ఆకుపచ్చ సూర్యోదయం

Green sunrise

‘సాములోరు సచ్చిపోలేదు. నా మాట కూడా నమ్మర్రామీరు? మూడు మాసాల క్రితం నేనే ముగ్గుర్ని తోడిచ్చి ఆయన్ని మచ్చికుండం పంపించాను......’’మతిస్థిమితం కోల్పోయిన మనిషిలాగే అరిచాడు గంతన్న.రాత్రి పదిగంటల ప్రాంతం. తన స్వగ్రామం నడింపాలెం వచ్చాడు గంతన్న. వెంట ఏడుగురు అనుచరులే ఉన్నారు. అందరి చేతులలోను తుపాకులు ఉన్నాయి. వాళ్లని ప్రేతాత్మలని చూసినట్టు చూస్తున్నారు గ్రామీణులు, భయం భయంగా. ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా వెంటాడుతున్నారు పోలీసులు.

అణువణువూ అలసిపోయినట్టు కనిపిస్తున్నారు ఆ ఏడుగురు. అందరి కాళ్లకీ గాయాలు కనిపిస్తున్నాయి. పెద్దవైతే కట్లు కట్టుకున్నారు.రామరాజు మరణవార్త జీర్ణం కావడం లేదు గంతన్నకి. కృష్ణదేవిపేటలో జరిగింది విన్న  క్షణం నుంచి గుండె విలవిలలాడుతూనే ఉంది. దీనికితోడు రెండు రోజుల నుంచి భోజనమే లేదు. వెర్రి నీరసంతో ఉన్నారంతా.ఎవరైనా పిలిచి కొంచెం గంజి పోస్తారేమోనన్న ఆశతో ఆ ఏడుగురు ఎదురు చూస్తున్న సంగతి గ్రామస్తులకి తెలిసినా ఎవరూ సాహసం చేయడం లేదు.

నీరసంతో కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. రెండు కాగడాల వెలుగులో గ్రామ శివార్లలో జరుగుతోంది ఇదంతా.ఆ మసక వెలుతురులోనే కనిపించాడు తన ఆప్తుడు–గడుతూరు నాగన్న. తన దుంప కొమ్ముల వెల్లావునీ, దాని కడుపునే పుట్టిన కోడెనీ, ఇంకొక దూడనీ కూడా ఉద్యమానికి వెళ్లే ముందు అతడికే అప్పగించాడు గంతన్న. అతడి రెండు చేతులూ పట్టుకుని అన్నాడు గంతన్న, ‘‘నువ్వు చెప్పరా నాగన్నా! దేవుడికి సావేంట్రా? ఆయన్ని తెల్లోళ్లు ఏం చేయగలరు? చంపగలరా?’’‘‘గంతన్న! నువ్వు ఊళ్లో ఎక్కువ సేపు ఉండకు. వెళ్లిపో!’’ అన్నాడు నాగన్న.‘‘అదేంట్రా!’’ అతి దీనంగా అన్నాడు గంతన్న.‘నీకూ మంచిది కాదు, మాకూ మంచిది కాదు. మీ గొడవ వదలిందని అంతా అనుకుంటున్నారు. ఇంక పోలీసుల పీడ వదలాలి. ఇంక మా వల్ల కాదు భరించడం. అటు పోలీసోళ్లు, ఇటు మీరు... ఇంకా ఎందుకు?’’ డగ్గుత్తికతో చెప్పాడు నాగన్న.హతాశుడైపోయాడు గంతన్న. శరీర పరిస్థితికి తోడు ఆ మాట తోడై కళ్లు బైర్లు కమ్మినట్టయింది. రెండు నిమిషాల తరువాత అక్కడ నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది గంతన్న బృందం.
2
జూన్‌ 7, 1924
పురిటికందుగా ఉన్నప్పుడు తన కళ్లకు గంతలు కట్టినట్టే, ఇప్పుడు కూడా కట్టుకునే అవకాశం ఉంటే బాగుండును అనుకుంటు న్నాడు గంతన్నదొర. పురిటికందులు వరసగా చనిపోతూ ఉంటే కళ్లకు గంతలు కట్టి, శిశువు బతకాలని దేవతలను మొక్కుకునే ఆచారం ఉంది. అలా గంతలు కట్టిన వాళ్లకి గంతన్న అని పేరు పెడతారు. ఆ ఆచారంతో పిల్లలు బతుకుతారని కొండలలో ఒక విశ్వాసం. కళ్లెదుట జరిగిపోతున్నవి చూస్తుంటే మనసు వికలమైపోతోంది. ఎంత పాపం చేశాయో ఈ కళ్లు అనిపిస్తోంది. అడవి దద్దరిల్లిపోయేటట్టు ఏడవాలని కూడా ఉంది అతడికి. సరిగ్గా నెల... అప్పటికి గాని రామరాజుని అస్సాం రైఫిల్స్‌ వాళ్లు కాల్చి చంపిన వాస్తవం జీర్ణం కాలేదు గంతన్నకి. ఆ స్వామి... తమ పాలిట దేవుడు శ్రీరామరాజును పొట్టన పెట్టుకున్నారు.

