చెరువు మట్టి.. భూమికి బలం

Agricultural Scientists Say Nutrients In Pond Soil For High Yields - Sakshi

పూడిక మట్టిలో పోషకాలు 

అధిక దిగుబడులు సాధ్యం

ఎల్‌.ఎన్‌.పేట: పంట దిగుబడి కోసం రైతులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుంటారు. దీని వలన భూసారం క్షీణిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూసారం పెంచాలంటే కొత్తమట్టిని వేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. చెరువుల్లోని పూడిక మట్టి వేస్తే పొలం సారవంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఈ మట్టి వేయడం ద్వారా భూసారంతో పాటు పోషక విలువలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగులు నశించడం వలన రైతుకు నష్టం ఉంటుందంటున్నారు.

పూడిక మట్టిలో పోషకాలు 
చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరుతాయి. వేసవలి సమయంలో చెరువులు అడుగంటుతాయి. ఈ సమయంలో చెరువు పూడిక మట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియకార్భన్‌ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి పొరల్లో తేమను ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసే గుణం ఈ మట్టికి ఉంది. కిలో పూడిక మట్టిలో నత్రజని 720 మి.గ్రా, భాస్వరం 320 మి.గ్రా, పోటాషియం 810 మి.గ్రా, సేంద్రియకార్భనం 308 మి.గ్రాలతో పాటు మైక్రోబియల్‌ బయోమాన్‌ కార్బన్‌లు ఉంటాయి.

ఎరువుల ఖర్చు తక్కువ  
ఎకరా పొలంలో వరి పండించాలంటే తక్కువగా అనుకున్నా ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల యూరియా, బస్తా పోటాష్, బస్తా జింక్‌ తప్పనిసరి అవుతుంది. వీటితో పాటు పంటను ఆశించే తెగుళ్లను నివారించేందుకు పురుగు మందుల పిచికారీ తప్పటం లేదు. ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేసుకోవటం వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గటంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పురుగుల మందుల్లేని పంటను సాధించవచ్చు.

చెరువు మట్టి వేసే వాళ్లం 
గతంలో చెరువుల్లో లభ్యమయ్యే పూడిక మట్టిని పొలాలకు వేసేవాళ్లం. దీంతో భూసారం పెరిగి పంటదిగుబడి బాగా వచ్చేది. వేసవిలో చెరువు మట్టిని నాటుబళ్ల పెరిగి పొలంలో వేసేవాళ్లం. వర్షాల తరువాత పొలంలో వేసిన మట్టి నేలలో కలిసేలా దుక్కి దున్నేవాళ్లం. ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగేది. ఇప్పుడు రైతులెవ్వరూ చెరువు మట్టి వేయటం లేదు. ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగిపోతుంది. భూసారం తగ్గిపోతుంది.
లావేటి నర్సింహులు, రైతు, కృష్ణాపురం

భూసారం పెరుగుతుంది 
చెరువు మట్టి వేసుకోవటం వలన భూమి సారవంతంగా మారుతుంది. చౌడు భూముల్లో కూడా పచ్చని పంటలు పండించవచ్చు. చెరువు మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వలన పంటకు నీటినిల్వలు బాగా ఉంటాయి. సేంద్రియ శాతం ఎక్కువగా ఉండటంతో ఎరువులా ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం చెరువు మట్టి వేయటం వలన మూడేళ్ల వరకు భూమి సారవంతంగా ఉంటుంది. పంటకు మేలు చేస్తుంది.
పైడి లతశ్రీ, ఏఓ, ఎల్‌.ఎన్‌.పేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top