చదువు కోసం ఆర్డర్‌ తెచ్చుకుంది | Made to order for education | Sakshi
Sakshi News home page

చదువు కోసం ఆర్డర్‌ తెచ్చుకుంది

Mar 6 2018 12:56 AM | Updated on Mar 6 2018 12:56 AM

Made to order for education - Sakshi

బిడ్డతో అన్షియాబీ

పద్దెనిమిది సంవత్సరాలకే బాలికలకు వివాహం జరగడం వల్ల వారింకా డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండరు. అందుకే ఆసక్తి ఉన్నవారు వివాహ ధర్మాన్ని పాటిస్తూనే, చదువు కొనసాగించవలసి వస్తుంది. కొన్ని కుటుంబాల్లో వివాహానికి ముందే ఆడపిల్లల చేత చదువు మాన్పించినప్పటికీ వివాహానంతరం భర్త చొరవతో కాలేజీకి వెళ్లేవారూ ఉంటారు. అయితే అన్షియాబీ పరిస్థితి వీటన్నిటికీ భిన్నమైనది. చదువును కొనసాగించడం కోసం ఆమె హైకోర్టునే ఆశ్రయించవలసి వచ్చింది! 

నిబంధనల ప్రకారం నో ఎంట్రీ
కేరళ తాళిపరంబలోని సర్‌ సయ్యద్‌ కళాశాలలో అన్షియాబీ బిఏ అరబిక్‌ విభాగంలో చదువుతోంది. మూడో సెమిస్టర్‌ వరకు అన్షియాబీ కాలేజీకి హాజరయ్యింది. గర్భవతి అయిన  కారణంగా నాలుగవ సెమిస్టర్‌ సమయంలో సెలవు పెట్టవలసి వచ్చింది. 2016 మార్చిలో బిడ్డకు జన్మనిచ్చాక, కొంతకాలం విరామం తీసుకుని, మళ్లీ కాలేజీలో చేరి కోర్సు పూర్తి చేయాలనుకుంది. ఆ ఉద్దేశంతోనే 2017 జనవరిలో రీ అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కాలేజీ ప్రిన్సిపాల్‌ తిరస్కరించారు. గడిచిన సెమిస్టర్లలో పాస్‌ కానివారికి తిరిగి ప్రవేశం కల్పించడం కుదరదని అన్నారు. దాంతో అన్షియాబీ ఆర్‌టిఐ ద్వారా కళాశాల రూల్స్‌కి సంబంధించిన విషయం తెలుసుకుంది అటువంటి నిషే«దమేమీ లేదని తెలియడంతో అన్షియాబీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. 

నిబంధనలు మార్చి రీ ఎంట్రీ!
‘‘మా కాలేజీ రెగ్యులేషన్స్‌ ప్రకారం, సెమిస్టర్‌ ప్రారంభమయ్యాక వరుసగా నెల రోజులు కాలేజీకి హాజరుకాని వారికి, తిరిగి ప్రవేశించే హక్కు లేదు’’ అన్నారు కాలేజీ యాజమాన్యం. దాంతో కోర్టు ఆలోచనలో పడింది. నెక్ట్స్‌ బ్యాచ్‌కి దరఖాస్తు చేసుకొమ్మని అన్షియాబీకి సూచించింది. కోర్టు సూచనల మేరకు అన్షియాబీ తరవాతి బ్యాచ్‌కి సరైన సమయంలో దరఖాస్తు చేసుకుంది. ఈసారి కూడా కళాశాల తిరస్కరించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది అన్షియాబీ. అప్పుడు మాత్రమే అన్షియాబీకి న్యాయం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌ ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ‘‘తాను తల్లి అయ్యాక కూడా చదువు కొనసాగించాలను కుంటున్నట్లు అన్షియాబీ పిటిషన్‌ చేసుకున్నారు. ఆమెకు తప్పక చదువుకునే అవకాశం కల్పించాలి’’ అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. గర్భిణి అయిన కారణంగా కాని, ప్రసవం కారణంగా కాని మధ్యలోనే చదువు అపిన మహిళలకు, తిరిగి కళాశాలలో చేరే అవకాశం ఇవ్వాలని బెంచ్‌ తీర్పు చెప్పింది. ఈ తీర్పు రావడంతో, అన్షియాబీ తిరిగి కళాశాలలో చేరింది. చదువు వెలుగునిస్తుం దంటారు. అన్షియాబీ చదువు.. వెలుగునిచ్చే తీర్పునే తీసుకొచ్చింది. 

‘‘తల్లి అయ్యాక కూడా చదువు కొనసాగించాలని  కోరుకుంటున్న మహిళలకు విద్యాసంస్థల  యాజమాన్యాలు తప్పక సహకరించాలి’’
– కేరళ కోర్టు తీర్పు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement