కీటక నాశినుల తీరు మారుతోంది! | Insecticidal trends are changing! | Sakshi
Sakshi News home page

కీటక నాశినుల తీరు మారుతోంది!

Nov 28 2017 2:02 AM | Updated on Nov 28 2017 2:02 AM

Insecticidal trends are changing! - Sakshi

కీటక నాశినుల తీరు మారుతోంది!
క్రిమి, కీటక నాశినులతో ఎన్ని తిప్పలో మనకు తెలియంది కాదు... మొక్కలకు హాని కలిగించే వాటితో పాటు మేలు చేసే వాటినీ మట్టుబెట్టేస్తాయి ఇవి. కానీ... మిషిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. కావలసిన కీటకాలను మాత్రమే చంపేసి... మిత్రపురుగులు తమ పనిని కొనసాగించగలిగేలా సరికొత్త రసాయనాల తయారీకి వీరు మార్గం సుగమం చేశారు. పైరిథ్రాయిడ్‌ రసాయనాన్ని తయారుచేసే పద్ధతిలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా దుష్ప్రభావాలను తొలగించవచ్చునని వీరు గుర్తించారు.

కీటకాల నాడులు, కండర కణాలపై ప్రభావం చూపడం ద్వారా పైరిథ్రాయిడ్లు పనిచేస్తాయన్నది తెలిసిందే. తేనెటీగలతో పాటు రకరకాల ఇతర కీటకాల్లో అత్యధికం వీటి ప్రభావానికి లోనవుతాయి. అయితే టావ్‌– ఫ్లూవాలినేట్‌ అనే పైరిథ్రాయిడ్‌ మాత్రం తేనెటీగలపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఇదేవిధంగా కొన్ని ఇతర పైరిథ్రాయిడ్లు కొన్ని రకాల కీటకాలను చంపేయలేవని తెలిసింది. ఈ అంశంపై చేసిన పరిశోధనల ద్వారా నిర్దిష్ట అమినో యాసిడ్‌ అవశేషాల కారణంగా ఈ కీటకాలకు సహజ నిరోధకత ఏర్పడుతోందని స్పష్టమైంది. ఈ పరిశోధనల ఆధారంగా మనం కోరుకున్న శత్రు పురుగులను మాత్రమే చంపేయగల మందులను తయారు చేయడం వీలవుతుందని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త కీ డాంగ్‌ తెలిపారు. పరిశోధన వివరాలు అమెరికాలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమయ్యాయి.

బ్యాక్టీరియాలతో మందుల ఫ్యాక్టరీలు..
యాంటీ బయాటిక్‌ నిరోధకత గురించి మీరు వినే ఉంటారు. చికిత్స కోసం మనం వాడే మందులకు బ్యాక్టీరియా తట్టుకోగలుగుతోందని, దీనివల్ల భవిష్యత్తులో వ్యాధులు విజృంభిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే యూరోపియన్‌ యూనియన్‌ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా నిరోధకతనే ఆయుధంగా మార్చుకుని కొత్తకొత్త మందులు తయారు చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని సిద్ధం చేశారు. దీని పేరు ఎవల్యూషన్‌ మెషీన్‌.

రకరకాల బ్యాక్టీరియాను నిర్దిష్ట పద్ధతుల్లో ఎదిగేలా, పరిణమించేలా చేయడం ద్వారా వాటితో వినూత్నమైన మందులు తయారు చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. భలే ఐడియా కదూ..! యూరోపియన్‌ యూనియన్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో బోలెడన్ని బయో రియాక్టర్లను వాడతారు. వాటిల్లో రకరకాల బ్యాక్టీరియాతో పాటు వీటిపై దాడి చేసి డీఎన్‌ఏలో మార్పులు చేయగల వైరస్‌ను కూడా చేరుస్తారు. ఒకపక్క వైరస్‌ దాడి చేస్తూంటే.. ఇంకోవైపు బ్యాక్టీరియా వాటిని తట్టుకుని బతికేందుకు కొత్త దారులు వెతుకుతూంటాయన్నమాట.

ఈ క్రమంలో అవి రకరకాల రసాయన కణాలను విడుదల చేస్తూంటాయి కాబట్టి, వాటితో కొత్త మందులు తయారు చేయవచ్చునన్నది ఆలోచన. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం నడిచేందుకు శాస్త్రవేత్తలు వైరస్‌లను ప్రోగ్రామ్‌ చేశారు. బయో రియాక్టర్‌లో చేసే రసాయనిక మార్పులను బట్టి ఈ వైరస్‌లు ఒక్కోరకమైన బ్యాక్టీరియాకు అతుక్కుంటాయి. ఈ పని సమర్థంగా చేయగల వైరస్‌లను గుర్తించి వాటిని ఎక్కువగా పెరిగేలా చేస్తారు. ఈ క్రమంలో బ్యాక్టీరియాలను చంపేందుకు అవసరమైన వినూత్న మందులు కూడా లభిస్తాయని అంచనా.