అక్కడ నుంచి మొదలైంది హత్యాకాండ. ఎంత హింస! పారువేట రోజున మన్యంలో కొండవాళ్లు జంతువులను  చుట్టుముట్టి వేటాడినట్టు ఇప్పుడు కొండవాళ్లను వేటాడుతున్నారు పోలీసులు. మే 7వ తేదీన రామరాజును కాల్చి చంపారు. ఈ నెల రోజుల నుంచి రోజూ ఒక తూటా గుండెను తాకుతూనే ఉంది గంతన్నదొరకి. అంత బాధించే సమాచారం చెవిన పడుతోంది. ఒక్క మాసంలోనే ముప్పయ్‌ ఏడుగురిని పట్టుకున్నారు పోలీసులు. ఉద్యమకారులని గ్రామస్తులు పట్టి ఇస్తున్నారు. బయట బతకలేక కొందరు తామే లొంగిపోతున్నారు.

‘ఇవాళ ఎలాంటి తూటా దిగుతుందో ఈ గుండెలలోకి!’ తనని తానే ప్రశ్నించుకున్నాడు గంతన్న. అంతాడ ముఠాలోని ఎద్దుమామిడి, శింగధారల మధ్య ఒక వాగు. అసలే గుహ, అందులో బిలంలా ఉంటుంది ఆ ప్రదేశం. కొండల నుంచి వస్తున్నది నీరు కాదు, కొండ ప్రజల కన్నీరులా అనిపిస్తోంది.ఆ వాగు ఒడ్డునే ఇసుకలో కూర్చున్నాడు గంతన్న. ఆరుగురు సహచరులు మాత్రం వెంట ఉన్నారు. మూడురోజుల నుంచి గంతన్న సహా ఎవరికీ భోజనం లేదు. నిద్ర అసలే లేదు. పూర్వంలా పిలిచి భోజనం పెట్టడం కాదు కదా, ఎవరూ ఊరిలోకి కూడా రానివ్వడం లేదు. దూరంగా పారిపోతున్నారు.మే 12న ప్రత్యేక కోర్టు మల్లు, మరో ఐదుగురి కేసు మీద తీర్పు ప్రకటించింది.

మల్లుకు ఉరిశిక్ష. మిగిలిన వాళ్లకి ద్వీపాంతర శిక్ష.పదిరోజుల క్రితం గంతన్న చిన్న భార్యని కొయ్యూరు శివార్లలో అరెస్టు చేశారు. ఇంతకాలంగా ఆమె తప్పించుకు తిరుగుతూనే ఉంది. చిన్నభార్య దొరికిపోయిన మూడు రోజులకే పెద్దభార్య, కూతురు దొరికిపోయారు. కొన్ని సందర్భాలలో పోలీసులను మించి గ్రామస్థులు ప్రవర్తిస్తున్నారు. అవి వింటుంటే నోట మాట కూడా రావడం లేదు ఎవరికీ.మొట్టాడం బుడ్డయ్యదొర కొండదళం సభ్యుడు. రాజును కాల్చి చంపాక ములక్కాయల భీమవరంలో బావమరిది ఇంట దాక్కున్నాడు. ఆ సంగతి తెలిసిపోయింది. గ్రామస్థులంతా ఇంటి మీద పడ్డారు. అప్పుడు భోజనం చేస్తున్నాడు బుడ్డయ్యదొర.

