ఓపెన్‌ టాక్‌ 

Indian Army Chief Sparks Outrage, Says Women Are Not Fit For Combat Roles In The Army - Sakshi

అసందర్భం

‘‘యుద్ధం చేస్తూ మహిళ చనిపోతే, గుడ్డల్లో చుట్టి తెచ్చిన ఆమె మృతదేహాన్ని చూసేందుకు మన దేశం సిద్ధంగా ఉందా? ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌లోకి మహిళల్ని తీసుకోవడం నాకు ఇష్టమే. అలాగని ఆర్మీకి ఇష్టం లేదని కాదు. కొన్ని చెయ్యలేం’’.. అన్నది మన ఆర్మీ చీఫ్‌ మనసులోని మాట. నిజమే, చెయ్యలేకపోవచ్చు. కానీ చెయ్యగలిగినప్పుడే ‘చెయ్యగలం’ అని చెప్పి ఉండాల్సింది.

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ భారత సైన్యంలోకి వచ్చి ఈ డిసెంబర్‌ 16కి సరిగ్గా నలభై ఏళ్లు. ఇప్పుడు ఆయన జనరల్‌. ఆర్మీలో చేరినప్పుడు సోల్జర్‌. ఆర్మీ చీఫ్‌ల పదవీ కాలం మూడేళ్లు. మూడేళ్లకు ముందే వాళ్లకు 62 ఏళ్ల వయసు నిండితే కనుక ముందే పదవీ విరమణ చెయ్యవలసి ఉంటుంది. 2016 డిసెంబర్‌ 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు రావత్‌. ఇంకో ఏడాదికి గానీ ఆయన పదవీకాలం పూర్తవదు. ఆ తర్వాత కూడా ఆర్మీలో సేవలు అందించడానికి వయసు రీత్యా ఆయనకు ఇంకో రెండేళ్లు అవకాశం ఉంటుంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసుకుని మరీ రావత్‌ని తెచ్చుకున్నారు. తన పదవీ కాలం నిండే వరకు ఆర్మీ చీఫ్‌.. చైర్‌లోంచి లేవకూడదని! రావత్‌ ఆర్మీ చీఫ్‌ అవడానికి రెండున్నర నెలల ముందే నియంత్రణ రేఖ దగ్గర ‘సర్జికల్‌ స్ట్రయిక్స్‌’ జరిగాయి. ఆ సమయంలో రావత్‌ వైస్‌ చీఫ్‌గా ఉన్నారు. భారత్‌ మీద పాక్‌ ‘ప్రాక్సీ వార్‌’ జరుపుతున్న ప్రస్తుత కీలక తరుణంలో రావత్‌ కూడా మోదీ అంతటి వారే అనుకోవాలి. అంత మాత్రాన రావత్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి లేదు. మోదీలా ‘మన్‌ కీ బాత్‌’ని చెప్పడానికీ లేదు. ఏదైనా లోపలే ఉంచుకోవాలి. లేదంటే రిటైర్‌ అయ్యేంత వరకు ఆగి, అప్పుడు బయట పెట్టుకోవాలి. నలభై ఏళ్ల సర్వీసులో ఏడు యుద్ధాలను చూసిన రావత్‌కు ఈ సంగతి తెలియకుండా ఉంటుందా? అయినప్పటికీ ఆయన తన ఉద్దేశాలను దాచుకోలేకపోయారు!  ఆర్మీలో ‘ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌’లోకి మహిళల్ని తీసుకోలేమని చెబుతూ, అందుకు ఆయన చూపిన కారణాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ‘ఆయన ఆ పదవికి తగనివారు’ అని ట్రోలింగ్‌ మొదలైంది. ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌ అంటే.. ప్రత్యక్ష యుద్ధక్షేత్రం. శత్రువు యుద్ధట్యాంకు పేలిస్తే ముందుగా గాలిలోకి ఎగిరిపడే దేహాలు ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌లో ఉన్నవాళ్లవే. బందీగా శత్రువు చేతికి చిక్కే ప్రమాదం ఉండేది ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌లో ఉన్నవాళ్లకే. అందుకే మహిళల్ని కంబాట్‌లోకి తీసుకోలేమని రావత్‌ చెప్పారు. చెప్పి, అక్కడితో ఆగి ఉంటే కొంత నయంగా ఉండేది. తన మనసులోని భయాలన్నీ బయట పెట్టేసుకున్నారు. 

