జింజుబా గడ్డి ఆవులకు భలే ఇష్టం!

Junjuba grass cows want to eat! - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో పాల కోసమో, బ్రీడ్‌ అభివృద్ధి కోసమో, ఆసక్తి కొద్దీనో ఆవులను పెంచేవారు కొందరు ఈ మధ్య జుంజుబా గడ్డి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ రకం గడ్డి పోచలు సన్నగా మెత్తగా ఉండడం, 14.5% ప్రొటీన్‌తో కూడి రుచిగా ఉండడం వల్ల ఆవులు ఈ గడ్డిని ఇష్టంగా తినడం ఒక కారణమైతే.. దీన్ని పెంచడానికి శ్రమ గానీ, ఖర్చుగానీ పెద్దగా లేకపోవడం మరొకటని చెబుతున్నారు. ఒకసారి నాటుకుంటే.. మొదట 45 రోజులకు.. తర్వాత ప్రతి 35 రోజులకోసారి గడ్డి కోతకు వస్తుంది.

జుంజుబా గడ్డిని గుజరాత్‌ నుంచి తెచ్చి కొందరు దేశీ ఆవుల పోషకులు, పాడి రైతులు సాగు చేస్తున్నారు. వీరిలో ‘సేవ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్‌ ఒకరు. గత కొన్ని నెలలుగా జుంజుబా గడ్డిని పెంచి సత్ఫలితాలను గమనించిన ఆయన ఇతర రైతులకు ఈ గడ్డి విత్తనాన్ని ఆయన అందిస్తున్నారు. విజయరామ్‌ అందించిన సమాచారం ప్రకారం..  గుప్పెడు జుంజుబా గడ్డి పోచలు(సుమారు 100 పోచలు) ప్రతి రైతుకూ ఇస్తారు.

దీన్ని ఆరు అంగుళాల పొడవున కత్తిరించి, ఒకటి లేదా రెండు గణుపులు మట్టిలోపలికి వెళ్లేలా.. ఎటు చూపినా అడుగున్నర దూరంలో.. నాటుకోవాలి. రెండు సెంట్లకు సరిపోతుంది. మొలక వచ్చిన 20 రోజులకోసారి, తర్వాత 15 రోజులకోసారి నీటితో కలిపి జీవామృతాన్ని అందిస్తే చాలు. అవకాశం ఉన్న రైతులు రెండు వారాలకోసారి జీవామృతాన్ని పారగట్టడం లేదా డ్రిప్‌ ద్వారా అందిస్తే మంచిది.35 రోజులకోసారి.. ఏళ్ల తరబడి గడ్డి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఆవుకు రోజుకు ఎండుగడ్డి, దాణాతోపాటు 15 కిలోల పచ్చిగడ్డి వేస్తున్నారు.

ఆ లెక్కన చూస్తే 30 ఆవులకు ఏడాది పొడవునా పచ్చి మేతను అందించడానికి ఎకరం పొలం అవసరమవుతుంది. ఎకరాన్ని చిన్న మడులుగా విభజించుకొని నాటుకోవాలి. ఒక మడిలో గడ్డి కోత పూర్తయ్యాక ఘనజీవామృతం వేయడం అవసరమని విజయరామ్‌ తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో జూన్‌ నాటికి ఈ గడ్డి విత్తనం రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ గడ్డి పొలంలో నడిచే వారి కాళ్లకు కోసుకుపోవడం ఉండదని, గడ్డిపోచలు మెత్తగా ఉండటమే కారణమన్నారు.కృష్ణా జిల్లా గూడూరు మండలం (తరకటూరు చెక్‌పోస్ట్‌ దగ్గర) పినగూడూరు లంక గ్రామంలోని తమ సౌభాగ్య గోసదన్‌లో ఈ గడ్డి విత్తనం దేశీ ఆవులను పెంచే రైతులకు పంపీణీ చేయనున్నారు.
వివరాలకు.. తిరుపతి– 90002 69724, ‘సేవ్‌’ ప్రతినిధి సురేంద్ర: 99491 90769

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top