మొదటికాన్పు... బిడ్డకు పాలుపట్టడం ఎలా? | Sakshi
Sakshi News home page

మొదటికాన్పు... బిడ్డకు పాలుపట్టడం ఎలా?

Published Tue, Oct 8 2013 12:36 AM

మొదటికాన్పు... బిడ్డకు  పాలుపట్టడం ఎలా?

నా వయసు 22. నాకిది మొదటికాన్పు. నెల రోజుల తర్వాత ప్రవసం కానుంది. నవజాత శిశువునకు తల్లిపాలు పట్టడం ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం తాగించాలి? అవి సమృద్ధిగా రాకపోతే బయటిపాలలో ఏవి మంచివి? నాకు మంచి సలహా ఇవ్వగలరు.
 
 - విమల, వనస్థలిపురం
 ప్రసవసమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం గుర్తుంచుకోవాలి. జన్మించిన పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతినివ్వాలి. ఏమీ తాగించనవసరం లేదు. అనంతరం శిశువు ఆరోగ్యం బాగుందని నిర్ధారణ చేసిన పిదప తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా పాలు తాగగలగడం శిశువునకు సంక్రమించే సహజసిద్ధమైన ప్రక్రియ. తల్లి సంతోషంతో శిశువును చూడటం, తాకడం, స్తనాన్ని నోటికి అందించడం ‘స్తన్యం’ స్రవించడం సఫలమవుతుంది. తనకెంత కావాలో శిశువుకి తెలుసు. అనంతరం తల్లి ప్రయత్నించినా తాగడు. అది గుర్తించి బలవంతంగా తాగించవద్దు. శిశువు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ‘ఆకలి’ కూడా ఒకటి.
 
 ముర్రుపాలు (కొలొస్ట్రమ్) శిశువుకు చాలా మంచిది. బలకరం. విరేచనం సాఫీగా అయ్యేట్టు చేస్తాయి. బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చేవరకు స్తన్యం తాగించాలి. ఆరవనెలలో ఫలప్రాశన, పదవ నెలలో అన్నప్రాశన తప్పనిసరి. ఇతర పోషకవిలువలు బిడ్డకందించడానికి ఇది చాలా అవసరం. సరియైన ఫలాలు లభించకపోతే ఆరవనెలలోనే అన్నప్రాశన చేయాల్యల్సి ఉంటుంది. ఇది సుశ్రుతాచార్యులు చెప్పిన విషయం. శిశువులో రోగనిరోధక శక్తి పరిపుష్టమవడానికి, శారీరక, మానసిక వికాసానికి, ఆయుఃవృద్ధికి, సంపూర్ణ ఆరోగ్యానికి స్తన్యపానం అత్యంతావశ్యకమని ఆయుర్వేద గ్రంథాలన్నీ నొక్కివక్కాణించాయి. దీనినే ‘ఓజోవర్థనం’ అంటారు.
 
 తల్లిపాలు తక్కువయిన పక్షంలో ‘ఆవుపాలు, మేకపాలు’ శ్రేష్ఠమని ఆయుర్వేదోక్తం. వీటిలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు పసుపువేసి మరిగించి, చల్లార్చి, చక్కెర కలిపి తాగించవచ్చు. శతావరీ చూర్ణం (5 గ్రాములు), పాలతో కలిపి, రెండుపూటలా తల్లి సేవిస్తే, తల్లికి సమృద్ధిగా స్తన్యం ఉత్పత్తి అవుతుంది. తల్లికి జ్వరం గాని, రొమ్ముపై స్థానికంగా రోగాలుగాని ఉన్నప్పుడు తాత్కాలికంగా బిడ్డకు స్తన్యపానాన్ని ఆపాల్సి ఉంటుంది. ఒక నెల వయసు దాటిన అనంతరం బిడ్డకు ఒకటి లేదా రెండు చుక్కల గాడిదపాలు తాగిస్తే చాలా జబ్బులను నివారించే రోగనిరోధకశక్తి కలుగుతుందని శాస్త్రోక్తం.
 
 ప్యాకెట్ పాలుగాని, డబ్బాపాలు గాని తెచ్చుకోవడం అనివార్యమైతే అవి ‘కల్తీ’ లేనివని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, తాజాఫలాలు, పాలు’ సేవిస్తే తల్లికి స్తన్యోత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. సాత్వికాలోచన, సంతోషం స్తనకరం. శోకం, దుఃఖం, చింత, అసూయ వంటి ప్రతికూల ఉద్వేగాలు స్తన్యనాశనకరం.  
 

Advertisement
Advertisement