ఇంకేమీ చూడలేదు, పరమ కిరాతకంగా ఒక బండతో అతడి తల పగలగొట్టారు. సజీవంగానే కాదు, శవాన్ని అప్పగించినా డబ్బులు ఇస్తున్నారు పోలీసులు. అందుకే రక్తమోడుతున్న ఆ శవాన్ని తీసుకుపోయి రాజవొమ్మంగి స్టేషన్‌లో అప్పగించారు. తరువాత అదే స్థితిలో, అక్కడికే చేరింది సప్పగడ్డ బూర్నేసు అనే ఉద్యమకారుడి శవం. ములక్కాయభీమవరం పక్కనే ఉంది బందమామిడి. అక్కడే బంధువుల ఇంట రహస్యంగా ఉన్నాడు బూర్నేసు. ఇది కనిపెట్టి గ్రామప్రజలు బలవంతంగా లాక్కుపోయి రేవళ్లలో మునసబు ఇంటికి తీసుకుపోయారు. మునసబు తమ్ముడు అతడిని పందిరిరాటకు కట్టేసి రుబ్బురోలుతో తల మీద మోది చంపాడు.ఒకప్పుడు పెద్దవలస అంటే ఉద్యమానికి అడ్డా.

ఎండు పడాలంటే ఆ ఊళ్లో గొప్ప గౌరవం. అదంతా ఏమైపోయిందో! ఉద్యమంలోకి వెళ్లినందుకు పడాలు కొడుకును ఆ గ్రామస్థులు బంధిస్తే పోలీసులు విచారించారు. ఇదేమిటని నిలదీయడానికి వెళ్లాడు ఎండు పడాలు. ఆ రోజు మే 26వ తేదీ. ఎండు పడాలు వస్తాడని తెలుసు. ఇందుకోసమే చూస్తున్న మునసబు తన మనుషులను ఉసిగొల్పాడు. పడాలు చేతిలోఉన్న డబుల్‌ బ్యారెల్‌ తుపాకీ కూడా పని చేయలేదు. కర్రలతో, గొడ్డళ్లతో ఊరి జనం దాడి చేసి చంపేశారు. ఆ మృతదేహాన్ని నిర్దయగా ఊరవతల కొండలలో పడేసి వచ్చారు.వీటన్నిటినీ తలుచుకుంటూనే పడుకున్నాడు గంతన్న. ఎప్పుడో నిద్ర పట్టింది.ఎంతసేపు గడిచిందో తెలియదు.

హఠాత్తుగా కాల్పులు వినిపించాయి.
నిజానికి గంతన్నదొర కూర్చుని ఉన్న వాగుకి కొద్దిదూరంలోనే పొత్తూరి బంగారయ్య అనే ఉద్యమకారుడు ఒక చెట్టు మీద ఉండి నిఘా వేసి ఉన్నాడు. ఎలా తెలిసిందో మరి, మలబారు దళమే అక్కడ గంతన్న ఆచూకీని కనిపెట్టింది. వీళ్ల ఆచూకీ జమేదార్‌ పొన్నుస్వామి కనిపెట్టగలిగాడు.మొదట చెట్టు మీద ఉన్న బంగారయ్యను కాల్చి చంపాడు. బంగారయ్య చేతిలో తుపాకీ లేదు. విల్లమ్ములే ఉన్నాయి. దానితో అతడు ఎలాంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయాడు.

ఆ శబ్దంతోనే గంతన్నకి మెలకువ వచ్చింది. అప్పటికే సహచరులు ఆరుగురు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కొండదళం ఒక పక్కకు తప్పుకుని కాల్పులు జరిపింది. కొన్ని నిమిషాలే సాగాయి కాల్పులు.హఠాత్తుగా ఆగిపోయాయి.పది నిమిషాలు ఆగి, ధైర్యం చేసి ముందుకు వెళ్లారు పోలీసులు. ఒక చెట్టు చాటున ఎవరో మరణబాధ పడుతున్నారు. ఒక్క ఉదుటన అక్కడి వెళ్లారంతా.ఏదో అడవి జంతువు చీల్చినట్టు ఎడమ తొడ చీరుకుపోయి ఉంది. ఒక తూటా పొత్తి కడుపులో దూరింది. రక్తం చివ్వున వస్తోంది.అతడు గంతన్నదొర.

