సిందూరపు కొండల్లో చదువుల మందారం! | If you read the girls you will get to the top tip | Sakshi
Sakshi News home page

సిందూరపు కొండల్లో చదువుల మందారం!

Feb 7 2019 12:52 AM | Updated on Feb 7 2019 11:33 AM

If you read the girls you will get to the top tip - Sakshi

కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఒకప్పటి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు ఐదుసార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన అసామాన్య ప్రజానేత గుమ్మడి నర్సయ్య తనయ గుమ్మడి అనురాధ. కటిక పేదరికం, ఏ మాత్రం సహకరించని ఆర్థిక ఇబ్బందుల వల్ల లక్ష్యాలు మసకబారినా తన ధ్యేయం నుంచి మాత్రం ఆమె పక్కకు జరగలేదు. తనదైన పంథాలో సమాజం రుణం తీర్చుకోవాలనే ఆమె సంకల్పమూ గురి తప్పలేదు. తీవ్ర ప్రతికూలతల మధ్యే కొలిమిలో కాలిన ఇనుములా ఉక్కు సంకల్పంతో విద్యాసుగంధాలు వెదజల్లే కుసుమమై తొలి కోయ న్యాయ విద్య ఆచార్యురాలిగా తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర లిఖించారు. తండ్రి పేరు ప్రతిష్టలకు దీటైన వారసురాలిగా ఇల్లెందులో గుర్తింపు పొందారు.

గిరిజన హక్కులపై పీహెచ్‌డీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం టేకులగూడెం గ్రామంలో అనురాధ ఒకటీ రెండు తరగతులు చదివారు. మూడో తరగతి నుండి ఇంటర్‌ వరకు సుదిమళ్లలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో  చేశారు. ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ (హెచ్‌ఇపీ గ్రూప్‌) పూర్తి చేశారు. తర్వాత ఓయూ క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ పర్యవేక్షణలో ‘ట్రైబల్‌ ప్రాపర్టీ  రైట్స్‌ ఇన్‌ తెలంగాణా స్పెషల్‌ రెఫరెన్స్‌ టు ఖమ్మం’ అన్న అంశంపై 2017 మార్చిలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎస్టీ బ్యాక్‌లాగ్‌ అధ్యాపక ఉద్యోగ నియామకాల్లో ఆమెకు న్యాయశాఖలో ఉస్మానియా కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అదే ఏడాది జూన్‌లో ఉద్యోగం వచ్చింది. ఉస్మానియా చరిత్రలో ఒక గిరిజనమహిళ, అదీ కోయ తెగకు చెందిన మహిళ న్యాయశాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావడం ఇదే ప్రథమం. 

విద్యా సమస్యలపై పోరాటం
అనురాధకు అన్న, అక్క ఉన్నారు. అన్న గ్రామంలోనే వ్యవసాయం చేస్తారు. అక్క ఊరికి దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి గుమ్మడి నర్సయ్య తన చిన్నతనం నుండే ఎన్నో ఒడిదుడుకులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. (సీపీఐ ఎమ్‌ఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ప్రజల్లో మమేకమై పనిచేశారు. అందువల్లనే ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆయన ఇంట్లో ఉండటం చాలా అరుదు కావడం వల్ల అనురాధ అమ్మ అమ్మక్క  కుటుంబ భారాన్ని మోశారు. వ్యవసాయం చేస్తూ, అన్నీ తానై పిల్లలను చదివించారు. ప్రయోజకులను చేశారు. అనురాధ చదువుకునే రోజుల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి అనుబంధంగా ఉన్న పీడీఎస్‌యూ విద్యార్థి సంఘంలో ఉన్నారు. విద్యా అంశాలపై పోరాడి, డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయాలని చేసిన పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణా పోరాట సమయంలోనే నిరాహార దీక్షలు చేపట్టారు. 

నాన్న చెప్పిన మాట
‘‘మా నాన్న ఏనాడూ మమ్మల్ని ఎమ్మెల్యే బిడ్డలమన్న భావంతో పెంచలేదు. సాధారణ మధ్యతరగతి వాళ్ల మాదిరిగానే పెంచారు. నేను చదివే స్కూల్‌లో కూడా నన్ను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చూడలేదు. అందరి  పిల్లలతోపాటే చూసేవారు.  ‘పోరాడుతూ చదవాలి, చదువుతూ పోరాడాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాటలు నిజంగా నాకు బలాన్ని ఇచ్చాయి.’’ అని చెప్పారు అనురాధ. ఈ పోరాట నేపథ్యం కారణంగానే కెరీర్‌లో ఆమెకు అవరోధాలు అడ్డంకులు ఎదురయ్యాయి. ‘‘వాళ్ల నాన్న నక్సలైట్‌. నక్సలైట్‌ కూతురికి ఏ ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వకూడదు. నక్సలైట్‌ కూతురు అనే ఇంటెలిజెన్స్‌ రిపోర్టు కూడా ఉంది’’ అని నాకు ఉద్యోగం రాకుండా యూనివర్శిటీలో కొందరు ప్రచారం చేశారు. అయితే తోటి అధ్యాపకులు, స్నేహితులు నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. నాకు ఉద్యోగం వచ్చేలా సహకారం అందించారు. నాకున్న మెరిట్‌ను బట్టి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ని అయ్యాను’’ అని చెప్పారు అనురాధ. 

అమ్మాయిలు చదవాలి.. ఎదగాలి
మారుమూల గిరిజన పల్లెల్లో గిరిజన అమ్మాయిలను ఎక్కువ చదువులు (ఉన్నత చదువులు) చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఆర్ధిక స్ధోమత లేనప్పుడు పై చదువులకు ఏం పంపుతామని నిస్సహాయత  వ్యక్తపరుస్తున్నారు. అమ్మాయిలను చదివిస్తేనే ఉన్నత శిఖరాలను అవరోహిస్తారు. తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయితో సమానంగా చూడాలి. ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్ల వలసిన అమ్మాయి, మనకే అన్నం ముద్ద పెట్టదు అనే ఆలోచన  చాలా మందిలో  ఉంది.

కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో అమ్మాయిలే తల్లిదండ్రులను చూస్తున్నారు. అమ్మాయిలను తక్కువ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అబ్బాయిలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించడం లాంటివి మానుకోవాలి. పైలట్‌ అవుతానంటే వద్దనీ, సైన్యలో చేరతానంటే కాదనీ అమ్మాయిలను తల్లిదండ్రులు అడ్డుకోకూడదు. వారికి  ఏరంగంలో ఆసక్తి ఉందో అదే రంగంలో ఉంచాలి. అప్పుడే వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. ప్రభుత్వాలు కూడా విద్య ఆవశ్యకత పట్ల గిరిజనుల్లో అవగాహన పెంచాలి. నా రిసెర్చ్‌ కూడా గిరిజనుల విద్యాభివృద్ధి పైనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement