హోమియోలో హెపటైటిస్-బి చికిత్స ఉందా? | Sakshi
Sakshi News home page

హోమియోలో హెపటైటిస్-బి చికిత్స ఉందా?

Published Wed, May 25 2016 11:46 PM

homeopathic treatment of hepatitis-B have?

హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 30 ఏళ్లు. ఈమధ్య కాలంలో పచ్చకామెర్లు వచ్చాయి. వాంతులు అవుతున్నాయి. అన్నం తినబుద్ధికావడం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి హెపటైటిస్-బి అని నిర్ధారణ చేశారు. తాత్కాలికంగా తగ్గినా మళ్లీ ఎప్పుడైనా రావచ్చని అన్నారు. హెపటైటిస్-బి వ్యాధికి హోమియోలో మందులు ఉన్నాయా?    - రాధాకృష్ణ, గజ్వేల్

 హెపటైటిస్-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది హెపటైటిస్-బి వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం వాపు రావడం, వాంతులు, పచ్చకామెర్లు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముదిరితే కాలేయం గట్టిపడిపోయి లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

 
వ్యాధి వ్యాప్తి: ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లోకి ప్రవేశించిందంటే, దాని సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రక్తంలోనూ, లాలాజలంలోనూ, వీర్యంలోనూ, మానవుడి ప్రతీ శారీరక స్రావంలోనూ ఈ వైరస్ చేరుతుంది. ఇది శరీర ద్రవాల ద్వారా, సూదులు ద్వారా, తల్లికడుపులోని తల్లి నుంచి బిడ్డకూ వ్యాపంచవచ్చు.

 
లక్షణాలు... తొలి దశ : శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని అక్యూట్ దశ అంటారు.ఈ దశలో ఎలీజా పరీక్ష చేస్తే పాజిటివ్ వస్తుంది.

 
రెండో దశ: ఈ దశలో వైరస్ శరీరంలో చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణిస్తారు. అంటే వైరస్ శరీరంలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ  దశలో కామెర్లు తగ్గినా కూడా హెచ్‌బీఎస్‌ఏజీ పరీక్షలో పాజిటివ్ అని వస్తుంది. శరీరంలో వైరస్ ఉన్నా కూడా ఇలాంటి వారికి తెలియదు. వారికి ఇతరత్రా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటి కోసం వైద్యపరీక్షలు చేయిస్తే ఇది బయటపడుతుంది. ఇలాంటి వారికి ఏ సమస్యా లేకపోయినా... వారి నుంచి ఇతరులకు వైరస్ సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

 
తొలి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ దశలో పదే పదే కామెర్లు వచ్చిపోతుంటాయి. వీరిలో 99.5 శాతం మందికి ప్రాణాపాయం ఉండదు. కానీ శరీరంలో వైరస్ ఉండి బాధిస్తుంది. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. ప్రతి ఆర్నెల్లకోసారి పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. ఎందుకంటే వైరస్ పూర్తిగా శరీరంలోంచి పోవడానికి చాలా సమయం పడుతుంది.

 
రెండో దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వీరి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ వీరికి ఏ బాధలూ / సమస్యలూ ఉండకపోయినప్పటికీ వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు ప్రతి ఆర్నెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ తగిన చికిత్స తీసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీరికి భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు లివర్ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. కొందరిలో సమస్యలేమీ లేకపోయినా అకస్మాత్తుగా లక్షణాలు మొదలై, క్యాన్సర్‌కు కారణం కూడా కావచ్చు. మెల్లగా లివర్ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం కూడా ఉంది.

 
చికిత్స: హోమియో విధానంలో కాన్సిటిట్యూషన్ పద్ధతుల్లో రోగి మానసిక / శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని క్రమేపీ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ, వ్యాధిని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి  సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్

 

కిడ్నీ కౌన్సెలింగ్

నా వయసు 26 ఏళ్లు. ఇటీవల ఆకలి బాగా తగ్గిపోయింది. బాగా నీరసంగా ఉంటోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్ విలువ 14 మి.గ్రా/డీఎల్. యూరియా 320 మి.గ్రా/డీఎల్ గా ఉంది. స్కానింగ్ లో కిడ్నీ సైజు బాగా తగ్గిందని తెలిసింది. ప్రస్తుతం క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ఐదో దశలో ఉన్నాననీ, కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? - ఎస్. శ్రీధర్, నూజివీడు

మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు కిడ్నీ మార్పిడి ఒక్కటే మేలైన పరిష్కారం. మీ తోడబుట్టినవాళ్లు లేదా మీ భార్య వంటి దగ్గరి సంబంధీకుల నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. కిడ్నీ మార్పిడి చేయించుకునే ముందు దాతకు అన్నిరకాల వైద్య పరీక్షలు చేసి, కిడ్నీదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి సమస్యలు లేకపోతేనే వారి నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. ఇక పేషెంట్‌కు దాత ఎంత దగ్గరి బంధువైతే అంత మంచిది. కిడ్నీ దీర్ఘకాలం పనిచేసే అవకాశం ఉంటుంది. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా పేషెంట్  క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాత అందుబాటులో లేకుంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, కెడావర్ దాతల కోసం తన పేరు నమోదు చేయించుకోవాలి. బ్రెయిన్‌డెత్ అయిన సందర్భాల్లో వాళ్ల దగ్గర కిడ్నీ దొరికితే అది మీకు అమర్చుతారు.

 

 
నాకు 38 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు?  - సుధాకర్, కొత్తూరు

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారమే తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

 

డాక్టర్ విక్రాంత్‌రెడ్డి 
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,  కేర్ హాస్పిటల్స్,  బంజారాహిల్స్,  హైదరాబాద్

 

 

 
Advertisement
 
Advertisement