మళ్లీ దడ పుట్టిస్తున్న మలేరియా
ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలంలో మలేరియా మహమ్మారికి చాలామంది పిట్టల్లా రాలిపోయేవారు. దోమకాటుతో సోకే ఈ వ్యాధికి ప్రపంచమంతా వణికిపోయేది. పంతోమ్మిదో శతాబ్దిలో క్వినైన్‌ కనుగొనడంతో మొదటిసారిగా మలేరియాకు ఒక విరుగుడు అందుబాటులోకి వచ్చింది. మలేరియాను నయం చేయడానికి ఆ తర్వాత మరిన్ని ఆధునిక ఔషధాలు కూడా అందుబాటులోకి రావడంతో మలేరియా వల్ల సంభవించే మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇటీవల మలేరియా మళ్లీ దడ పుట్టిస్తోంది. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్నజీవి ‘ప్లాస్మోడియమ్‌ ఫాల్సిపారమ్‌’ మందులకు లొంగని మొండిఘటంగా మారింది.

ఆగ్నేయాసియాలో కొందరు దీని బారినపడ్డారు. ఆ రోగులపై మందులు పనిచేయకపోవడంతో వైద్యనిపుణులు రకరకాల పరీక్షలు జరిపి, మలేరియా కలిగించే పరాన్నజీవి మందులకు లొంగని మొండిఘటంగా మారిందని నిర్ధారించారు. ‘ది లాన్సెట్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌’ జర్నల్‌ అక్టోబర్‌ సంచికలో దీని గురించి విపులంగా వివరించారు. ఇది ఇతర ప్రాంతాలకు పాకితే మలేరియా మళ్లీ మహమ్మారిలా విజృంభించే ప్రమాదం ఉందని, అందువల్ల ఆగ్నేయాసియాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని పలువురు అంతర్జాతీయ వైద్య నిపుణులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తున్నారు.

వేపుళ్లతోనూ వానలు కురుస్తాయట!
ఇకపై వానల కోసం మేఘమథనాల వంటి భారీ కార్యక్రమాలను తలపెట్టే బదులు ఆరుబయట వేపుడు వంటకాల జాతరలు మొదలుపెడితే బాగుంటుందేమో! ఎందుకంటారా? వాన కురుస్తున్నప్పుడు వేడి వేడిగా తినడానికే కాదు, వానలు కురవడానికి వేపుళ్లు కూడా దోహదపడతాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది.

బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సంగతిని ఇటీవలే కనుగొన్నారు. వేపుళ్లు చేసినప్పుడు గాలిలో కలిసే కొవ్వు కణాలు వానలు కురిపించగల మబ్బులు ఏర్పడేందుకు దోహదపడతాయని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ క్రిస్టియన్‌ ఫ్రాంగ్‌ చెబుతున్నారు. వేపుళ్ల వల్ల గాలిలోకి చేరిన కొవ్వు కణాలు మబ్బులను ఆవరించుకుని ఉంటాయని, మబ్బులు నీటిచుక్కలను ఇముడ్చుకునేందుకు ఇవి సహకరిస్తాయని వివరిస్తున్నారు.

పావు కిలో మించకూడదు
డ్రోన్‌లను ఉపయోగించేవారు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కొత్త చట్టం తీసుకువచ్చారు. 250 గ్రా. కంటె ఎక్కువ బరువు ఉన్న డ్రోన్‌లను విమానాశ్రయాల దగ్గర కాని, 400 మీ. ఎత్తుకు మించి గానీ ఎగరనివ్వకూడదని చట్టం చేసింది. చట్ట వ్యతిరేక కలాపాలకు డ్రోన్‌లను ఉపయోగించేవారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించే హక్కును పోలీసులకు కల్పించింది. డ్రోన్‌ల కారణంగా 2017లో ఇప్పటివరకు 81,  2015లో 29, 2016లో 71  దుర్ఘటనలు జరిగాయి.

ఈ ఏడాది జూలైలో 130 మందితో ప్రయాణిస్తున్న ఒక విమానం లండన్‌ గత్విక్‌ విమానాశ్రయంలో లాండ్‌ అవుతుండగా, పెద్ద ప్రమాదమే తప్పింది. పర్యవసానమే ఈ కొత్త చట్టం. ఈ బిల్లు ప్రకారం 2018 ఏప్రిల్‌ నెలలోగా 250 గ్రా. కంటె ఎక్కువ బరువు ఉన్న డ్రోన్‌లను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. డ్రోన్‌ల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అసిస్టెంట్‌ చీఫ్‌ కానిస్టేబుల్‌ ఆఫ్‌ ద నేషనల్‌ పోలీస్‌ చీఫ్స్‌ కౌన్సెల్‌ సెరెనా కెన్నడీ అంటున్నారు. డ్రోన్‌ల ద్వారా మాదక ద్రవ్యాలు, మొబైల్‌ ఫోన్లను సంఘవిద్రోహక శక్తులకు, నేరస్థులకు అందచేశారని, ఇటువంటి సంఘటనలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

అందుకే డ్రోన్‌లు ఎక్కువ ఎత్తు పెరగకుండా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నాం అని యూరోపియన్‌ పబ్లిక్‌ పాలసీ అధికారి క్రిస్టియన్‌ స్ట్రూ అంటున్నారు. డ్రోన్‌లను ఎలా వాడాలనే నియమాలను ఎవ్వరూ సరిగా చదవట్లేదు, ఒకవేళ అవి సరిగా పనిచేయకపోతే ఏం చేయాలో కూడా తెలుసుకోవట్లేదు. కనీస మార్గదర్శకాలు చదవకుండా, వీటిని వినియోగించడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement