లోకానికి ఇవ్వగలిగే పాఠం

 lesson you can give to the world - Sakshi

చెట్టు నీడ 

తండ్రీ కొడుకూ తినడం పూర్తయ్యింది. 
నెమ్మదిగా తండ్రి చేతిని కడిగించాడు 
కొడుకు. మూతి తుడిచాడు. మీద 
పడిన మెతుకులను తీసేశాడు.

ఒక యువకుడు వాళ్ల నాన్నను ఒక రెస్టారెంటుకు తీసుకెళ్లాడు. నాన్న బాగా వృద్ధుడయ్యాడు. బలహీనంగా ఉన్నాడు. భోంచేస్తుంటే చేతులు వణుకుతున్నాయి. అందుకే తింటున్నప్పుడు మెతుకులు తన చొక్కా మీదా, టేబుల్‌ మీదా వేసుకున్నాడు. వడ్డించుకుంటుండగా పులుసు కింద పడింది. అది చూస్తున్న పక్కనున్నవాళ్లు ఇబ్బందిగా ఫీలయ్యారు. ఇలాంటివాడిని బయటికి తీసుకురాలేకపోతేనేమని కూడా కొందరు మనసులో అనుకున్నారు. తండ్రీ కొడుకూ తినడం పూర్తయ్యింది. నెమ్మదిగా తండ్రి చేతిని కడిగించాడు కొడుకు. మూతి తుడిచాడు. మీద పడిన మెతుకులను తీసేశాడు. నెమ్మదిగా లేవదీసి, భుజం మీద చేయి వేయించుకుని నడిపించుకుంటూ వెళ్లి, ముందున్న సోఫాలో కూర్చోబెట్టాడు.

కౌంటర్‌లో బిల్లు చెల్లించి, మళ్లీ వాళ్ల నాన్నను సమీపిస్తున్నప్పుడు, ఆ రెస్టారెంటులో కూర్చుని భోజనం చేస్తున్నవారిలో ఒక పెద్దాయన పిలిచాడు. ‘నాయనా, నువ్వు మీ టేబుల్‌ దగ్గర ఏమైనా వదిలిపెట్టావా?’  ఆ యువకుడు తన జేబుల్ని తడుముకొని, ‘ఏమీ లేదే’ అని జవాబిచ్చాడు. ‘కాదు, నువ్వు అక్కడ మాకో పాఠాన్ని విడిచావు’ అన్నాడు పెద్దాయన. యువకుడు చిరునవ్వుతో తండ్రి సహా బయటికి వెళ్లిపోయాడు. పాఠం చెప్పడానికి ప్రత్యేకంగా మనం ఏమీ చేయనక్కర్లేదు. మనం చూపించే చిన్న చిన్న ప్రేమల్లో, ఆప్యాయతల్లో కూడా ఇంకొకరికి పాఠం కాగలిగేది ఏదో ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top