లా అండ్‌ లాలన

karimNagar CI Madhavi Friendly Policing Special Story - Sakshi

పోలీసమ్మ

పోలీసు శాఖ అంటేనే మానవత్వం లేని శాఖగా అభివర్ణిస్తారు చాలా మంది. కానీ ఖాకీ డ్రెస్‌ వెనుక కాఠిన్యమే కాదు.. మానవత్వం, ప్రేమ కూడా ఉంటాయని నిరూపించారు సీఐ మాధవి.అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న వి. మాధవి మూడేళ్లక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్‌ సీఐగా çపని చేసేవారు. ఆ సమయంలో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలు అనారోగ్యంతో మరణించగా వారి పిల్లలు అనాథలయ్యారని పత్రికల్లో చదివి అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్యతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆ చిన్నారులను చూసి చలించిపోయిన మాధవి వారికి దాతల సాయంతో ఆర్థికంగా ఆసరా ఇప్పించారు. అంతేకాదు, పిల్లల్లో ఒకరైన భవానిని దత్తత తీసుకుని చదివించారు. భవాని టెన్త్‌లో 9.7 గ్రేడ్‌ను సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌ల ప్రశంసలు అందుకుంది. భవానికి చదువుపై ఉన్న శ్రద్ధను గమనించిన మాధవి ఆమెను తన పిల్లలు చదివే కాలేజీలోనే చేర్పించి, ఆలనాపాలనా చూడడమే కాకుండా ఒక తల్లిగా మంచిచెడులు చెప్తూ ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాలని ఆ దత్త పుత్రికకు స్ఫూర్తిని ఇచ్చారు.  భవాని కష్టపడి చదివి ఇంటర్‌లో 969 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతోంది. తన ‘పోలీస్‌ అమ్మ’ కోరిక మేరకు సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది భవాని.

మాటే మంత్రం
స్టేషన్‌కి వచ్చే బాధితులతో ఒక పోలీస్‌గా కాకుండా ఒక ఆత్మీయురాలిగా మాట్లాడతారు మాధవి. కుటుంబ కలహాలతో తన దగ్గరకి వచ్చినవారికి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఉపద్రవానికి దారి తీస్తాయో చెబుతూ చక్కటి కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఆమె మాట మంత్రంగా పని చేసి ఆ జంట కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ప్రకృతి ప్రేమికురాలు
ఆమె ఏ స్టేషన్‌లో విధులు నిర్వహించినా అక్కడ పచ్చదనం కనిపించేలా చూస్తుంది. మానకొండూర్‌ పీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోలీస్‌స్టేష¯Œ  పరిసరాలు ఉద్యానవనాన్ని తలపించేలా గార్డెనింగ్‌ చేయించింది. అందుకే జిల్లాలోనే అంతటి పచ్చదనం ఉన్న పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంత మంచి మనసున్న పోలీస్‌ మాధవమ్మ జీవితం కూడా పచ్చగా ఉండాలని కోరుకుందాం.– స్వర్ణ మొలుగూరి, సాక్షి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top