పాపం

The girl is fighting for her existence after her birth - Sakshi

పాపం అన్నవారికి సిగ్గులేదు...అయ్యో పాపం అన్నవారికి బుద్ధిలేదు.అతడే డిసైడ్‌ చేస్తాడు...ఆమె ఎలా బతకాలన్నది!తల్లయినా చెల్లయినా భార్యైనా...ప్రియురాలైనా స్నేహితురాలైనా...అతడే నిర్ణయిస్తాడు వాళ్లెలా బతకాలన్నది.ఎలా బతకడం అన్నది నా హక్కయినప్పుడు... బతికి ఉండటం నా హక్కు కాదా?పోనీ... పుట్టడం అయినా నా హక్కు కాదా?పుట్టనివ్వకపోవడం పాపం కాదా?ఆ పాపం చేసిన మనిషి అపరాధి అయితే...చూసి ఏమీ చేయని మనిషి మహాపరాధి..!!

ప్రపంచంలో జనాభా ఎంత పెరిగినా..ఒక మనిషి మిస్‌ అవడం పెద్ద విషయం.వెంటనే ఫిర్యాదు వెళుతుంది.వెంటనే పోలీస్‌ హంట్‌ మొదలౌతుంది. చుట్టాలు ధైర్యం చెబుతారు. చుట్టుపక్కల వాళ్లు ఓదార్పు ఇస్తారు. కానీ అమ్మ కడుపులోనే‘మిస్‌’ అయిపోయే ఆడగుడ్డు మాటేమిటి?ఫిర్యాదు చేసేదెవరు? ఉరుకులు, పరుగులు మీద వెదికేదెవరు?
‘నన్ను బతకనివ్వండి ప్లీజ్‌’ అని పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఇంకా ఆక్రోశిస్తూనే ఉంది.‘నన్ను వేధించకండి, ఉద్యోగం చేసుకోనివ్వండి ప్లీజ్‌’ అని ఉద్యోగిని మౌనంగా రోదిస్తోంది.‘నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్‌’ అని కుగ్రామంలో బాలిక కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇవన్నీ పుట్టిన తర్వాత సమాజంలో మనుగడ కోసం ఏడ్చే ఏడుపులు. ఆడపిల్లకు ఏడుపు.. పుట్టిన తర్వాతే... ఇంకా చెప్పాలంటే పుట్టుకతోనే మొదలవుతుంది అనుకుంటాం. అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు.

ఆడపిల్ల పుట్టుక కోసం కూడా ఏడవాల్సి వస్తోందిప్పుడు. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఇంట్లో శవం లేచినట్లు ముఖాలు నల్లగా పెట్టుకునే రోజులుండేవని అప్పట్లో చదివాం. ఆ బిడ్డను బతకనివ్వకుండా గొంతులో విషపు చుక్క వేసి చంపేసే కర్కశత్వం గురించి తెలిసి చివుక్కుమన్న మనసుని చిక్కబట్టుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అమానుషత్వం వికృతహాసం చేస్తోంది. ఆడపిల్లను పుట్టనివ్వకుండానే కడుపులోనే చిదిమేయడం వెనుక ఆ కరడుకట్టిన నిర్ణయం ఎవరిది? 

మన రాష్ట్రాలు ‘మగ’రాష్ట్రాలు!
తెలుగు రాష్ట్రాల్లో తల్లుల గర్భాల్లో ఊపిరి పోసుకున్న నలుగురు ఆడపిల్లల్లో ముగ్గురే భూమ్మీద పడుతున్నారు. ఆ ఒక ఆడబిడ్డ పుట్టకుండానే మరణిస్తోంది! ‘సెక్స్‌ రేషియో ఆఫ్‌ బర్త్‌’ గణాంకాల ప్రకారం రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్‌లలో వెయ్యిమంది మగపిల్లలు పుడితే ఆడపిల్లలు 806కే పరిమితమవుతున్నారు. ఈ తేడా ప్రకృతి వివక్ష కాదు, సమాజం వివక్ష.  2016 నాటి ఈ లెక్కల్లో ఈ రాష్ట్రాలు జాతీయ సరాసరి సంఖ్య 877 కంటే  చాలా తక్కువలో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగు స్థానంలో ఉన్నాయి. అంతకు మునుపు దాదాపు ఒక దశాబ్దం వెనక్కు వెళ్లినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే, ఆడపిల్లల సంఖ్య 974గా ఉంది. 2007 నాటికి కూడా వ్యత్యాసం ఉంది.

అయితే అప్పటికే లింగ నిర్ధారణ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రీనాటల్‌ డయాగ్నోసిస్‌ను అరికట్టే చట్టమూ వచ్చేసింది. పెరిగిన విజ్ఞానంతోపాటు మనుషుల్లో జ్ఞానం, సంస్కా రం కూడా పెరిగి ఉంటే మగపిల్లలు– ఆడపిల్లల పుట్టుక మధ్య వ్యత్యాసం తగ్గిపోయేది. విజ్ఞానాన్ని కూడా మేల్‌ డామినేషనే ప్రభావితం చేస్తోంది కదా.. 2016 నాటికి తేడా ఏపీలో ఏకంగా 17 శాతానికి పడిపోయింది. తెలంగాణలో 2013 లో వెయ్యికి మగపిల్ల లకు 954 మంది ఆడబిడ్డలు పుట్టారు, 2016 నాటికి ఆ సంఖ్య 881కి పడిపోయింది. 2007కి– 2016కి మధ్య 2011లో ఏపీలో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 993 కి చేరింది. కేరళ(954) కంటే మెరుగ్గా ఉంది. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తోంది!

తల్లిపై మెట్టినింటి ఆంక్షలు 
ఆడపిల్ల... తాను పుట్టిన తర్వాత అయితే తన ఉనికి కోసం తానే పోరాడుతుంది. పుట్టక ముందే పిండాలను ఛిద్రం చేసే చేతుల నుంచి కాపాడేది ఎవరు? కడుపున ఆడపిల్ల పుట్టింది అంటే... అదనపు భారం అనుకున్నా, అంత్యకాలంలో అన్నానికి భరోసా ఇచ్చేది ఆడపిల్లే. అయినా... బిడ్డ పుట్టిన తర్వాత మాయమైతే ‘మిస్సింగ్‌’ కేసు పెట్టి వెతుక్కోవచ్చు. కడుపులోనే కనుమరుగవుతున్న బిడ్డల కోసం ఎక్కడ వెతకాలి? తల్లి కడుపులో ఛిద్రమవుతున్న బిడ్డను వెతికిపెట్టడం ఏ పోలీస్‌ వ్యవస్థకు చేతనవుతుంది. అసలు ఫిర్యాదు చేసేదెవరు? బిడ్డను కడుపులోనే చిదిమేస్తున్న పాపం ఎవరిదో కాదు, పూర్తిగా అమ్మానాన్నలదే. అంతకంటే సూటిగా చెప్పాలంటే... ఆ తల్లిని ఆంక్షల వలయంలో బంధిస్తున్న పురుష సమాజానిది. ‘ఆడపిల్ల పుడితే ఇంట్లో అడుగుపెట్టనివ్వం’ అని కళ్లురిమే మెట్టినింటిది.
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top