breaking news
Girls weddings
-
చదువు కోసం ఆర్డర్ తెచ్చుకుంది
పద్దెనిమిది సంవత్సరాలకే బాలికలకు వివాహం జరగడం వల్ల వారింకా డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండరు. అందుకే ఆసక్తి ఉన్నవారు వివాహ ధర్మాన్ని పాటిస్తూనే, చదువు కొనసాగించవలసి వస్తుంది. కొన్ని కుటుంబాల్లో వివాహానికి ముందే ఆడపిల్లల చేత చదువు మాన్పించినప్పటికీ వివాహానంతరం భర్త చొరవతో కాలేజీకి వెళ్లేవారూ ఉంటారు. అయితే అన్షియాబీ పరిస్థితి వీటన్నిటికీ భిన్నమైనది. చదువును కొనసాగించడం కోసం ఆమె హైకోర్టునే ఆశ్రయించవలసి వచ్చింది! నిబంధనల ప్రకారం నో ఎంట్రీ కేరళ తాళిపరంబలోని సర్ సయ్యద్ కళాశాలలో అన్షియాబీ బిఏ అరబిక్ విభాగంలో చదువుతోంది. మూడో సెమిస్టర్ వరకు అన్షియాబీ కాలేజీకి హాజరయ్యింది. గర్భవతి అయిన కారణంగా నాలుగవ సెమిస్టర్ సమయంలో సెలవు పెట్టవలసి వచ్చింది. 2016 మార్చిలో బిడ్డకు జన్మనిచ్చాక, కొంతకాలం విరామం తీసుకుని, మళ్లీ కాలేజీలో చేరి కోర్సు పూర్తి చేయాలనుకుంది. ఆ ఉద్దేశంతోనే 2017 జనవరిలో రీ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కాలేజీ ప్రిన్సిపాల్ తిరస్కరించారు. గడిచిన సెమిస్టర్లలో పాస్ కానివారికి తిరిగి ప్రవేశం కల్పించడం కుదరదని అన్నారు. దాంతో అన్షియాబీ ఆర్టిఐ ద్వారా కళాశాల రూల్స్‌కి సంబంధించిన విషయం తెలుసుకుంది అటువంటి నిషే«దమేమీ లేదని తెలియడంతో అన్షియాబీ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిబంధనలు మార్చి రీ ఎంట్రీ! ‘‘మా కాలేజీ రెగ్యులేషన్స్ ప్రకారం, సెమిస్టర్ ప్రారంభమయ్యాక వరుసగా నెల రోజులు కాలేజీకి హాజరుకాని వారికి, తిరిగి ప్రవేశించే హక్కు లేదు’’ అన్నారు కాలేజీ యాజమాన్యం. దాంతో కోర్టు ఆలోచనలో పడింది. నెక్ట్స్ బ్యాచ్‌కి దరఖాస్తు చేసుకొమ్మని అన్షియాబీకి సూచించింది. కోర్టు సూచనల మేరకు అన్షియాబీ తరవాతి బ్యాచ్‌కి సరైన సమయంలో దరఖాస్తు చేసుకుంది. ఈసారి కూడా కళాశాల తిరస్కరించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది అన్షియాబీ. అప్పుడు మాత్రమే అన్షియాబీకి న్యాయం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ‘‘తాను తల్లి అయ్యాక కూడా చదువు కొనసాగించాలను కుంటున్నట్లు అన్షియాబీ పిటిషన్ చేసుకున్నారు. ఆమెకు తప్పక చదువుకునే అవకాశం కల్పించాలి’’ అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. గర్భిణి అయిన కారణంగా కాని, ప్రసవం కారణంగా కాని మధ్యలోనే చదువు అపిన మహిళలకు, తిరిగి కళాశాలలో చేరే అవకాశం ఇవ్వాలని బెంచ్ తీర్పు చెప్పింది. ఈ తీర్పు రావడంతో, అన్షియాబీ తిరిగి కళాశాలలో చేరింది. చదువు వెలుగునిస్తుం దంటారు. అన్షియాబీ చదువు.. వెలుగునిచ్చే తీర్పునే తీసుకొచ్చింది. ‘‘తల్లి అయ్యాక కూడా చదువు కొనసాగించాలని కోరుకుంటున్న మహిళలకు విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పక సహకరించాలి’’ – కేరళ కోర్టు తీర్పు -
చిన్నారి పెళ్లికూతురు కేరాఫ్ సిటీ
గ్రామాల్లో కంటే పట్టణాల్లో పెరిగిన బాలికల పెళ్లిళ్లు బాల్య వివాహం.. ఓ సాంఘిక దురాచారం.. బాల్య వివాహం అనేసరికి మనకు గ్రామాల్లో, తండాల్లో ఎక్కువగా జరుగుతుందని అనుకుంటాం. కానీ అందుకు భిన్నంగా పట్టణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయట. బాలికల పెళ్లిళ్ల సంఖ్య అర్బన్ ప్రాంతాల్లో పెరిగిందట. అర్బన్ ప్రాంతాల్లో 10 నుంచి 17 ఏళ్లు కలిగిన ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసుకంటే ముందే వివాహం జరుగుతోందట. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్), యంగ్ లివ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో అధికం.. మహారాష్ట్ర.. దేశంలోనే మూడో ధనిక రాష్ట్రం(తలసరి ఆదాయం ప్రకారం). 2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్ 70 జిల్లాల్లో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. రాజస్థాన్.. దేశంలోనే తొమ్మిదో పేద రాష్ట్రం(తలసరి ఆదాయం ప్రకారం). 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన బాలికలు, 10 నుంచి 20 ఏళ్ల మధ్య బాలురు.. చట్టం నిర్దేశించిన వయసు నిండకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. రాజస్థాన్‌లో అతి ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్లు(అబ్బాయిలు 8.6 శాతం, అమ్మాయిలు 8.3 శాతం) జరుగుతున్నాయి. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని(ఉమ్మడి ఏపీతో కలిపి) 70 జిల్లాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోనే 21.1 శాతం బాలికల వివాహాలు జరగగా.. 22.5 శాతం అబ్బాయిల వివాహాలు జరిగాయి. కారణాలేమిటీ.. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో బాలికల వివాహాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. బాలికలు రజస్వల కాగానే పెళ్లి చేయడం.. పేదరికం.. చదువుకోకపోవడం.. కులం.. కుటుంబ నేపథ్యం.. లింగ వివక్ష.. వంటివి కారణాలుగా భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బాల్య వివాహాల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.