ఆరుగురూ పారిపోయారు.
కొనప్రాణంతో ఉన్నాడు గంతన్న. దొరికిన పాముని కొట్టేసి, చివరిగా తల చితక్కొట్టినట్టు తుపాకి మడమలు తిరగేసి నలుగురో అయిదుగురో గంతన్న తల మీద మోదారు.శవాన్ని బంగారమ్మ పేట మీదుగా కృష్ణదేవిపేటకే తీసుకువెళ్లి రామరాజును దహనం చేసిన చోటే దహనం చేశారు.ఇదంతా చూసి దుఃఖం ఆపుకోలేనట్టు మరునాడే మన్యమంతా కనీవినీ ఎరుగని కుంభవృష్టి.
∙∙
ఉపసంహారం
సముద్రపు గాలి ఆగకుండా వీస్తోంది. 1927 సంవత్సరంలో ఒకరోజు.హోరు వినిపిస్తోంది. సముద్రం కంటికి కనిపించడం లేదు. దుర్భేజ్యమైన గోడల వెనుక ఆ గదిలో కూర్చుని ఉన్నాడతడు.
అదే కాలాపానీ–

అండమాన్‌ జైలు. కఠిన శిక్షలకి నిలయం. ఆ పేరున్న ఖైదీని లోపలకి పంపమని కాంపౌండర్‌ లచ్చమయ్యని ఆదేశించాడు జైలు డాక్టర్‌. విస్తుపోయాడు లచ్చమయ్య. జీవితంలో ఇలాంటి మలుపు ఒకటి ఉంటుందని ఊహించలేకపోతున్నాడు. ఔను, అతడే. ఎంత పొరపాటు అనుకున్నాడు లచ్చమయ్య. అక్కడే కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుదామని అనిపించింది. ముందు కర్తవ్యం నిర్వర్తించాలి. ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క దుఃఖం వెల్లువెత్తుతుండగా వెంటనే పిలిచాడు లచ్చమయ్య, ‘‘వేగిరాజు సత్యనారాయణరాజు!’’విపరీతమైన జ్వరంతో ఉన్నాడు వేగిరాజు సత్యనారాయణరాజు, అతడే అగ్గిరాజు.గుర్తు పట్టలేనంతగా అయిపోయాడు.

అన్నీ తనిఖీ చేసి మందుల చీటీ ఇచ్చి పంపాడు డాక్టర్‌. లచ్చమయ్య అగ్గిరాజుకి క్లినిక్‌ ముందు ఒక బెంచి చూపించి అక్కడే కూర్చోమన్నాడు, తెలుగులో. తనే వెళ్లి మందులు తెచ్చి ఇస్తానన్నాడు. ఈ జైలులో, బ్రిటిష్‌ వాళ్ల దృష్టిలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ ప్రదేశంలో ఇంత సాత్వికులు ఉండడం ఆశ్చర్యంగా ఉంది అగ్గిరాజుకి.‘‘నువ్వూ తెలుగువాడివేనా? ఏ ఊరు? ఏం పేరు?’’ అడిగాడు అగ్గిరాజు.‘‘నన్ను గుర్తుపట్టలేదా బాబూ?’’ అన్నాడు.

అప్పుడు ముఖంలోకి తీక్షణంగా చూసి అన్నాడు అగ్గిరాజు, ‘‘ఔను నువ్వు మన్యంలో..... నీ పేరేమిటో మరచిపోయాను.’’  దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకున్నాడు. బాగా వేడిగా ఉంది అగ్గిరాజు శరీరం. జ్వరంతో కాలిపోతోంది. ‘‘ఇలాంటి జైల్లో ఉన్నోళ్లని బావున్నారా అని అడగలేను. బాగుండాలని మాత్రం కోరుకుంటాను.’’ అంటూ, ‘‘లచ్చమయ్యని బాబూ!’’ అన్నాడతడు.‘‘ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?’’ అడిగాడు అగ్గిరాజు.‘‘మేం మొన్న డిసెంబరు చివర్న వచ్చాం బాబూ!’’ ‘‘మేము అంటున్నావ్‌! ఎంతమంది?’’ కొంచెం బాధగానే అన్నాడు అగ్గిరాజు.‘‘పన్నెండుమందిమి!’’ అన్నాడు లచ్చమయ్య.‘‘పన్నెండు మందా? ఎవరెవరు. నువ్వు కొంచెంసేపు నాతో మాట్లాడగలవా? ఇబ్బంది లేకపోతే!’’ దీనంగా అన్నాడు అగ్గిరాజు.

