మహాత్ముని దారిలో మహోన్నత ప్రపంచం

kalava kuntla kavitha special Interview whith sakshi - Sakshi

యువ ప్రపంచం

దేశంలోనే మొట్టమొదటిసారి.. అదీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యు.ఎన్‌. ఉమన్, యు.ఎన్‌. గ్లోబల్‌ కాంపాక్ట్, తెలంగాణ జాగృతి .. ఈ మూడూ కలిసి ‘యూత్‌ లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌’ నిర్వహించబోతున్నాయి. సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

గాంధీమార్గంలో అభివృద్ధి 
మహాత్మాగాంధీ 150వ వ జయంతి సంవత్సరం ఇది. ‘ది గాంధీ పాత్‌ టు సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌’ (గాంధీ మార్గం నుంచి అభివృద్ధి నిరంతరత, వినూత్నతల వైపు) పేరుతో జనవరి 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సదస్సులో పాల్గొనడం కోసం 135 దేశాలలోని గాంధేయ అభివృద్ధి వాదులైన రెండు వేల మందికి పైగా యువతీ యువకులు సదస్సుకు హాజరవుతున్నారు. వివిధ అంశాలలో కృషి చేస్తున్న, ప్రపంచ అభివృద్ధిలో తమ పాత్ర ఉండాలనుకుంటున్న వారే వాళ్లంతా.

ఇప్పుడు మన దేశం ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకెదిగేలా యువతను భాగస్వాములను చేయడం ఈ సదస్సు ఉద్దేశాలలో ఒకటి కాగా, ఇంకొకటి.. అభివృద్ధిని అడ్డుకునే ధోరణులను నిరోధించడమెలాగో యువతకు అవగాహన కల్పించడం. దాని కోసమే ‘యు.ఎన్‌. ఉమన్‌’, ‘యు.ఎన్‌. గ్లోబల్‌ కాంపాక్ట్‌’, ‘తెలంగాణ జాగృతి’ కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. సదస్సు కోసం ఈ మూడు సంస్థల్ని సమన్వయం చేస్తున్న కవిత.. ఆ వివరాలను వెల్లడించారు. 

యువతులకు ప్రాముఖ్యం
యూత్‌ అన్నప్పుడు యువకులు మాత్రమే కాదు, యువతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లే రేపటి మాతృమూర్తులు. మొత్తం తరానికే మార్గదర్శకులు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో అభివృద్ధి నిరంతరత లక్ష్యాల కింద ఎంపిక చేసిన పదిహేడు అంశాల్లో ఎందులో సరిగా పని సక్రమంగా జరగకపోయినా ప్రభావం పడేది ముందుగా మహిళలమీదే. అందుకే యువతీయువకులిద్దరూ సమాన స్థాయిలో పనిచేయాలి.

వీళ్లంతా హాజరయ్యే ఈ సదస్సులో.. ప్రపంచ దేశాల సమస్యలపై జరుగుతున్న అధ్యయనాలు, ప్రపంచం దృష్టి పెట్టిన దుర్బల పరిస్థితులు, సాగుతున్న పరిశోధనల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఇక్కడ అనుభవాలు, పరిష్కారాల మార్పిడి జరుగుతుంది. ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. మన దగ్గర ప్రారంభమై, విజయవంతమైన స్వయం సహాయక బృందాల నమూనాను ఈ రోజు ఎన్నో దేశాలు స్వీకరించి అమల్లో పెట్టాయి. సత్ఫలితాలను ఇస్తున్న ఆలోచనల్ని షేర్‌ చేసుకోడానికి ఇలాంటి సదస్సులు తోడ్పడతాయి.  

సదస్సులో సమాలోచనలు
ఇలాంటి సదస్సులో జరిగే చర్చలు యవతలో చైతన్యం కలిగిస్తాయి. ప్రపంచ దేశాల సమస్యలు; సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, పర్యావరణ పరిస్థితులను పరిచయం చేస్తాయి. అందుకు వీలుగా సదస్సులో సమాంతర సమాలోచనల వేదికల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటే వాళ్లు ఆ అంశంలో పాల్గొనవచ్చు. పర్యావరణం, పరిశ్రమలు, ఆరోగ్యం వంటి రంగాలలో జరుగుతున్న పరిణామాలపై ప్రసంగాలు ఉంటాయి. విదేశాల నుంచి ముప్పై మంది వక్తలు, అయిదు వందల మంది అధికార ప్రతినిధులు కాక మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్‌ నుంచీ సదస్సుకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారున్నారు. 

పదిహేడు అంశాల లక్ష్యం
గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య విలువలతో యువతరం యు.ఎన్‌. నిర్దేశించిన పదిహేడు అంశాల పట్ల శ్రద్ధ చూపిస్తే 2030 కల్లా లక్ష్యాన్ని సాధించడం తేలిక అవుతుంది అనేది సదస్సు ప్రధానాంశం. ఎట్లా సాధించాలి, సాధనలో నా పాత్ర ఎలా ఉండాలి అని యువతకు మర్గాన్ని నిర్దేశించడానికి ఈ సదస్సు ఉపయోగపడ్తుంది. రెండేళ్లకొకసారి ఇలాంటి సదస్సు నిర్వహించాలనే మౌలిక నియమాన్ని కూడా పెట్టుకున్నాం. ఈసారి తెలంగాణ జాగృతి ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. 

