గర్భవతులు చక్కెర తింటే పిల్లలకు అలర్జీలు

Health tips for pregnants - Sakshi

మీకు పూర్తి ఆరోగ్యకరమైన బేబీ పుట్టాలని భావిస్తున్నారా? పుట్టాక ఆ చిన్నారికి ఎలాంటి అలర్జీలూ ఉండకూడదని అనుకుంటున్నారా? సింపుల్‌ మీరు చేయాల్సిందల్లా గర్భవతిగా ఉన్న సమయంలో చక్కెర చాలా తక్కువగా తినడమే. మీరు ఎంత తక్కువగా చక్కెర లేదా చక్కెరతో చేసిన పదార్థాలు తింటే మీ చిన్నారి అంత ఆరోగ్యకరంగా పుడుతుంది. అంతేకాదు... ఎన్నో అలర్జీలు ఎదుర్కొనే శక్తి కూడా వారికి సమకూరుతుంది.

అయితే ఇక్కడ తాజా పండ్ల నుంచి లభ్యమయ్యే చక్కెరకు మినహాయింపు ఉంది.ఇటీవల బ్రిటన్‌లో 8,956 మంది గర్భవతులపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో కొంతమంది గర్భిణులు చాలా తక్కువ చక్కెర వినియోగించగా... మరో 20 శాతం మంది చాలా ఎక్కువగా చక్కెర పదార్థాలను తీసుకున్నారు. ఇంకొందరు ఓ మోస్తరుగా చక్కెర పదార్థాలు వాడారు. వారందరికీ పుట్టిన బిడ్డలను వారి ఏడవ ఏట  దుమ్ములో సూక్ష్మక్రిములకు (డస్ట్‌మైట్స్‌), పిల్లల వెంట్రుకలకు, గడ్డి వంటి వాటికి... ఇలా మూడు అంశాలకు ఎక్స్‌పోజ్‌ చేశారు.

తక్కువ చక్కెర తిన్న తల్లులకు పుట్టిన వారితో పోలిస్తే... ఎక్కువ చక్కెర వినియోగించిన మహిళల బిడ్డలే ఎక్కువగా అలర్జీలకు లోనయ్యారు. వీరిలో తక్కువ చక్కెర తీసుకున్న తల్లుల బిడ్డలు  ఒక అంశానికీ, కాస్త మోతాదుకు మించి చక్కెర పదార్థాలు వాడిన తల్లుల బిడ్డలు రెండు అంశాల పట్ల అలర్జీకి గురయ్యారు. ఇక అత్యధికంగా చక్కెర వాడిన తల్లుల బిడ్డల్లో ‘అలర్జిక్‌ ఆస్థమా’ కండిషన్‌ కనిపించింది. ఈ అధ్యయన ఫలితాలు ‘యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌’లో చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top