చిన్నారి పెళ్లికూతురు కేరాఫ్‌ సిటీ | Increased girls' weddings in towns than in villages | Sakshi
Sakshi News home page

చిన్నారి పెళ్లికూతురు కేరాఫ్‌ సిటీ

Jun 14 2017 12:27 AM | Updated on Aug 1 2018 2:29 PM

చిన్నారి పెళ్లికూతురు కేరాఫ్‌ సిటీ - Sakshi

చిన్నారి పెళ్లికూతురు కేరాఫ్‌ సిటీ

బాల్య వివాహం.. ఓ సాంఘిక దురాచారం.. బాల్య వివాహం అనేసరికి మనకు గ్రామాల్లో, తండాల్లో ఎక్కువగా జరుగుతుందని అనుకుంటాం.

గ్రామాల్లో కంటే పట్టణాల్లో పెరిగిన బాలికల పెళ్లిళ్లు
 
బాల్య వివాహం.. ఓ సాంఘిక దురాచారం.. బాల్య వివాహం అనేసరికి మనకు గ్రామాల్లో, తండాల్లో ఎక్కువగా జరుగుతుందని అనుకుంటాం. కానీ అందుకు భిన్నంగా పట్టణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయట. బాలికల పెళ్లిళ్ల సంఖ్య అర్బన్‌ ప్రాంతాల్లో పెరిగిందట. అర్బన్‌ ప్రాంతాల్లో 10 నుంచి 17 ఏళ్లు కలిగిన ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసుకంటే ముందే వివాహం జరుగుతోందట. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌), యంగ్‌ లివ్స్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
 
మహారాష్ట్ర, రాజస్థాన్‌లో అధికం..
మహారాష్ట్ర.. దేశంలోనే మూడో ధనిక రాష్ట్రం(తలసరి ఆదాయం ప్రకారం). 2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్‌ 70 జిల్లాల్లో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది.
 
రాజస్థాన్‌.. దేశంలోనే తొమ్మిదో పేద రాష్ట్రం(తలసరి ఆదాయం ప్రకారం). 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన బాలికలు, 10 నుంచి 20 ఏళ్ల మధ్య బాలురు.. చట్టం నిర్దేశించిన వయసు నిండకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. రాజస్థాన్‌లో అతి ఎక్కువగా చైల్డ్‌ మ్యారేజ్‌లు(అబ్బాయిలు 8.6 శాతం, అమ్మాయిలు 8.3 శాతం) జరుగుతున్నాయి. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని(ఉమ్మడి ఏపీతో కలిపి) 70 జిల్లాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోనే 21.1 శాతం బాలికల వివాహాలు జరగగా.. 22.5 శాతం అబ్బాయిల వివాహాలు జరిగాయి.
 
కారణాలేమిటీ.. 
గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో బాలికల వివాహాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. బాలికలు రజస్వల కాగానే పెళ్లి చేయడం.. పేదరికం.. చదువుకోకపోవడం.. కులం.. కుటుంబ నేపథ్యం.. లింగ వివక్ష.. వంటివి కారణాలుగా భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బాల్య వివాహాల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement