ఎమర్జెన్సీకి టైమ్‌ వచ్చేసిందా?!

Has time come to Emergency ?! - Sakshi

ఆగని ఆత్యాచారాలు

స్వాతీ మలీవాల్‌ దీక్ష ఇంటింటి దీక్ష కావాలి. ఇంటింటి ప్రతిఘటన, ఇంటింటి ఖండన కావాలి. దేశంలో అత్యాచారాలు నిరోధించే ఎమర్జెన్సీ విధించాలి. 

మహిళలు, చిన్నారులపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో చట్టం చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఈ ఒక్క   ఏడాదిలోనే, ఈ ఒక్క నెలలోనే, ఈ ఒక్క వారంలోనే ఎన్ని రేపులు! ఎంత హింస! ‘నిర్భయ’ చట్టం ఒక్క లైంగిక దాడిని కూడా ఆపలేకపోతోంది. ఇప్పుడిక ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతీ మలీవాల్‌ అయితే రాజ్‌ఘాట్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు! నేరస్తులకు ఆర్నెల్లలోపు మరణదండ విధించాలని ఆమె డిమాండ్‌. దీక్షకు కూర్చోడానికి ముందు గురువారం ఆమె ప్రధాని మోదీకి ఒక ఉత్తరం రాశారు. ఢిల్లీలో రోజురోజుకీ మహిళల మీద, చిన్నారుల మీద లైంగిక దాడులు, అత్యాచారాలు పెరగడంపై ఆ ఉత్తరంలో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలో ఎనిమిది నెలల పసికందుపై అత్యాచారం! కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య! ‘ఉన్నావ్‌’లో యువతిపై అత్యాచారం! ఏమిటిదంతా.. మోదీజీ.. ఈ బాలికల గురించి ఆలోచించండి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే దీక్షకు కూర్చున్నారు. ఇవాళ్టికి ఆమె దీక్షకు ఐదో రోజుకు చేరుకుంది. మోదీ నుంచి ఇప్పటి వరకైతే సమాధానం ఏమీ రాలేదు కానీ..  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. స్వాతీ మలీవాల్‌కు మద్దతుగా నిలిచారు.

‘‘ఆమె తన కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడం లేదు. నా కుటుంబంలోని వాళ్ల కోసం, మీ కుటుంబంలోని వాళ్ల కోసం చేస్తోంది. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లి ఆమె దీక్షకు మద్దతు తెలియజేయండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆమెను కలవండి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో జరుగుతున్న అత్యాచారాలపై నేను కలత చెందుతున్నాను. భార తదేశ పౌరుడిగా ఈ దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఆవేదన చెందుతున్నాను’’ అని కూడా ఆయన ట్వీట్‌ చేశారు. అవును. స్త్రీ జాతిపై పగబట్టినట్లుగా జరుగుతున్న ఈ అత్యాచారాలపై, చిన్నారులను సైతం బలిగొంటున్న వికృత పోకడలపై ప్రతి ఒక్కరం నినదించవలసి సమయం వచ్చేసింది. స్వాతీ మలీవాల్‌ దీక్ష ఇంటింటి దీక్ష కావాలి. ఇంటింటి ప్రతిఘటన, ఇంటింటి ఖండన కావాలి. దేశంలో అత్యాచారాలు నిరోధించే ఎమర్జెన్సీ విధించాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top