‘‘ప్రాక్సీ – వార్‌ (దొంగ దాడి) నడుస్తున్నప్పుడు మహిళల్ని యుద్ధవిధుల్లోకి తీసుకోవడం కరెక్ట్‌ కాదు. అయినా మహిళల్ని తీసుకోకుండా ఏమీ లేము.  మందుపాతర్లని ఏర్పాటు చేయడానికి, ఏరిపారేయడానికి మన దగ్గర మహిళా ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు. ప్రతిభ, నైపుణ్యం అవసరమైన మిగతా ముఖ్య విభాగాల్లోనూ మహిళలు ఉన్నారు. ఒక్క యుద్ధవిధుల్లోకే వారిని తీసుకోవడం లేదు. తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఫ్రంట్‌లైన్‌లో మహిళా అధికారిని కమాండర్‌గా పెడితే ఆమె కింద ఉన్న మగ సోల్జర్‌లు ఆమె మాట వినకపోవచ్చు. ఎందుకంటే వారంతా గ్రామాల నుంచి వచ్చినవారు. ఆడమనిషి చెబితే చెయ్యడం ఏంటనే భావన వారిలో ఉంటుంది. మరో సమస్య.. మహిళలు బట్టలు మార్చుకునేటప్పుడు వస్తుంది. మగవాళ్లు చూస్తున్నారని కంప్లైంట్‌ చేస్తారు వాళ్లు. విశ్రమ, విరామాలలోనూ మహిళలకు వేరుగా గుడారం వెయ్యాలి. గుడారం చుట్టూ గుడ్డ కప్పాలి. ఇక అత్యవసర సమయాల్లో ఆరు నెలలు మెటర్నిటీ లీవు ఇవ్వడానికి ఉండదు. ఇవ్వనందుకు రాద్ధాంతం అవుతుంది. ఇవన్నీ కాదు.. యుద్ధంలో మహిళా కమాండర్‌ చనిపోతే, గుడ్డల్లో చుట్టి తెచ్చిన ఆమె భౌతికాయాన్ని చూసి ఈ దేశం తట్టుకోగలదా? ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌లోకి మహిళల్ని తీసుకోవడం నాకు ఇష్టమే. అలాగని ఆర్మీకి ఇష్టం లేదని కాదు. కొన్ని చెయ్యలేం’’ అన్నారు రావత్‌. ఇదంతా ఏకబిగిన చెప్పుకుంటూ రాలేదు ఆయన. సి.ఎన్‌.ఎన్‌. న్యూస్‌ 18 చానల్‌ సీనియర్‌ ఎడిటర్‌ శ్రేయా దౌండియాల్‌తో సంభాషణలో ఆమె ప్రశ్నలకు సమాధానంగా మాత్రమే చెప్పారు. ఆయనేం ఆమెను పిలిచి ఇవన్నీ మాట్లాడలేదు. ఆమె వచ్చి అడిగితే మనసు విప్పారు. అదీ తన ఆఫీస్‌లో కాదు. పిచ్చాపాటీగా, పచ్చిక బయళ్లలో! పూర్తి ఇంటర్వ్యూలో ఇది కొంతభాగం మాత్రమే. మిగతా విషయాలు గాల్లో కొట్టుకుపోయాయి. కంబాట్‌లోకి ఆడవాళ్లను తీసుకోవడంపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం వాయుగుండం అయ్యాయి. అందులోనూ.. ‘బట్టలు మార్చుకోడానికి ఇబ్బంది’ అవుతుంది అనే పాయింట్‌ చుట్టూ సిటిజన్స్‌ ప్రదక్షిణ చేస్తున్నారు. ‘దేశం పరువు తీసేశాడు రావత్‌’ అని విరుచుకు పడుతున్నారు. 

కొన్నాళ్ల క్రితం కూడా రావత్‌ పుణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, ‘మహిళల్ని యుద్ధక్షేత్రంలోకి తీసుకోడానికి ఇప్పటికైతే ఆర్మీ సిద్ధంగా లేదు. పాశ్చాత్య దేశాలతో మనం పోల్చుకోకూడదు. వాళ్లు ఓపెన్‌ ఉంటారు’ అన్నారు.  కానీ అవకాశం వస్తే ఫ్రంట్‌లైన్‌ కంబాట్‌లోకి వెళ్లేందుకు యువతులు సిద్ధంగా ఉన్నారన్నది నిజం. అంటే వాళ్లు ఓపెన్‌ గానే ఉన్నారు. ఆర్మీనే ఓపెన్‌ అవ్వాలి. ఒకవేళ ఆర్మీ ఓపెన్‌గా లేకపోయినా, పనిగట్టుకుని ఓపెన్‌గా లేమన్న విషయాన్ని చెప్పాల్సిన సమయం, సందర్భం ఏముంటుందని?! ఓపెన్‌ అయినప్పుడే ఓపెన్‌ అయ్యాం అని చెబితే సరిపోదా?దేశ రక్షణదళంలోని అత్యున్నత స్థానాలలో ఉన్నవారు దేశ రహస్యాలను దాచినట్లే వ్యక్తిగత అభిప్రాయాలను దాచుకోలేకపోతే జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్లే. అది ప్రమాదం. మీడియా ప్రతినిధులు కూడా జాతిని ఉద్దేశించి ప్రసారం చేస్తున్నామేమో గమనించుకోవాలి. రావత్‌ మాట్లాడితే మాట్లాడారు, ఆ రెండు ముక్కల్ని మీడియా బహిర్గతం చేయకపోతే దేశ ప్రజలకు వచ్చే నష్టం ఏముంటుంది? చేస్తే వచ్చిన లాభం ఏముంది?       
- మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top