డెకో గణపతి

Lord ganesh special story - Sakshi

అలంకారం

ఎకో గణపతిలా.. ఈయన ‘డెకో’ గణపతి. 
ఎకో గణపతికి రంగులు ఉండవు. 
స్వచ్ఛమైన మట్టి ముద్దతో తయారౌతాడు.
ఆ మట్టి గణపయ్యను డెకరేట్‌ చేస్తే ఆయనే.. 
డెకో గణపతి.

బుజ్జి గణపతిని ఎలా సింగారించినా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. మట్టితో రూపమిచ్చి, ప్రకృతిలో దొరికే వస్తువులతో ఆ రూపానికి అలంకరణ చేస్తే అంతకు మించిన అందం ఉండదేమో అనిపిస్తుంది. ఇందుకోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. చిన్న చిన్న మార్పులతో, ఇంట్లో దొరికే వస్తువులతోనే గణపయ్యను అందంగా అలంకరించవచ్చు. మనసారా గణపయ్యను అలంకరించుకొని భక్తిగా కొలుచుకోవచ్చు.

పూసల తలపాగా
అట్ట ముక్కను తలపాగాకు కావల్సిన పరిమాణంలో కత్తిరించి, ‘గ్లూ’తో సెట్‌చేయాలి. తెల్లని పూసలను వరుసలుగా ఆ తలపాగాకు గ్లూతో అతికించాలి. మధ్య ఒక నెమలి పింఛాన్ని అతికిస్తే గణపతి తలపాగా రెడీ. ఇదే అట్టముక్కకు రంగు రంగుల నెట్‌ ఫ్యాబ్రిక్, చమ్కీలు వాడి మరో అందమైన తలపాగాను సిద్ధం చేయవచ్చు.

పూల సింహాసనం
ఎరుపు రంగు పేపర్‌ చార్ట్‌ని తామర పువ్వు రేకలుగా ఒకే సైజులో కత్తిరించాలి. ఒక్కో పువ్వు రేక చుట్టూతా బంగారు రంగు లేస్‌ని అతికించాలి. లేదంటే పసుపు రంగు స్కెచ్‌తో డిజైన్‌ని కూడా గీయవచ్చు.రెండు తెల్ల చార్ట్‌లను గుండ్రంగా కత్తిరించి, సిద్ధంగా ఉన్న పువ్వు రేకలను చార్ట్‌కు అతికించాలి. రెండు వరసలుగా అతికించిన పువ్వు రేకలను పై వరుస పైకి, కింద వరస కిందకు అమర్చాలి. ఈ తామరపువ్వు సింహాసనం.. గణేషుడిని ఉంచడానికి సిద్ధమైనట్టే. గట్టి కాటన్‌ బాక్స్‌ను తగినంత పరిమాణంలో కత్తిరించి, దానికి వెల్వెట్‌ పేపర్, లేసు, చమ్కీలు, పూసలు వాడి సింహాసనాన్ని సిద్ధం చేయవచ్చు.

రంగోలి అలంకరణ
పసుపు, కుంకుమ, బియ్యప్పిండి కాంబినేషన్లతోనే మట్టి గణపయ్యకు రంగులుగా వాడవచ్చు. అదే పసుపు, కుంకుమ, పిండిలతో అందమైన రంగవల్లులను గణపతి ప్రతిమను ఉంచే పీఠం ముందు  తీర్చిదిద్దవచ్చు. 

నెమలిపింఛం
హిందూమతంలో నెమలిపింఛానికి ఓ ప్రత్యేక స్థానం. కృష్ణుడి తల మీదనే కాదు, గణపతి చేతిలో రాయడానికి అనువుగా నెమలి పింఛం ఉన్నట్టు దేవతామూర్తుల ఫొటోలలో చూస్తుంటాం. గణేశ ప్రతిమను ఉంచే చోట ఓ నెమలి పింఛాన్ని ఫ్లవర్‌వేజ్‌లో వేసి, ఉంచితే ఆ అలంకరణలో ఓ ప్రత్యేక కళ వచ్చేస్తుంది.

రంగు రంగుల కర్టెన్లు 
గణపతి ప్రతిమ వెనక భాగంలో రంగు రంగుల కర్టెన్లను వేలాడదీస్తే చాలు అలంకరణలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. వీటికి ప్లెయిన్‌ సిల్క్‌ తెరలను వాడచ్చు. గుమ్మాలకు, కిటికీలకు వేలాడదీసేవే కాకుండా డెకొరేటివ్‌ కర్టెన్లు కూడా విడిగా మార్కెట్లో లభిస్తున్నాయి. 

చమ్కీల గొడుగులు
గణనాథుడికి పట్టే గొడుగును ఇంట్లోనే అందంగా తయారుచేసుకోవచ్చు. పేపర్‌ చార్ట్‌తో గొడుగును తయారు చేసి, దానికి వెల్వెట్‌ పేపర్, ఆ పైన   చమ్కీలు, పూసలు గ్లూతో అతికించి అలంకరించవచ్చు. 

పూల దండలు
వరుసలుగా కట్టిన రంగు రంగుల పూలదండలు గణపతి ప్రతిమ వెనకాల మండపానికి అలంకరణ కోసం ఉపయోగిస్తే పండగ కళ పరిమళమై వికసిస్తుంది.
–  ఎన్‌.ఆర్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top