‘‘నా డ్యూటీ అయిపోయింది బాబూ! నైట్‌డ్యూటీ చేశాను. మాట్లాడాలనే వచ్చాను ‘‘అదే... ఎవరెవరు వచ్చారు?’’ ‘‘బోనంగి పండు పడాలు, మల్లుదొరలకి ముందు ఉరిశిక్ష వేసి, తర్వాత యావజ్జీవ శిక్షగా మార్చారు. మల్లుని ఎక్కడ పెట్టారో తెలియదు. పండు పడాలు, మేమంతా ఒక్కసారే ఇక్కడికి వచ్చాం. మా అందరికీ ద్వీపాంతర శిక్షే పడింది. నన్ను, నాతో పాటు ఇంకో లచ్చమయ్య కూడా ఉన్నాడు. పుట్టయ్య పేరుతో ఇద్దరు,  కుంచెట్టి సన్యాసి, గులివేల సన్యాసి, చిన్నయ్య, లింగయ్యలని తీసుకొచ్చారు.

‘‘ఎలా తీసుకొచ్చారు?
‘‘ఎంత దూరం తిప్పారు బాబూ! తీర్పు వచ్చాక విశాఖపట్నం జైలు నుంచి రాజమండ్రి జైలుకి పంపారు. అక్కడ పదిహేను రోజులు ఉంచారు. అక్కడ నుంచి కన్ననూరు జైలుకి. అక్కడో రెండు నెలలు. తర్వాత తిరుచునాపల్లి జైలు– ఈసారి ఆరుమాసాలు. చివర్న పాⶠయంకోటలో ఆరుమాసాలు ఉన్నాం. అప్పుడు డిసెంబర్‌ ఆఖరికి ఇక్కడి తెచ్చారు.’’ ‘‘ఈ నరకానికి వచ్చేవారందరిదీ అదే దారి. ఇంతకీ గోకిరి ఎర్రేసు ఏమయ్యాడు?’’ ఆత్రంగా అడిగాడు అగ్గిరాజు.

‘‘మీకు తెలియదేమో!  స్వామిని కాల్చేసిన సరిగ్గా నెలకి గంతన్నని చంపేశారని తెలిసింది. గంతన్నని చంపిన మూడోరోజునే రామన్నపాలెం ఊరోళ్లు ఎర్రేసుని పట్టి పోలీసులకి అప్పగించేశారు. ఎర్రేసుకి కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేసి రాయవెల్లూరు జైలుకు పంపారు.’’మ్లానమైపోయింది అగ్గిరాజు ముఖం. ‘‘మన్యప్రజలు ఇంత దారుణంగా ప్రవర్తించారా?’’ ‘‘ఊరోళ్లని అని ఏలాభం బాబూ! బోనంగి పండు పడాలుని ఎవరు పట్టించారో తెలుసా! ఆయన చెల్లెలే. వందరూపాయల కోసం పోలీసులకి చెప్పేసింది.’’ మాట్లాడలేకపోయాడు అగ్గిరాజు.‘‘తమరు ఎప్పుడొచ్చారు?’’ అడిగాడు లచ్చమయ్య.‘‘మీ కంటే ఓ సంవత్సరం ముందే.’’ చెప్పి లేచాడు అగ్గిరాజు. ఇప్పుడే తెలిసిన సత్యాలు ఆయనని చాలా బాధించాయి. అది తెలుస్తూనే ఉంది లచ్చమయ్యకి. అయినా తామంతా చేసిన తప్పిదాన్ని ఒప్పుకుని మనసు  క్షాళన చేసుకోవాలని ఉంది అతడికి.‘‘బాబూ వెళుతున్నారా?!’’ అన్నాడు లచ్చమయ్య.‘‘ఇంకా ఏముందయ్యా వినడానికి!’’ బాధతో గొంతు పూడిపోయింది.‘‘ఒక మాట ఉంది బాబూ! ఇది వినాలి. మమ్మల్ని క్షమించాలి. మేం మిమ్మల్ని ప్రభుత్వం మనిషి అనుకున్నాం. వాళ్ల వేగు అనుకున్నాం. చాలా తప్పుచేశాం. మీరు  క్షమించాలి.’’గుండెల్లో బాకు దిగినట్టు చివాల్న తలెత్తాడు అగ్గిరాజు.ఒక్క నిమిషం మౌనం తరువాత అక్కడ నుంచి నీరసంగా అడుగులేస్తూ వెళ్లిపోయాడు..
∙∙
పద్నాలుగేళ్ల తరువాత.......
నిన్నటి ఓ కళేబరం మీది చర్మమే ఇవాళ్టి వాద్యపరికరమై మోగుతున్నట్టుంది – ఆ గొంతు, దిక్కులు పిక్కటిల్లేటట్టు. ఆ గళం నుంచి వస్తున్నది కొండవాళ్లు పాడుకునే ఒక జానపద గీతమే. ఎందుకో మరి! నిన్నటి విషాదమేదో అందులో బలంగా పలుకుతోంది.‘‘కమసాలయ్య కమసాలయ్య– రావో కమసాలయ్య; రాజులున్న బరిణెశాలకు– రావో కమసాలయ్యకొక్కెర కోడి కూసేవేళ– కొండ లేచెడి వేళ; ఊరకోడి కూసే వేళ– ఊరు లేచెడి వేళ......’’కంజరి చెవి దగ్గర పెట్టుకుని మునివేళ్లతో సుతారంగా తాటిస్తూ, శ్రుతి చూస్తున్నాడు ఆదినారాయణ. అప్పుడే ఆ పాట చెవిలో పడింది. భాస్కరుడి గారి ఇంటికి వంద గజాల అవతల ఒక పాక నిర్మించుకుని అందులో ఉంటున్నాడు. మట్టి అరుగు నేల మీద ఒక పక్కగా పరిచిన చాప మీద కూర్చుని ఉన్నాడు. ఒక పక్కగా కంసాలి దుకాణం. అక్కడే ఒక పక్కగా మృదంగం.  బహుశా అక్కడికి పది పన్నెండు ఇళ్ల అవతల పాడుతున్నాడు. ఎవరో బిచ్చగాడే.ఉదయం ఎనిమిది గంటల వేళ. అప్పటిదాకా మృదంగం మీద సాధన చేసి, ఆ క్షణమే కంజరి తీసుకున్నాడు ఆదినారాయణ. చిన్న జల్లెడంత చర్మ వాద్య పరికరం. చక్కని నాదం ఇచ్చే పక్క వాద్యం.

