
ట్రంప్ వంటి మహానుభావులు పూర్వాచారాలకు కొత్త నిర్వచనాలను కల్పించుకోవలసిన పరిస్థితులను తెచ్చి పెడుతుంటారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’ అంటారు. వైట్ హౌస్‌లో ఆమెకు ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ ఉంటుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు భార్యగా ఉన్న మెలనియా మూడో సతీమణి. మరి ఈవిడ ఫస్ట్ లేడీ ఎలా అవుతారు? ఈ సందేహం రావలసిన వాళ్లకే వచ్చింది. ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంక తన తల్లికి దక్కవలసిన ‘ఫస్ట్ లేడీ’ టైటిల్ ను మారుతల్లి మెలనియాకు చెందకుండా ఉండటం కోసం ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ పేరును ‘ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీస్’ గా మార్పించేందుకు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని మెలనియా విజయవంతంగా అడ్డుకున్నారట! ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పేరుతో మెలనియా జీవిత చరిత్రను రాసిన వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ మేరీ జోర్డాన్ ఈ సంగతిని పుస్తకంలో వెల్లడించారు. ట్రంప్‌కి ‘సింగిల్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ అడ్వయిజర్’ గా కూడా మెలనియాను జోర్డాన్ అభివర్ణించారు. అయితే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ పుస్తకంలో అభివర్ణనలు, అవాస్తవాలు తప్ప వేరే ఇంకేమీ లేవని ఇవాంకను సమర్ధించేవారు అంటున్నారు.