కథ చెబుతా... ఊ కొడతారా!

Geetha Challa Online Stories By Name Of Balamithra In Lockdown Period - Sakshi

కరోనా టైమ్‌

వేసవి కాలం అనగానే పల్లె గుర్తుకు రావడానికి కారణం మన బాల్యంలో పెరిగిన ఊరు. అక్కడి వాతావరణం. ఆడుకున్న ఆటలు, అమ్మమ్మ–తాతయ్య కథలు చెబుతుంటే ‘ఊ..’ కొడుతూ విన్నాం. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోయాయి. అమ్మ, నాన్న పిల్లలవరకే అవి పరిమితం అయ్యాయి. అమ్మానాన్న పిల్లలకు కథలు చెప్పడమే తగ్గిపోయింది. దీంతో పిల్లల్లో సామాజిక విలువలు, జీవన నైపుణ్యాలు తగ్గిపోతున్నాయనేది నమ్మలేని నిజం. ఈ కాన్సెప్ట్‌ను దృష్టిలో పెట్టుకొని చైల్డ్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ గీతా చల్లా ఈ లాక్డౌన్‌ కాలాన్ని కథల వర్క్‌షాప్‌కి కేటాయించారు. ‘బాలమిత్ర’ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా రోజుకో కథ చెబుతున్నారు. ఆ కథ చివరలో పిల్లలకు రకరకాల టాస్క్‌లు ఇచ్చి ఆ రోజంతా వారిని బిజీ బిజీగా ఉంచుతున్నారు. 

‘బాలమిత్ర’ కథలు
పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే కథలు ఎన్నో మన భారతీయ జ్ఞాన సంపదలో మెండుగా ఉన్నాయి. అయితే వీటిని వినియోగించుకోవడంలో ఇటీవల కాలంలో బాగా వెనకబడ్డాం అంటారు డాక్టర్‌ గీత. రోజూ 500 మంది పిల్లలకు మధ్యాహ్నం 12 గంటలకు ఆంగ్లంలో, 12:30 కు తెలుగు లో కథ చెబుతారు గీత. హైదరాబాద్‌లో ఉంటున్న గీతాచల్లా పిల్లల మానసిక సమస్యలకు, వారి పరిణితికి ‘మనోజాగృతి’ పేరుతో కౌన్సెలింగ్స్‌ ఇస్తున్నారు. ‘ఈ లాక్డౌన్‌ కాలంలో రోజంతా పిల్లలను ఇంట్లోనే ఉండేలా చూడటం తల్లులకు పెద్ద టాస్క్‌. పిల్లల పెంపకానికి సంబంధించిన అంశాల్లో తల్లులూ టాస్క్‌ల్లో పాలు పంచుకుంటున్నారు. పిల్లలతో ఆ టాస్క్‌లను చేయిస్తూ వారి ఫొటోలు, వీడియోలు మాకు షేర్‌ చేస్తుంటారు. గ్రూప్‌లో అందరికన్నా తమ పిల్లలు ముందుండాలని కూడా తపన పడుతుంటారు. పిల్లలకు వచ్చే ప్రశంసలు చూసి పేరెంట్స్‌ చాలా ఆనందపడుతుంటారు. ఈ విషయాలు వాళ్లు మాతో పంచుకున్నప్పుడు ఈ పని చేస్తున్నందుకు చాలా ఆనందిస్తుంటాను’ అని తెలిపారు ఈ డాక్టర్‌.

రోజుకో కొత్త టాస్క్‌
ఇంట్లో ఉన్న వనరులతోనే టాస్క్‌లను పూరించమంటారు గీత. ఒక రోజు నచ్చిన పాటకు డ్యాన్స్, మరో రోజు ఏదైనా రంగును పోలిన వస్తువులన్నీ సెట్‌ చేయడం, ఇంకోరోజు మంట అవసరం లేని వంట, రోజూ వాడే దినుసులు, ఒక రోజు పెయింటింగ్‌.. ఇలా రోజుకో టాస్క్‌ ఇస్తూ పిల్లల్లో యాక్టివిటీని పెంచుతున్నారు. మధ్యాహ్నం ఇచ్చిన టాస్క్‌ సాయంకాలం 7 గంటల లోపు పోస్ట్‌ చేయాలి, ఇలాంటి అంశాలతో డాక్టర్‌ గీత ఇళ్లలో ఉన్న పిల్లలను గడప దాటనివ్వకుండా అట్రాక్ట్‌ చేస్తున్నారు. 
– నిర్మలారెడ్డి 

లైవ్‌ సెషన్స్‌..
రోజూ రెండు గంటలు తెలుగు, ఇంగ్లిషులో ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నాను. దీంట్లో పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకూ పాజిటివ్‌ పేరెంటింగ్‌ గురించి సూచనలు, కౌన్సెలింగ్‌ పద్ధతులూ ఉంటాయి. ఈ లాక్డౌన్‌ టైమ్‌లో పిల్లలు క్వాలిటీ టైమ్‌ను బద్ధకంగా గడపడం, లేదంటే పేరెంట్స్‌ను విసిగించడం వంటివి చేస్తున్నారనే కంప్లైంట్స్‌ ఎక్కువగా వినడం వల్ల వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. చైల్డ్‌ సైకాలజిస్ట్‌గా పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌లో 500 మందికి పైగా పిల్లలు, తల్లిదండ్రులు చేరడం చాలా ఆనందంగా ఉంది. 
– గీతా చల్లా, చైల్డ్‌ సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్‌ హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top