మహిషాసుర‌మ‌ర్దినీదేవీ | Sakshi
Sakshi News home page

మహిషాసుర‌మ‌ర్దినీదేవీ

Published Wed, Oct 17 2018 12:06 AM

Kanaka durgamma devi navaratri special - Sakshi

ఆశ్వయుజ శుద్ధ నవమి, గురువారం, 18–10–2018

అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే‘‘

శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తుంది. అష్టభుజాలతో అవతరించి సింహ వాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది దుర్గాదేవి.ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మవారి సహజ స్వరూపం ఇదే. మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే అరిషడ్వర్గాలను జయించగలుగు తామని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు... సాత్విక భావం ఉదయించి, సర్వ పాపాలూ, దోషాలూ పటాపంచలవుతాయని కూడా చెబుతారు. వీటితో పాటు ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరతాయని తెలుస్తోంది.(ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు  అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తుంది)

రాజరాజేశ్వరీదేవి
ఆశ్వయుజ శుద్ధ దశమి,  గురువారం, 18–10–2018

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణాహ్యుమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నమయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గాదేవి చిరునగవులతో రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. వామ హస్తంలో చెరకు గడను ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపచేసే రూపంతో శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా, శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించటం వలన సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని మనందరికీ అందింప చేసే చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కనిపించే అపూర్వమైన రోజు ఈ రోజు. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఈ రోజు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా సకల శుభాలు, విజయాలు మనకు లభించాలని అర్చిద్దాం.(మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు  రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది)

Advertisement
Advertisement