అమీ అన్‌కామన్‌

The girls seemed to be common in jobs - Sakshi

మగాళ్లు మాత్రమే కనిపించే ఉద్యోగాలలోఇప్పుడు అమ్మాయిలూకనిపించడం కామన్‌అయిపోయింది. అయితే‘ఫ్లేర్‌ బార్‌టెండర్‌’గాఅమీ చేస్తున్న ఉద్యోగంమాత్రం ఇప్పటికీ అన్‌ కామన్‌. దేశంలో ఇంకే మహిళా ఈ ఉద్యోగంలో లేరు!

అమీ బెహ్రామ్‌ ష్రాఫ్‌! స్వస్థలం ముంబై. వృత్తి ఫ్లేర్‌ బార్‌టెండర్‌. క్రెడిట్‌ కూడా అదే. దేశంలోనే తొలి మహిళా ఫ్లేర్‌ బార్‌టెండర్‌. సరైన మోతాదులో డ్రింక్‌ని మిక్స్‌ చేయడం మిక్సాలజీ. బార్‌లోని ఎక్విప్‌మెంట్స్‌ (బాటిల్స్, గ్లాసెస్‌ ఎట్‌సెట్రా)తో  ఆకట్టుకునేలా విన్యాసాలు చేస్తూ డ్రింక్‌ను మిక్స్‌ చేసి సర్వ్‌ చేయడమే ఫ్లేర్‌ బార్‌టెండర్‌ పని. ఇది పూర్తిగా పురుషుల వృత్తి. అలాంటి  ఈ రంగంలో మగవాళ్లకు దీటుగా ఫ్లేర్‌ బార్‌టెండర్‌గా తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్‌ చేసుకుంది అమీ. ఇప్పటివరకు దేశవిదేశాల్లోని ప్రసిద్ధి చెందిన పబ్‌లు, బార్‌లలో వెయ్యి షోస్‌ (విన్యాసాలు) వరకు  చేసింది. పదిహేడేళ్లకే ఈ ఫీల్డ్‌లోకి వచ్చింది.  మొదటి నుంచి భిన్నంగా ఉండడం, విభిన్నంగా ఆలోచించడం అమీ నైజం. లెవెంత్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు అమీ, ఆమె స్నేహితురాలు డెల్‌నాజ్‌ ఇద్దరూ కలిసి ‘కాక్‌టేల్స్‌’ అనే సినిమా చూశారు. అందులో ఫ్లేర్‌ బార్‌ టెండర్‌ విన్యాసాలు చూసి ముగ్ధులైపోయారు. ఆ ఇంట్రెస్ట్‌తో,  ఫాసినేషన్‌తో నిజంగానే ఓ ఫ్లేర్‌ బార్‌టెండర్‌ను కలిశారిద్దరూ. అతని ఆర్ట్‌ను సునిశితంగా గమనించారు. నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. అలా ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఫస్ట్‌ చాన్స్‌ తీసుకుంది మాత్రం అమీనే. 

పేరెంట్స్‌కి చెప్పినప్పుడు 
ముందు ఆశ్చర్యపోయారట. అమీ పట్టుదల తెలుసు అందుకని నో అని అనలేదు కానీ బార్‌లో ఉద్యోగం కాబట్టి జాగ్రత్తలు మాత్రం చెప్పారు. కొత్తదనాన్ని ప్రేరణగా తీసుకుంటుంది అమీ. ప్రకృతి నుంచి కూడా స్ఫూర్తి పొందుతుంది. అలా భారతదేశంలోనే ప్రముఖ మిక్సాలజిస్ట్‌గా పేరు సంపాదించింది. ‘‘ఆ పాపులారిటీ వల్ల అప్పుడప్పుడు నా ఈగో శాటిస్‌ఫై అవుతుంది తప్ప.. దాన్నో గొప్ప అచీవ్‌మెంట్‌గా అనుకోను. ఇది నా ప్రొఫెషన్‌. న్యాయం చేయాలి. చేస్తున్నాను’’ అంటుంది నవ్వుతూ అమీ.

మగాళ్లతో ఏమైనా ఇబ్బంది?
‘‘ఈ ఫీల్డ్‌లో ఉన్న మగవాళ్లు.. ఫీల్డ్‌లో లేని ఆడవాళ్లు నన్ను చూసి జాలి పడ్తుంటారు. మంచి ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు కదా, ఇంకా బెటర్‌ కెరీర్‌ని ప్లాన్‌చేసుకోవచ్చు కదా అంటూ సలహాలిస్తుంటారు. అంతకు మించి ఈ వృత్తిలో నాకేం ఇబ్బందులు లేవు. అయితే ఆ ఉచిత సలహాలకు కొత్తలో కోపంగా ఉండేది. ఇప్పుడు నార్మల్‌ అయిపోయింది. నవ్వి ఊరుకుంటాను. మేల్‌ బార్‌టెండర్స్‌ ఇంకో ఉద్యోగం చూసుకో అంటున్నారంటే.. జెలస్‌ ఫీలవుతున్నారని అర్థం కదా.. సో.. ఆ మాట విన్నప్పుడల్లా సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. సెల్ఫ్‌ డిసిప్లిన్‌ కూడా పెద్ద సవాల్‌ ఈ ప్రొఫెషన్‌లో’’ అంటుంది అమీ. 

మరిచిపోలేని షో
కాయింట్రో మిక్సాలజీ కాంపిటీషన్‌! అందులో ప్రైజ్‌ రావడం అమీ మర్చిపోలేని షో. ఇంకా జిందగీ లైవ్‌  ఐబీఎన్‌7 విమెన్స్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ (2013), ఎమ్‌టీవీ కెప్టెన్‌ షాక్‌ కాంపిటీషన్‌ విన్నర్‌.. ఇలాంటివి. బెస్ట్‌ మిక్సాలజిస్ట్‌గా ఉన్న పేరు కంటే కూడా తన  ఫ్లేర్‌ ఆర్ట్‌ను చూసి పిల్లలు నవ్వినప్పుడు.. అంతకుమించిన కాంప్లిమెంట్‌ లేదని సంతోషపడ్తుందట.  మంచి మ్యుజీషియన్‌ కావాలనే లక్ష్యం కూడా ఆమెలో ఇంకా ఉంది. అందుకే ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ నేర్చుకుంటోంది. మరి ఫ్యూచర్‌ ప్లాన్స్‌? ‘‘ఈ మాట విన్నా.. అనుకున్నా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనేదీ ప్లాన్‌ చేసుకోను. టైమ్‌ వెంట జర్నీ చేస్తూంటా. వర్తమానంలో ఉండడానికే ఇష్టపడ్తా. ఈ క్షణాన్నే ఎంజాయ్‌ చేస్తా’’ అంటోంది అమీ ష్రాఫ్‌. 
– శరాది 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top