మన కోసం మన ‘జాగృతి’ 
సదస్సుతో నిమిత్తం లేకుండా.. మొదటి నుంచీ మేం చేస్తుందంతా యువత కోసమే. నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాం. అరవై శాతం పైగా అమ్మాయిలు, నలభై శాతం వరకు అబ్బాయిలకు ఉద్యోగావకాశాల లభ్యతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది యువతకు శిక్షణ ఇప్పించాం. అందులో దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల మంది యువతకు వరకు ఉద్యోగాలిప్పించాం. వీళ్లలో చాలామంది అమ్మాయిలే.

తెలంగాణ అంతటా పదిహేను జాగృతి శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజూ శిక్షణా తరగతులు జరుగుతూనే ఉంటాయి. విధానపరమైన నిర్ణయాలను మనం ప్రభావితం చేయాలంటే ఒక రాజకీయపరమైన అధికారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మన రాష్ట్రం కోసం జరిగే అభివృద్ధి విధానాలను నేరుగా రూపొందించగలం. ఆ పాత్రను పోషించగలం. ఒక ఎంపీగా నాది అదొక పాత్ర. రెండోది.. ప్రజాజీవితంలో ప్రత్యక్షంగా యువతపై దృష్టి సారించి వాళ్లకోసం నిరంతరంగా పని చేయాలి. జాగృతి వ్యవస్థాపకురాలిగా అది నా ఇంకో పాత్ర అది. 

మరో బాధ్యత ‘అక్కా’ ప్రాజెక్ట్‌
ప్రస్తుతం మన దగ్గర యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య  రక్త హీనత. దాన్ని తీసుకున్నాం. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే ఆడపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాం. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే ఇరవై ఐదువేల పై చిలుకు యువతులకు ఆరోగ్య పరీక్షలు జరిపించాం. దురదృష్టవశాత్తు డెబ్బై శాతం కంటే ఎక్కువ మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. వీళ్లు ఆరోగ్యవంతులయ్యే వరకు కనిపెట్టుకుని ఉండడం మా లక్ష్యం. అంటే ఆరోగ్యవంతమైన తల్లి అయ్యేదాకా వాళ్ల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతాం. ఈ డెబ్బయ్‌ శాతం మందికి సంబంధించి వివరాలు సేకరించి ప్రతి యేడూ పరీక్షిస్తుంటాం. ‘అక్కా’ అనే పేరుతో మొదలైన ఏడేళ్ల ప్రాజెక్ట్‌ ఇది.

‘అక్కా’ అనేది ఒక కాన్సెప్ట్‌. రక్తహీనత ఉన్న ప్రతి పది మంది అమ్మాయిలకూ ఒక ఆరోగ్యవంతురాలైన అమ్మాయిని ఎంపిక  చేసి లీడర్‌గా ఉంచుతాం. ఆ అమ్మాయి క్రమం తప్పకుండా ఆ పదిమందిని పర్యవేక్షిస్తుంటుంది. వాళ్ల ఆహార అలవాట్లను పరిశీలిస్తూ, అవసరమైన సలహాలిస్తూ ఆరోగ్యవంతులయ్యేలా సహకరిస్తుంటుంది. ఒక ఫ్రెండ్‌లా, ఆత్మబంధువులా వ్యవహరిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్‌ను ‘యు.ఎన్‌. ఉమన్‌’ సహకారంతో చేస్తున్నాం. ఇలా ఏ సమస్యను చేపట్టినా అర్థం పరమార్థం ఉంటుంది. అయితే యువతతోనే ప్రధానంగానే పనిచేస్తున్నాం’’ అని వివరించారు కవిత.

జాగృతి ఫెలోషిప్‌ అవార్డ్స్‌
ఈ ఏడాది నుంచి ‘జాగృతి ఫెలోషిప్‌ అవార్డు’ ఇవ్వబోతున్నాం. ఫెలోషిప్‌ ప్రొగ్రాం తీసుకున్న వారిలో తొమ్మిది నుంచి పదిమందిని ఎన్నుకుని వారికి జాగృతి చేపట్టిన పద్దెనిమిది ప్రాజెక్టులను వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. వారిలో ఈసారి తొమ్మిదిమందిని సెలెక్ట్‌ చేశాం. వాళ్లు గత పది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి అన్ని ప్రాజెక్టులకు తిరుగుతున్నారు. వాళ్లకు మళ్లీ శిక్షణ ఇచ్చి, ఫెలోషిప్‌ అవార్డ్‌కు ఎంపిక చేస్తున్నాం. అలా నెమ్మదిగా జాతీయ, అంతర్జాతీయ యవనికలోకి ప్రవేశిస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు జాగృతి ఫెలోషిప్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త గుర్తింపు కావాలనుకునే, అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఆసక్తి ఉండే యువతీయువకులు ఈ సదస్సుకి హాజరుకావచ్చు. 
– కవిత

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top