ఖండాంతర బంధం

Liberian Mother And Son Struck in India Lockdown - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ ఎక్కడి వాళ్లను అక్కడే ఆపేసింది. కరోనా వికటాట్టహాసాన్ని ఏ మాత్రం ఊహించని ప్రపంచం తన క్యాలెండర్‌ను తాను డిసైడ్‌ చేసుకుంది. ఆ క్యాలెండర్‌ను గోడ మీద నుంచి తీసి అటక మీద పెట్టమని డిక్లేర్‌ చేసింది కోవిడ్‌ 19. ఎటూ కదలకుండా ఉన్న చోటనే ఉండమని కాళ్లకు బంధనాలు వేసింది. కరోనా చెప్పినట్లే లైబీరియాకు చెందిన ఈ తల్లీబిడ్డలు ఉన్న చోటనే ఉన్నారు. ఆ ఉన్న చోటు వాళ్ల దేశం కాదు, మనదేశం.

హార్ట్‌ఫుల్‌ ఆపరేషన్‌
రెండున్నర ఏళ్ల జిన్‌కు పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. కొడుకుకి వైద్యం చేయించడానికి మార్చి రెండవ తేదీన ఇండియాకి తీసుకు వచ్చింది జెన్నీ పేయీ. అప్పటికి లాక్‌డౌన్‌ లేదు. కేరళ రాష్ట్రం, కొచ్చిలోని లిజీ హాస్పిటల్‌లో ఆపరేషన్‌. మార్చి 12వ తేదీ ఓపెర్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. జిన్‌ ఆరోగ్యం మెరుగైంది. ఆపరేషన్‌ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లడానికి ఏప్రిల్‌ రెండవ తేదీకి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చింది జెన్నీ. ఆ తేదీ నాటికి లాక్‌డౌన్‌లో చిక్కుకోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇరవై ఆరేళ్ల జెన్నీ పేయీ, రెండున్నరేళ్ల కొడుకు జిన్‌తో కలిసి ఇప్పటికీ హాస్పిటల్‌లోనే ఉంది. ఆమె భర్త పీటర్‌ లైబీరియాలో ఉండిపోయాడు. బిడ్డకు గుండె ఆపరేషన్‌ చేస్తుంటే రావాలని లేని కఠినాత్ముడు కాదు పీటర్‌. ఆ దంపతులకు రెండోబిడ్డ జిన్‌. మొదటి బిడ్డను చూసుకుంటూ అతడు లైబీరియాలో ఉండిపోయాడు. అంతే కాదు, జిన్‌కు ఆపరేషన్‌ చేయించడానికి లైబీరియాలో వాళ్లు ఉంటున్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు పీటర్‌. భార్యాబిడ్డలను ఇండియాకు పంపించడానికి అతడు ఓటీలు చేసి డబ్బు కూడబెట్టాడు. ఇప్పుడు కూడా అతడు అక్కడ అప్పు తీర్చడం కోసం ఎక్కువ గంటలు పని చేస్తూ ఉన్నాడు.

కడుపులో పెట్టుకుని...
జెన్నీ, జిన్‌లను లిజీ హాస్పిటల్‌ అతిథుల్లా చూసుకుంటోంది. వారు హాస్పిటల్‌ గదిలోనే ఉన్నారిప్పటికీ. ఆ గదికి చార్జ్‌ చేయకుండా ఉచిత బస కల్పించింది లిజీ హాస్పిటల్‌. భోజనం కూడా పెడుతోంది. వైద్య సిబ్బంది జెన్నీని, జిన్‌ను ఆదరంగా పలకరిస్తున్నారు. ‘‘వైద్యం కోసం వచ్చి మనదేశంలో చిక్కుకుపోయిన తల్లీబిడ్డల సంరక్షణ బాధ్యత మనదే. ఇంకా ఏమైనా కావాలంటే ఏర్పాటు చేయండి’’ అని స్థానికులు డబ్బు విరాళంగా ఇస్తున్నారు. లైబీరియా కాన్సులేట్‌ పర్యవేక్షిస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ మా దేశానికి వెళ్లేదెప్పుడు అని ఆందోళన పడుతోంది జెన్నీ. సహాయం చేయమని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటూ వీడియో సందేశం విడుదల చేసింది. లైబీరియా నుంచి పీటర్‌ కూడా అదే అభ్యర్థన చేస్తూ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో పీటర్‌ ‘తన భార్యాబిడ్డలను కన్నవాళ్లలా కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది ఇండియా’ అంటూ ఆర్ద్రంగా కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇది ఆసియా– ఆఫ్రికా ఖండాల మధ్య లాక్‌డౌన్‌ సృష్టించిన అనుబంధం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top