జ్ఞాపకాల జాడలలో ఓ క్రాంతదర్శి

జ్ఞాపకాల జాడలలో ఓ క్రాంతదర్శి


 వి.బి. రాజుగా సుప్రసిద్ధులైన వల్లూరు బసవరాజు ఇరవయ్యో శతాబ్దంలో తెలుగువారి చరిత్రను ప్రభావితం చేసిన అగ్రనేతలలో ఒకరు. గుంటూరు జిల్లాలోని వల్లూరు గ్రామం లోని సాధారణ కుటుంబంలో 1914లో జన్మించిన రాజు స్వయంకృషితో ఒక గొప్ప నాయకుడుగా ఎదిగారు. ఇంజనీరుగా వృత్తి కొనసాగిస్తూనే హైదరాబాదులో కార్మికోద్యమానికి పునాదులు వేశారు.



హైదరాబాద్ విముక్తి పోరాటానికీ, ఆంధ్రోద్యమానికీ ఆకర్షితులై, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి అగ్రనేతలతో కలిసి పనిచేశారు.హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక వెల్లోడీ నాయకత్వాన మొదటి మంత్రివర్గం ఏర్పడినప్పుడు రాజుకందులో స్థానం లభించింది. తర్వాత బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలోనూ పనిచేశారు.

 

ఆంధ్రప్రదేశ్ అవతరించాక ఆయన ప్రణాళికశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడటానికి కారకులయ్యారు. మంత్రి వర్గం నుండి బయటకు వచ్చాక ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. రెండేళ్ళ పదవీకాలంలో మొదటిసారిగా రాష్ట్రంలో రాత్రి బస్ సర్వీసును పరిచయం చేసింది ఆయనే. విలువైన ప్రయాణ సమయాన్ని ఆదా చేసే నైట్ సర్వీస్ నాటి నుండి ఎంతో ప్రజాదరణ పొందింది. రాజ్యసభ సభ్యులుగా, రాజ్యసభ ప్యానెల్ చెయిర్ పర్సన్‌గా జాతీయ రాజకీయాల్లోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు వి.బి.రాజు.



 ప్రజాచైతన్యం కలిగించాలంటే పత్రికారంగంలో ప్రవేశించి, సంఘ విద్రోహుల అక్రమాలను, దుశ్చర్యలను బట్టబయలు చెయ్యాలనీ, సామాన్యుడిలో రాజకీయ స్పృహ జాగృతం చెయ్యాలనీ భావించి ‘ఆంధ్ర జనత’ దినపత్రికను నడిపించారు. తర్వాత ఆంగ్లంలో ‘డైలీ న్యూస్’ దినపత్రికను స్వీయ సంపాదకత్వంలో తెచ్చారు. స్వాతంత్య్ర యోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి అండతో ‘తెలుగు దేశం’ అనే పత్రిక నడిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న మన దేశ ప్రతినిధి వర్గ సభ్యుడుగా ఎంపికయ్యారు. ఆ బాధ్యతను ప్రతిభావంతంగా నిర్వహించారు. తెలుగు నేలపై, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో వి.బి. రాజును తమ గురువుగా భావించిన చాలా మంది రాజకీయ నేతలున్నారు.

     

 (వి.బి. రాజు రాసుకున్న అసంపూర్తి ‘ఆత్మకథ’ నుంచి కొన్ని భాగాలు...)

 ‘‘మొదటిసారి నేను హైదరాబాద్ నగరాన్ని చూసినది 1932వ సంవత్సరంలో. అప్పటికి నేను ఇంకా మద్రాసు గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తీసుకొని తిరిగి 1934లో హైదరాబాద్ చేరుకొని ఇక్కడే స్థిరపడటానికి ఇష్టపడ్డాను. అప్పటికి నా వయస్సు పందొమ్మిదేండ్లే. తరువాత మూసీనది సాక్షిగా ఎన్నో పరిణామాలు సంభవించాయి. 1947 జూన్ నుంచి 1948 సెప్టెంబరు వరకు, అంటే పధ్నాలుగు, పదిహేను నెలల తీవ్ర పోరాటాల అనంతరం ఈ పరిణామాలు కొలిక్కి వచ్చాయి.

