మౌనం వీడకుంటే ఎలా?!

May 28th Menstrual Hygiene Day - Sakshi

మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే

మహిళలకు అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. నెలలో ఐదు రోజుల బాధ నుంచి బయట పడడమంటే ముప్పిరిగొన్న దాడుల నుంచి తమను తాము కాచుకోవడమే.  తన దేహంతో తానే యుద్ధానికి సిద్ధపడడమే. దేహంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఓర్పుతో సహించాలి. ఓర్పుతో సహించడం వరకు అయితే, తప్పదు ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ ఆ బాధ గురించి ఎవరితో చెప్పుకోకూడదు, నోరు విప్పి మాట్లాడకూడదు, విషయాన్ని గుట్టుగా ఉంచాలి. ఇన్నేళ్ల పాటు సాగిన సామాజిక నిషేధం ఇది.

నెలసరి గురించి మాట్లాడడమే పెద్ద తప్పయిపోతే నెలసరిలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి చర్చించేదెలా?  పరిశుభ్రత గురించి చెప్పడానికి ఎవరైనా ముందుకొచ్చినా వినడానికి సిగ్గుతో తలుపుచాటుకు పోయే అమ్మాయిలకు.. అది బిడియపడాల్సిన విషయం ఏమాత్రం కాదు, మాతృత్వం కోసం కొనసాగించాల్సిన దేహధర్మం అని చెప్పేదెలా? అందుకే దీనికి ఓ రోజు ఆవిర్భవించింది? మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే! అది ఈ రోజే. అంటే మే నెల 28.

ఎప్పుడు! ఎక్కడ!
జర్మనీకి చెందిన వాష్‌ (వాటర్, శానిటేషన్, హైజీన్‌లకు సంక్షిప్తరూపం) అనే ఎన్‌జీవో చేసిన ప్రయత్నం ఇది. మహిళల్లో, ముఖ్యంగా కౌమారదశలో ఉన్న అమ్మాయిలకు రుతుక్రమం మీద ఉండే అపోహలు, బిడియాలు పోగొట్టి వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించడం ప్రధాన ఉద్దేశం. పరిశుభ్రత పాటించడానికి తమ అవసరాలను ఎటువంటి సంశయాలూ లేకుండా తెలియ చేయగలిగిన కాన్ఫిడెన్స్‌ని కలిగించడం కూడా.

2012లో ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యం మీద పని చేస్తున్న అనేక సంస్థల సమావేశంలో ఈ మౌనాన్ని ఛేదించి తీరాలనే నిర్ణయం జరిగింది. మరుసటి ఏడాది ‘వాష్‌’ సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ మొదలుపెట్టింది. 2014లో మే నెల 28వ తేదీన మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ కోరుతూ 145 సంస్థల ప్రతినిధులు ఊరేగింపు, ప్రదర్శన, సినిమా ప్రదర్శన, వర్క్‌షాపులు, ప్రసంగాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజున మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ రోజే ఎందుకు?
రుతు చక్రం 28 రోజులు, రుతుస్రావం సరాసరిన ఐదు రోజులు. ఈ రెండింటినీ కలుపుతూ ఏడాదిలో ఐదవ నెల అయిన మే నెలను, రుతుచక్రానికి ప్రతీకగా 28వ తేదీని మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే గా నిర్ణయించారు.

– మను

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top