సరైన శ్రుతి కోసం కంజరి మీద ఆన్చి ఉంది కుడి చెవి. వీధిలో మారుమోగుతున్న ఆ పాట ఎడం చెవిలో పడుతోంది. ఐదారు నిమిషాల గడిచాయి.‘‘కొంచెం వేడి చేస్తే చాలయ్యా, దాని నాదం దానికొస్తది!’’  ఎప్పుడో చెవికి పరిచయమైన గొంతే, చాలా సమీపంగా వినిపించింది.చివాల్న తల తిప్పి చూశాడు ఆదినారాయణ. ఆ గొంతే... పాట కంటే మాట మరీ మార్దవంగా ఉంది. అక్కడక్కడ నల్ల వెంట్రుకలతో చింపిరి తల, పూర్తిగా నెరిసిన బవిరి గడ్డం. జీవితంలో ఎంత నలిగిపోయాడో చెబుతూ లోతుకు పోయిన కళ్లు. ముఖం నిండా మానిన గాయాలు.అక్కడక్కడా చిరిగిన గొంగడి, భుజాల నిండుగా. అంచులు శిథిలమై ఉన్న పంచె. ముడతలు పడిన చేతి చర్మం. వణుకుతున్న ఆ వేళ్ల మధ్య కర్ర. అతడి బాహ్యస్థితిని తిరుగులేకుండా నిరూపిస్తూ చంకలో జోలె.

ఆ జోలెలోనే చేయి పెడుతూ అన్నాడు అతడు, ‘‘డబ్బులు లెక్కెట్టి ఇస్తావా?
అయోమయంగా లేచి నిలబడ్డాడు ఆదినారాయణ, నమ్మలేనట్టు. చేతిలో కంజరి చేతిలోనే ఉంది.మళ్లీ అతడే అన్నాడు, ‘‘ఇప్పుడొద్దులే! వచ్చేవారం వస్తాను. లెక్కెట్టి ఇద్దువు గాని!’’
అనేసి కర్రపోటు వేసుకుంటూ భారంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడతడు. మళ్లీ హఠాత్తుగా అతడి గొంతులో పాట భళ్లుమంది.అతడిని వెనక్కి పిలవాలని గొంతుదాకా వచ్చిందా పిలుపు. కానీ పెదవుల మీదే ఉండిపోయింది– ‘ఎర్రేసూ....ఆగు!’వడివడిగా అరుగు దిగి ఆ వైపు చూశాడు ఆదినారాయణ. అప్పటికే అతడు వెళ్లిపోయాడు. రెండు నిమిషాల తరువాత పాట కూడా ఎటో వెళ్లిపోయింది. ఆదినారాయణ కళ్ల నుంచి రాలిన రెండు బొట్లు కంజరి మీద పడి చెదిరాయి.
(సమాప్తం)
రచయిత మొబైల్‌ నెం.98493 25634

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top