వెలుగులు నింపే ‘ఓలిక్‌’ వేరుశనగ!

The health benefits of the high-oleic peanut and their nutritional - Sakshi

ఓలిక్‌ యాసిడ్‌ 80% ఉండే వేరుశనగ రకాలకు ఇక్రిశాట్‌ రూపకల్పన 

2 నెలల నుంచి 9 నెలలకు పెరిగిన వేరుశనగలు, వాటి ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం

అధిక ఓలిక్‌ యాసిడ్‌ ఉండే వేరుశనగలను ఇప్పటి వరకు ఆస్ట్రేలియా నుంచి

దిగుమతి చేసుకుంటున్న ఆహార శుద్ధి పరిశ్రమలు

ఇక్రిశాట్‌ వంగడాల అభివృద్ధితో వేరుశనగ రైతులకు పాత వంగడాల కన్నా

15% వరకు అధిక దిగుబడి.. 10% అదనపు ఆదాయం

ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలు ఇస్తాం: ముఖ్య శాస్త్రవేత్త డా. పి. జనీల

వేరుశనగలో అత్యంత మేలైన , మెట్ట ప్రాంత రైతులకు అధిక రాబడిని అందించే రకాలేవి? ఓలిక్‌ యాసిడ్‌ ఎక్కువ శాతం ఉండే రకాలు! ఎందుకని?.. సాధారణ వేరుశనగలు 2 నెలల్లోనే మెత్తబడి పోతాయి. వీటిలో ఓలిక్‌ యాసిడ్‌ 45–50% వరకు ఉండటమే కారణం. కాబట్టి, ఇటువంటి వేరుశనగలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయటం కష్టం. ఓలిక్‌ యాసిడ్‌ 80% వరకు ఉంటే.. 9 నెలల వరకు మెత్తబడి పాడు కాకుండా నిల్వ చేయొచ్చు! అంతేకాదు.. ఓలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే వేరుశనగలు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే.. మన దేశంలో, ఇతర ఆసియా దేశాల్లోని ఆహార శుద్ధి కంపెనీలు ఆస్ట్రేలియా నుంచి ఓలిక్‌ యాసిడ్‌ 80% వరకు ఉన్న వేరుశనగలను ప్రతి ఏటా వేలాది టన్నులు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఓలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే వేరుశనగ రకాలను మనమే అభివృద్ధి చేసుకోగలిగితే ఎంతబావుంటుందో కదా..? ఆ రకాలు అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తిక్క తెగులు, తుక్కు తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకొనగలిగినవైతే మన రైతులకు మరింత మేలు కదూ? సరిగ్గా ఏడేళ్ల క్రితం డా. పసుపులేటి జనీలకు ఈ ఆలోచన వచ్చింది. మెదక్‌ జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్‌)లోని వేరుశనగ వంగడాల అభివృద్ధి విభాగంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడేళ్ల పాటు కొనసాగించిన పరిశోధన సఫలీకృతమైంది. గుజరాత్‌లోని జునాగఢ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి పరిశోధనా కేంద్రం, ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం పరిశోధనా కేంద్రం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో, క్షేత్రప్రయోగాల్లో పాలుపంచుకున్నారు.

జన్యుమార్పిడి విత్తనాలు కావు.. తిరిగి వాడుకోవచ్చు..
ఇక్రిశాట్‌లో డా. జనీల ఆధ్వర్యంలో 2011 నుంచి ఓలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండే వంగడాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఓలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండే అమెరికన్‌ వంగడం(సనోలిక్‌95ఆర్‌)తో స్థానిక వంగడాలను సంకరపరచి 16 కొత్త వంగడాలను రూపొందించారు. జన్యుమార్పిడి పద్ధతులను అనుసరించలేదు. మాలిక్యూలర్‌ మార్కర్స్‌తోపాటు అనేక సాంకేతికతలను వినియోగించడం ద్వారా సాధారణం కన్నా 3–4 ఏళ్ల ముందుగానే పరిశోధనను తక్కువ ఖర్చుతోనే కొలిక్కి తెచ్చామని డా. జనీల సంతోషంగా చెప్పారు. ఓలిక్‌ యాసిడ్‌ 80% వరకు ఉండే ఐ.సి.జి.వి. 03043 అనే రకంతో పాటు మరో రెండు వేరుశనగ వంగడాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

ఈ రకాలను సాగు చేసే రైతులు తమ పంట నుంచి కొన్ని కాయలను పక్కన పెట్టుకొని తిరిగి విత్తనంగా వాడుకోవచ్చు. స్థానికంగా క్షేత్ర ప్రయోగాలు చేసిన తర్వాత వేరుశనగ విస్తారంగా సాగయ్యే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 2017లో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి తదితర రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు.  ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రైతులు ఇష్టపడి సాగుచేస్తున్న వేరుశనగ రకాల కన్నా (5–15% నుంచి 84% వరకు) అధిక దిగుబడి వచ్చిందని, ఓలిక్‌ యాసిడ్‌ 80% వరకు వచ్చిందని డా. జనీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. సాధారణంగా మన వేరుశనగ గింజల్లో 48% వరకూ వచ్చే నూనె దిగుబడి.. ఐ.సి.జి.వి. 03043 రకంలో 53% రావటం విశేషమన్నారు.

