మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా...

మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా...


బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే విధానాల్లో నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ అని రెండు ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కి నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్‌కి ఆర్‌టీజీఎస్ సంక్షిప్త రూపాలు. బ్యాంకులో ఈ సేవలు వినియోగించుకోవాలంటే.. నిర్దేశిత ఫారం నింపాల్సి ఉంటుంది. లబ్ధిదారు పేరు, బ్యాంకు.. శాఖ పేరు, ఖాతా నంబరు, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐఎఫ్‌ఎస్‌సీ) మొదలైన వివరాలు రాసి.. చెక్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఆన్‌లైన్లో సైతం ఈ విధానాల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

 

ఆర్‌టీజీఎస్ విధానం కింద ట్రాన్స్‌ఫర్ చేయాలంటే కనీసం రూ. 2 లక్షలు బదిలీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి గరిష్ట మొత్తం ఆధారపడి ఉంటుంది. అదే నెఫ్ట్ విధానంలోనైతే ఒక్క రూపాయైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

 

ఇక చార్జీల విషయానికొస్తే..  నెఫ్ట్ విధానంలో బదిలీ చేసిన మొత్తాన్ని బట్టి రూ. 5-25 దాకా చార్జీలు ఉంటాయి. ఆర్‌టీజీఎస్‌కి సంబంధించి రూ. 2-5 లక్షల దాకా ట్రాన్స్‌ఫర్‌కి రూ. 25, రూ. 5 లక్షలకు మించిన మొత్తంపై రూ. 50 మేర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

 

మిగతా విధానాలతో పోలిస్తే నగదు బదిలీ వేగంగా జరగడం నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ప్రత్యేకత. నెఫ్ట్‌లో సుమారు ప్రతి గంటకోసారి క్లియరెన్స్ ఉంటుంది. అంటే బదిలీ చేసిన నగదు.. అవతలి వారి ఖాతాలో సుమారు గంట తర్వాతకల్లా ప్రతిఫలిస్తుంది. క్లియరెన్స్ సమయాన్ని బట్టి కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో కూడా పూర్తికావొచ్చు.  ఆర్‌టీజీఎస్‌లో అప్పటికప్పుడు లావాదేవీ పూర్తవుతుంది. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 9 నుంచి సాయంత్రం ఏడు వరకు, శనివారాల్లో ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. దాకా చాలా మటుకు బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి. ఈ వేళలు దాటిన తర్వాత చేసే లావాదేవీలు మర్నాడు పూర్తవుతాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత లావాదేవీ విఫలమైతే .. డెబిట్ చేసిన డబ్బును బ్యాంకు మళ్లీ మన ఖాతాలోకి బదిలీ చేస్తుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top