 

నేను హైదరాబాద్‌లో స్థిరపడిన మొదటి ఏడాదే, అంటే 1934లోనే ఖమ్మం మెట్టులో జరిగిన మూడవ నైజాం స్టేట్ ఆంధ్ర మహాసభలకు ఒక సందర్శకుడుగా హాజరయ్యాను. ఆ రోజులలో రాజకీయాభిప్రాయాలను వ్యక్తం చేయటానికి గాని, కనీసం సంఘ సంస్కరణలను చర్చించడానికిగాని సంస్థాన ప్రభుత్వం అనుమతి ఇచ్చేవారు కారు. తెలంగాణా ప్రజలకు సంబంధించిన కీలకమైన అనేక ముఖ్య విషయాలపై నేను అభిప్రాయాలు ఏర్పరచుకొనటానికి సురవరం ప్రతాపరెడ్డి గారితో ఏర్పడిన సాన్నిహిత్యం అవకాశం కలిగించింది.

     

 బెజవాడలో స్టేట్ కాంగ్రెస్ కార్యాలయాన్ని స్థాపించిన నాకు అక్కడి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. అయ్యదేవర కాళేశ్వరరావు తన ఇంటినే స్టేట్ కాంగ్రెస్ ఆఫీసు పెట్టుకోవడానికి ఇచ్చారు. హైదరాబాద్ ప్రజల ఉద్యమానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చిన అక్కడి వారిలో మొదటి వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు.

 మొత్తం పధ్నాలుగు నెలల కాలం ప్రజాపోరాటం కొనసాగింది. వేలాది కుటుంబాలు సంస్థానం వదలి వెళ్లిపోయాయి, మరెందరినో రజకార్లు హతమార్చారు. హైదరాబాద్ సమస్యను పరిష్కరించడానికి ఏ వ్యూహం, ఏ విధానం అనుసరించాలనే విషయంలో ఢిల్లీలోని అగ్ర నాయకుల మధ్య విభేదాలు తలెత్తడం, నిజామ్‌తో ఒక అవగాహనకు వచ్చే విషయంలో లార్డ్ మౌంట్ బాటన్ జోక్యం చేసుకోవటం అనే రెండు పరిణామాలు, లక్షలాది ప్రజలు నిండు పధ్నాలుగు నెలల దీర్ఘకాలం దుర్భరమైన కష్టాలు అనుభవించటానికి ముఖ్య కారణాలయ్యాయి. యథాతథ ఒప్పందం తరువాత భారత సైన్యాలను బొలారం నుంచి ఉపసంహరించటం వల్ల చాలా మంది ప్రజల మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థానం వదిలిపోయే పరిస్థితి కలిగింది. రజాకార్లు హింసాకాండను ఉధృతం చేయటానికి కూడా ఇదే దోహదం చేసింది.



 పోలీస్ ఏక్షన్ (ఆపరేషన్ పోలో)



 మొదటి నుంచి భారత ప్రభుత్వం ఇలా మెతక విధానాన్ని ప్రదర్శిస్తుండటం వల్లనే నిజామ్ నవాబు, అతడి ప్రభుత్వం, రజాకార్లు కూడా మొండికెత్తుతూ, పొగరుబోతులుగా ప్రవర్తిస్తూ వచ్చారు. మౌంట్ బాటన్ సూచించిన పరిష్కారాన్నే గనుక నిజామ్ ఒప్పుకొని ఉంటే హైదరాబాద్ దుర్గతి పాలై ఉండేది. హిందువులకి ముస్లిములకి మధ్య ఇక మరెన్నటికీ కలసే వీలు లేని పెద్ద అగాథం ఏర్పడి ఉండేది. స్వతంత్ర భారత చరిత్ర మరొక విధంగా ఉండేది. ‘‘నిజామ్ నవాబు పాలనలోని హైదరాబాద్ సంస్థానం ఇండియాకు ‘కడుపులో రాచపుండు’ ’’ అని సర్దార్ పటేల్ చాలా చక్కగా వర్ణించారు. మౌంట్‌బాటన్ పుణ్యాన ఆ రాచపుండు ఎప్పటికీ అలా ఉండే పోవటమే గాక భారత ప్రాదేశిక సమగ్రతకు ఎప్పటికీ ముప్పు ఏర్పడి ఉండేది. ఏది ఏమైనా, నిజామ్ నవాబును ఎంతో బుజ్జగించారు గానీ లాభం లేకపోయింది. చివరకు జరగవలసింది జరగనే జరిగింది. పరిణామాలన్నీ ‘పోలీస్ యాక్షన్’ అనే చర్యకు దారితీశాయి.

 భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఈ పధ్నాలుగు నెలల పోరాటం అత్యంత దీర్ఘమైనది. చాలా కుటుంబాలు ఇళ్లూ, ఊళ్లూ వదలి వెళ్లిపోయాయి. అప్పటి జ్ఞాపకాలు తలచుకొంటేనే బాధ కలుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగాయి.’’

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top