ఆరోగ్యదాయకం..
ఓలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండే వేరుశనగలు వినియోగదారులకు మరింత ఆరోగ్యదాయకమైనవి.  ఓలిక్‌ యాసిడ్‌ తక్కువగా ఉండే సాధారణ వేరుశనగలు లేదా వాటితో తయారు చేసిన ఆహారోత్పత్తులు రెండు నెలల్లో మెత్తబడుతాయి. కాబట్టి, ఆహార శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు ఆస్ట్రేలియా నుంచి 9 నెలల పాటు నిల్వ సామర్థ్యం కలిగిన, అధిక ఓలిక్‌ యాసిడ్‌ ఉండే వేరుశనగలను ఏటా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిద్ధమైన కొత్త వంగడాలు పూర్తిగా సాగులోకి వస్తే ఈ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.  మన దేశంలోని ఆహార శుద్ధి కర్మాగారాలకు ఇంకా ఓలిక్‌ యాసిడ్‌ ప్రాధాన్యంపై తగినంత చైతన్యం లేదని ఆమె అన్నారు.

వీరిలో చైతన్యం పెంపొందించడంతోపాటు రైతులకు కొత్త వంగడాలను అందిస్తే పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు కూడా మేలు కలుగుతుంది. ఓలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండడం వల్ల వేరుశనగ నూనె వాసన మెరుగ్గా ఉంటుందని, గుండె జబ్బుల నివారణతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరతాయని ఆమె అన్నారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార శుద్ధి కంపెనీలతో ముందస్తు ఒప్పందాల మేరకు ఈ వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ వంగడాలను సాగు చేయటం వల్ల రైతులకు అధిక ఉత్పత్తితోపాటు కనీసం 10% అధిక ధర కూడా లభిస్తుందని డా. జనీల చెబుతున్నారు.

గుజరాత్‌లో సుమారు 8 వేల మంది రైతులతో కూడిన ఖెదుత్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫీడ్స్‌ అనే సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయించారు. మార్కెట్‌ అవసరాలకు తగినంత నాణ్యత కలిగిన వేరుశనగలను వారు పండించి లబ్ధిపొందుతున్నారని డా. జనీల వివరించారు. ప్రస్తుతం దేశంలో 48 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఇక్రిశాట్‌ రూపొందించిన కొత్త వంగడాలు తక్కువ ఎరువులు, పురుగుమందులతోనే మంచి దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అత్యధికంగా 40 వరకు ఊడలు వస్తున్నందున ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయదారులు కూడా ఈ వంగడాలను సాగు చేయడం ద్వారా మంచి గిట్టుబాటుధర పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు.

చెట్టుకు 30కి పైగా కాయలున్నాయి..!
పదేళ్లుగా వేరుశనగను సాగు చేస్తున్నా. కె6, టాగ్‌ 24 రకాలు మచ్చ(తిక్క) తెగులును తట్టుకోవటం లేదు. దిగుబడి 3, 4 క్వింటాళ్లే వస్తున్నది. ఈ ఏడాది ఐ.సి.జి.వి. 03043 రకం సాగు చేశా. మచ్చ తెగులును తట్టుకోవటంతో చేనంతా పచ్చగా ఉంది. ఊడలు ఎక్కువగా వచ్చాయి. 60 రోజుల తర్వాతే ఊడలు వస్తున్నాయి. చెట్టుకు 30కి పైగా కాయలు ఉన్నాయి. 5 నెలల పంట కాలం. ఆకుమచ్చ తెగులు రాలేదు కాబట్టి ఆకు రాల్లేదు. మంచి పశుగ్రాసం కూడా వస్తుంది. తుప్పు తెగులు ఒకటి, రెండు మొక్కలకు తప్ప రాలేదు. 10 రోజుల్లో కాయలు కోస్తాం. బాగా లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నా.
– మల్లాయపల్లి నరసింహారెడ్డి (86869 55757), వేరుశనగ రైతు, శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా

నారాయణ, కె6 కన్నా అధిక దిగుబడి.. ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలిస్తాం!
ఈ కొత్త వేరుశనగ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేయించగా.. నారాయణ రకంతో సమానంగా దిగుబడి వచ్చింది. ఓలిక్‌ యాసిడ్‌ 80% వచ్చింది. అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తుప్పు తెగులు, తిక్క తెగులును తట్టుకున్నాయి. తెలంగాణలో కె6 కన్నా మెరుగైన దిగుబడి వచ్చింది. 2018లో కూడా క్షేత్రస్థాయి ప్రయోగాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అధికారికంగా విడుదల అవుతాయి. అయితే, ఈ లోగానే కొంత మేరకు విత్తనోత్పత్తి కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు, జాతీయ విత్తన సంస్థ(ఎన్‌.ఎస్‌.సి.)కు వచ్చే ఖరీఫ్‌ నాటికి కొత్త విత్తనాలను అందించాలనుకుంటున్నాం.
– డా. పసుపులేటి జనీల (99899 30855), ముఖ్య శాస్త్రవేత్త, ఇక్రిశాట్, పటాన్‌చెరు, మెదక్‌ జిల్లా.
p.janila@cgiar.org

            వేరుశనగ రకాల మధ్య తేడాలను వివరిస్తున్న రైతు నరసింహారెడ్డి
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top