వీరీవీరీ గుమ్మడిపండ్లు | Meira Kumar's daughter Devangana kumar exhibits her artwork in Hyderabad | Sakshi
Sakshi News home page

వీరీవీరీ గుమ్మడిపండ్లు

Aug 22 2013 12:18 AM | Updated on May 24 2018 2:36 PM

వీరీవీరీ గుమ్మడిపండ్లు - Sakshi

వీరీవీరీ గుమ్మడిపండ్లు

ప్రస్తుత లోకసభ స్పీకర్ మీరాకుమార్ కుమార్తె దేవాంగన కుమార్. ఫొటోగ్రఫీ, డిజైనింగ్, ఆర్ట్ రంగాల్లో కృషిచేస్తున్న దేవాంగన కొన్ని అపురూపమైన ఫొటోలను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు.

ప్రస్తుత లోకసభ స్పీకర్ మీరాకుమార్ కుమార్తె దేవాంగన కుమార్. ఫొటోగ్రఫీ, డిజైనింగ్, ఆర్ట్ రంగాల్లో కృషిచేస్తున్న దేవాంగన కొన్ని అపురూపమైన ఫొటోలను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల తమ మాతృమూర్తి మీరాకుమార్‌తో కలసి హైదరాబాద్ వచ్చారు. ప్రముఖులు ఆ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, దేవాంగనను అభినందించారు.  ఇంతకీ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏమిటి..?
 
వర్క్ ఫోర్స్ గ్రీటింగ్స్!
దాదాపు నూరేళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో ప్రముఖుల వద్ద పనిచేసిన పనివాళ్ల ఫొటోలు  పోస్ట్ కార్డులుగా వచ్చాయి. వివిధ దేశాల్లో Clifton & Co ‘పెజంట్స్ ఆఫ్ ద రాజ్ : ద వర్క్ ఫోర్స్’ పేరిట ముద్రిస్తున్న పోస్ట్‌కార్డులను వివిధ దేశాల కళాభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. తమ బంధు, మిత్రులకు  పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ‘ఇదంతా సాధారణం. ఇందులో విశేషం ఏముంది!’ అనుకునే దశలో ఆ ఫొటోలపై ఒక కొత్త చూపు ప్రసరించింది. ఆ చూపు కలిగిన వ్యక్తి పేరు ‘దేవాంగన’! ఈ పోస్ట్ కార్డులు ఆమెలో  కొత్త ప్రశ్నలను సంధించాయి.
 
పనిమనుషులకు పేర్లుంటాయా!

పోస్ట్ కార్డుల్లో ఉన్న  ప్రకారం వారి పేర్లు... పాకీ మనిషి, చర్మకారుడు,  ఆఫీస్ ప్యూన్, టేబుల్ సర్వెంట్, బార్బర్, దోభీ, పాలమ్మి, వంటవాడు, చౌకీదార్! వీరు పనిమనుషులే, అయినంత మాత్రాన వీరికి  పేర్లుండవా? కార్డుసైజు, ఫొటోసైజు సవివరంగా ముద్రించినవారు వాళ్ల పేరేమిటో ఎందుకు తెలుసుకోలేదు? ఏ పనిచేసేవారైనా ఎవరికి తక్కువ? పనిచేయని వారికంటే పనిచేసేవారు ఎలా తక్కువవుతారు? ఈ తలకిందుల వ్యవహారాన్ని మార్చాలనుకున్నారు దేవాంగన. కొన్నేళ్లు పరిశోధన చేశారు. పాత రికార్డుల ప్రకారం ఆయా స్థలాలకు వెళ్లారు. స్థానిక రికార్డులను, వీలైనచోట్ల పనివారి బంధువులను కలుసుకున్నారు. విసుగు లేకుండా వీరివీరి గుమ్మడిపండు వీరి పేరే మి? అని ప్రయత్నించి వివరాలను సేకరించారు. అయితే వీరు ఫలానా పేరుగల వారు అని కార్డులను రీ-ప్రింట్ చేస్తే సరిపోతుందా?
 
 శ్రమకు పట్టాభిషేకం!
‘‘శ్రామికులను ఎలా గౌరవించాలి? మహరాణిలా గౌరవించాలి. మహరాజులా గౌరవించాలి. పనివాళ్లకు పేర్లే కాదు, సమున్నత స్థానమూ ఉంటుందని నిరూపించాలి’’ అనే పురోగామి భావనతో దేవాంగన తనలోని ఆర్టిస్టును మేల్కొల్పారు. కార్డులపై ‘పెజంట్స్ ఆఫ్ ద రాజ్ ’ చిత్రాలను రీ-కాపీ చేశారు.
 
నిలువెత్తు పట్టు-ముఖమల్ వస్త్రాలపై ఆధునిక టెక్నిక్‌తో ముద్రించారు. చక్కని జరీ అంచుతో  బ్లాక్ అండ్ వైట్ ఫొటోలోని వ్యక్తుల ఆహార్యాన్ని సమూలంగా మార్చివేశారు. రత్నఖచిత ఆభరణాలను పొదిగారు. ఇప్పుడు వారెవరో తెలుసా?
 
బంగారు బొత్తాలతో, అంచులకు వజ్రాలతో, బంగారు లాఠీని పట్టుకున్న చౌకీదార్ బహదూర్ సింగ్, తలకట్టుకు ముత్యాలు, పగడాలతో బంగారు అంచు టీ పాత్రలను పట్టుకున్న టేబుల్ సర్వెంట్ జ్ఞ్యాన్ ప్రకాష్,  నీలాంబరపు చీరెపై ముత్యాల చుక్కలు ప్రకాశిస్తోండగా నిలుచున్న మహిళ ఆంగ్లో ఇండియన్ గ్రేస్,  ముత్యాల అంగారఖా ధరించిన స్వీపర్ మహదేవ్, లేలేత వేళ్లకు బంగారపుపొడి, సిగలో చూడామణి, కాలి పెండెరానికి వజ్రాలు ధరించి బావిలో నీరు తోడుతోన్న పడతి ఫూల్వంతి, దుత్తలో పాలు తెస్తోన్న కన్నగి, ధోభీ ఘనశ్యామ్, టోపీపై వజ్రవైడూర్యాలను పొదిగిన బంగారు నగను ధరించిన చర్మకారుడు తన్వీర్. ఈ కళాత్మక భావనలను ఆచరణలో కొనసాగించే పాలకులొస్తే ఎంత బావుండు!
 
 - పున్నా కృష్ణమూర్తి
 ఫొటోలు: అమర్-ఠాకూర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement