చలువ పందిరి కింద కథా శ్రవణం

Madhurantakam Rajaram Best Book - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

మధురాంతకం రాజారాంను తలుచుకుంటే స్ఫురించే మాట– నింపాది. దీనికి నెమ్మదితనంతో పాటు నిండుతనం అన్న అర్థం కూడా ఉంది. మనసు నిండినతనంతో రాసిన హడావుడి పెట్టని కథలు ఆయనవి. జీవన్ముక్తుడు, నేలా నింగీ, కొండారెడ్డి కూతురు, కమ్మ తెమ్మెర, సర్కసు డేరా, ఆగని వేగం లాంటివి తెలుగు సాహిత్యానికి ఆయన కానుకగా ఇచ్చిపోయిన 325 కథల్లో కొన్ని. ఆయన అన్ని కథాసంపుటాలను ఇంతకుముందు విశాలాంధ్ర ప్రచురించింది. మళ్లీ ఎమెస్కో ద్వారా ఈ ఏడాది ఆయన కథల సర్వస్వం రానుందని సమాచారం. మధురాంతకం రాజారాం కథలకు మునిపల్లె రాజు రాసిన ముందుమాటలోని కొంతభాగం రాజారాం ఇరవయ్యో వర్ధంతి సందర్భంగా ఇక్కడ:

ఎవరి జీవన దృక్పథమూ, సాహిత్య వ్యాసంగమూ జంటగా, శ్రుతిలయలై, దార్శనికతగా రూపుదిద్దుకుంటాయో, ఏ రచయితకు మానవాదర్శం మీద, మానవ సామర్థ్యం పట్ల గౌరవమూ అకుంఠిత విశ్వాసమూ వుంటాయో, ఏ కథకుడు– అన్ని విధాల వితండ వాదనలకు, తర్క కుతర్కాలకు, నినాదపూరిత సిద్ధాంతాలకు అతీతంగా మానవతనే మహామంత్రంగా రచనా జపయజ్ఞం చేస్తాడో– అతగాడి సృజనను కాలం కుదిపి వేయలేదు, చెరిపి వేయలేదు.

మధురాంతకం రాజారాం ఆ కోవలోనివాడు. ఆధునిక మానవుడిలో నెలకొన్న తాత్విక శూన్యత– అతని దరి చేరలేదు. ఆంగ్లభాషలో చెప్పాలంటే అతని సాహిత్య దృక్పథం, దృష్టిProlife insight which is deep and powerful. It will withstand the sweep of the broom of History. రాజారం కథలను Museum of human historyగా పోల్చవచ్చు. రాబోయే తరం వారు గూడా చారిత్రక చిత్రశాలను దర్శించకుండా వుండలేరు గదా!రాజారాం గారి గద్యశైలిలో వున్నది– కవిత్వ శబ్ద మైత్రి. ఆ శైలిలో నాదానికి తక్కువ ప్రాధాన్యం. ధ్వనికి అధిక ప్రాధాన్యం. వ్యంగ్య రచనకు ప్రాతిపదిక అది. ఎక్కడా తిట్టు వినిపించదు. ఇది రాజారాం కథల ప్రత్యేక శైలి.

అతని కథల్లోని ఆంతరంగికత హార్థికమైనది. ఆ పలుకుబడీ, స్నిగ్ధలావణ్యాలు పెద్ద బాలశిక్ష చదువుతున్నట్లే వుంటాయి. ఆ కథల్లో అస్థిరత లేదు. ఆ కథల్లోని ఒక నిశ్చలమైన విశ్వాస ప్రకటన– పిరికి మానవుడికి, వ్యధిత జీవికి ఊరట కలిగించే ప్రాణ శంఖనాదం. అభద్రతను పారదోలే ఆత్మజ్యోతి దర్శనం.1930 దశకంలో జన్మించిన రాజారాం గారు– బాల్యంలో, ఆ మారుమూలపల్లె(చిత్తూరు జిల్లా రమణయ్యగారి పల్లె)లో ప్రకృతి రమణీయకత మధ్య జ్ఞాపకం పెట్టుకొన్నది, ఒక విధమైన బార్టర్‌ సిస్టంలాంటి ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక మాంద్యపు క్రూర వీక్షణాలు ఆ మూలకు సోకి వుండవు. ఆ నీరవ వాతావరణంలో గ్రామస్థుల సౌజన్యంతో తన తండ్రి బతికిన తీరు– తనను చాలా ప్రభావితం చేసిందనే చెప్పేవారు.

ఆనాడు విన్న పౌరాణిక నీతిచంద్రికల వాక్యాల సరళి– అనంతరం ఆయన రచనల్లో ప్రముఖంగా ప్రతిబింబించింది. సంఘర్షణలు– పైకి పొర్లని – ఆ సమన్వయ గ్రామీణ వాతావరణం – శాంతి సామరస్యాల అహింసా వివేచన ఆయన కథల్లో  ప్రవేశించింది. కాలంలో వచ్చిన ఉత్తాన పతనాల్ని అతిసూక్ష్మంగా పరిశీలించాడాయన. పతనమవుతూన్న విలువలను గురించిన పరితాపశిఖలు అట్లా కొన్ని కథల్లో కన్పిస్తాయి. కాని మౌలికమైన భారతీయ గ్రామీణ అహింసాతత్వం జీవితంలోనూ, రచనా వ్యాసంగంలోనూ, కథా సంవిధానంలోనూ చివరివరకూ అంటిపెట్టుకొనే వుంది.
మధురాంతకం రాజారాం
5 అక్టోబర్‌ 1930 – 1 ఏప్రిల్‌ 1999

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top