఉంటుంది. అందుకే  ‘మన ఇల్లు’ అని చెప్పుకునేలా ‘హమారా ఘర్’ అని పేరు పెట్టాం.

దాతల సహకారం ఎలా ఉంది?

హమారా ఘర్ నిర్వహణ కోసం దాతలు, నా స్నేహితులు, బంధువులు ఇస్తున్న సహకారం వెలకట్టలేనిది. ప్రస్తుతం 200కు పైగా అనాథల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వసతి కల్పన కష్టమవడంతో చిన్నటేకూర్ వద్ద రూ. 30లక్షలతో ఒక ఎకరా స్థలం తీసుకున్నాం. తెలిసిన వాళ్లే కావడంతో డబ్బు ఉన్నప్పుడు కొంతకొంత ఇస్తూ వస్తున్నాం. అక్కడ నిర్మాణం పనులు జరుతున్నాయి. త్వరలో వృద్ధుల అనాధాశ్రమం, ఉచిత అంబులెన్స్ సర్వీసు ప్రవేశపెట్టాలన్నది నా ఆశయం. దాతలు చేయూతస్తే మా పని సులువవుతుంది.
 ఫోటోలు: డి. హుస్సేన్
 
కష్టపడి చదివారు

నందికొట్కూరు తాలుకా మాసపేట గ్రామం అబు రిజ్వాన్ స్వస్థలం. మూడో తరగతి తరువాత తండ్రి అతడిని ఉర్దూ చదువు కోసం కర్నూలుకు పంపించారు. అక్కడ పాతబస్తీలోని ఉమర్ అరబిక్ స్కూల్‌లో చేరి, ‘పూర్ బాయ్స్ బోర్డింగ్ హోమ్’లో ఉండి చదువుకున్నారు రిజ్వాన్. అక్కడే టెన్త్ పాసయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పై చదువులు వద్దని తండ్రి అన్నప్పటికీ.. తన చదువుకు డబ్బు వద్దని చెప్పి అనాథాశ్రమంలో ఉండి ఉర్దు బీఏ (పాండిత్యం) పూర్తి  చేశారు.
 
 అబు రిజ్వాన్

Advertisement
 
Advertisement
Advertisement