పర్యావరణ హితమైన వెదురు బాటిళ్లు

Leak Free Bamboo Water Bottles Made By Assam Man - Sakshi

వేసవి కాలం వస్తోంది. ఈ కాలం తాగడానికి చల్లని నీళ్లు తప్పనిసరి అవసరం. రోజులో ఎక్కువ సేపు చల్లగా ఉండే బాటిళ్లు కొన్ని అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, అవి బోలెడంత ఖరీదైనవి. పైగా వాటిలో ప్లాస్టిక్‌ బాటిళ్లే ఎక్కువ. పర్యావరణానికి హానికారకంగా ఉన్న ప్లాస్టిక్‌ను దూరం చేయాలంటే సహజసిద్ధమైన ఉత్పాదనల ద్వారా మన నిత్యావసరాలు తీరాలి. ఆ ఆలోచనలోంచి పుట్టిందే వెదురు బొంగుతో తయారు చేసిన నీళ్ల బాటిళ్లు.

‘జార్‌ నాయి బాన్హ్, తార్‌ నాయి ఖాహ్‌’ అని అస్సామీలో ఓ సామెత ఉంది. అంటే ‘వెదురు లేని వ్యక్తికి ధైర్యం లేదు’ అని దీనర్ధం. నిత్యం వెదురుతోనే దోస్తీ చేస్తూ ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి ప్రకృతివైపు వెళ్లడానికి ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వ్యక్తి దృతిమాన్‌ బోరా. అస్సాంలో వెదురు వస్తువుల తయారీ సంస్థ వ్యవస్థాపకుడు. వెదురు నుండి పర్యావరణ అనుకూల వస్తువులను తయారుచేస్తున్న బోరా ఈ బయో–డిగ్రేడబుల్‌ బాటిళ్లను నీళ్లు లీక్‌ కానివిధంగా తయారు చేశాడు. సీసా మూత కార్క్‌ అంటే వెదరుముక్కతో తయారుచేసి బిరడాలా బిగించడంతో ఇది నీళ్లను బయటకు రానివ్వదు. ఈ వెదురుబొంగు బాటిళ్లను పరిచయం చేయడానికి ధృతిమాన్‌కి 17 ఏళ్ళకు పైగానే పట్టింది. సుమారు 20 ఏళ్ల క్రితం ధృతిమాన్‌ బోరా పన్నెండవ తరగతితో చదువును ఆపేస్తానని తల్లిదండ్రికి ధైర్యంగా చెప్పేశాడు. జీవితంలో ఎలా నిలదొక్కుకుంటాడో అని భయపడిన తల్లి దండ్రులకు పై చదువులకు బదులుగా వెదురుతో రకరకాల ఫర్నీచర్‌ను తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు.  

పెరటి తోట నుంచి స్ఫూర్తి
అస్సాం ప్రధాన నగరమైన గౌహతికి ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి పెరటిలోనే వెదురు తోటలు ఉండేవి. వీటి నుంచే తన కలలకు వారధి కట్టుకున్నాడు బోరా. దృఢమైన, మన్నికైనా వెదురును కనుక్కొని డిబి ఇండస్ట్రీస్‌ను 20 ఏళ్ల వయసులోనే నెలకొల్పాడు. అతని సంస్థ ద్వారా వెదురు వస్తువులు విక్రయిస్తుంటాడు. కొనుగోలుదారులను తన ఉత్పత్తులవైపు ఆకర్షించడానికి ఏదైనా ప్రత్యేకమైన వస్తువును కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. రకరకాల పనులు చేస్తూనే వెదురు నీటిబాటిల్‌ తయారీలో నిమగ్నమయ్యేవాడు. ఇప్పుడు ఏడాదిలోగా ఒక్క అస్సాంలోనే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వెదురు బాటిళ్లలో నీళ్లు తాగాలనుకునేవిధంగా ఇవి ఆకర్షించాయి. ఈ బాటిళ్లు వేర్వేరు పరిమాణాలలో రూ.400 నుంచి రూ.600 మధ్య లభిస్తున్నాయి. 

అవరోధాలను అధిగమిస్తూ..
‘సహజమైన ఉత్పత్తి కావడంతో ఈ బాటిళ్లలో పోసిన నీళ్లు చల్లగా, శుభ్రంగా ఉంటాయి. ఇది గట్టిగా ఉండటంతో సులువుగా పగిలిపోదు. బొంగు కాబట్టి తేలికగానూ ఉంటుంది. దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు’ అని చెబుతాడు బోరా. ‘మా సెంటర్లో పతి నెలా 1500 వరకు వెదురు బాటిళ్లను ఉత్పత్తిచేస్తాం. డిమాండ్‌కు తగ్గట్టు మిషనరీ తెప్పించుకోవడం, తయారు చేసిన సరుకును మార్కెట్‌కు చేర్చడం ఒక సవాల్‌..’ అంటాడు బోరా. బోరా వెదురు బాటిల్‌కు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఈ బాటిళ్ల తయారీదారుల్లో కొంతమంది చైనీయులు ఉన్నారు. వీరు గ్లాస్, స్టీల్‌ క్యాప్స్‌తో ఉన్న బాటిల్స్‌ అమ్ముతున్నారు. అవి పూర్తిగా సేంద్రీయమైనవి కాదు. ఇవన్నింటి దృష్ట్యా బోరా బాటిల్స్‌కు పేటెంట్‌ రాలేదు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందువల్ల వారు ఎదుర్కొంటున్న అవరోధాలను అధిగమిస్తూ ఈ బాంబూ బాటిల్స్‌ ద్వారా ఒక అవగాహన కల్పించవచ్చు.
– ఆరెన్నార్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top