కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ | Gain in less than a bundle | Sakshi
Sakshi News home page

కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ

Feb 2 2016 12:36 AM | Updated on Oct 20 2018 5:53 PM

కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ - Sakshi

కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ

ఈ రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ సంపాదిస్తే గానీ కుటుంబం సజావుగా సాగదు.

టర్మ్ ఇన్సూరెన్స్
ఉమన్ ఫైనాన్స్
 

ఈ రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ సంపాదిస్తే గానీ కుటుంబం సజావుగా సాగదు. కనుక చాలామంది మహిళలు తప్పనిసరిగా ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ తమ కుటుంబ ఖర్చులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆదాయంలో తమ మిగులుకు తగ్గట్లుగా పొదుపు చేసి వాటిని సరైన మార్గాలలో పెట్టుబడి పెడుతున్నారు. మరి ఏ కారణం చేతనైనా ఆలూమగలలో ఒకరి ఆ సంపాదన ఆగిపోతే?

ఈ ప్రశ్నకు సరైన సమాధానం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్ణీత కాలానికి లభ్యమయ్యేది. ఆ నిర్ణీత కాలంలో మరణం సంభవిస్తే, ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకొంటామో అంత మొత్తం నామినీకి అందజేస్తారు.
 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే:కనీసం 18 సంవత్సరాల వయస్సు కలవారై ఉండాలి. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ టర్మ్ పాలసీలను గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు గలవారి వరకు అందజేస్తున్నారు. చాలా తక్కువ (1/2) కంపెనీలు మాత్రమే 70 ఏళ్ల వారికి కూడా అందజేస్తున్నారు. ఈ పాలసీని కనీసం 5 నుండి 40 ఏళ్ల కాలపరిమితి వరకు ఇస్తున్నారు.ఎంత మొత్తం భీమాకి అనుమతిస్తారో పాలసీదారుకి వయస్సు, సంపాదన, తదితర విషయాల మీద ఆధారపడి ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్థారిస్తాయి. {పీమియం ఎంతైతే చెల్లిస్తారో ఆ మొత్తం ఇన్‌కమ్‌ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సి కింద పన్ను రాయితీ లభిస్తుంది.

ఈ టర్మ్ పాలసీ ప్రీమియం సాంప్రదాయక పథకాలైన ఎండోమెంట్, హోల్ లైఫ్ మొదలైన వాటితో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం పాలసీదారు చనిపోతేనే నామినీకి ఈ కవరేజీ అందుతుంది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా పాలసీదారు జీవించి ఉన్నట్లయితే, ఎటువంటి కవరేజీ రాదు. ఎందుకంటే టర్మ్ పాలసీ అనేది పూర్తిగా రిస్క్‌ని అధిగమించడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది.

పాలసీ తీసుకొనేటప్పుడు గమనించదగ్గ విషయాలు: పాలసీ ప్రపోజల్ ఫామ్‌లో అన్ని విషయాలు (మీ ఫ్యామిలీ హిస్టరీ, సంపాదన, ఆరోగ్య సమస్యలు మొదలైనవి) పొందుపరచండి. ఒకవేళ మీరు దాచిన విషయం ఏదైనా పాలసీ ఇచ్చే విషయంలో ప్రభావం చూపేదైతే, క్లైమ్ సెటిల్‌మెంట్ చేయరు. నామినీని తప్పనిసరిగా నమోదు చేయండి.పాలసీ నియమ నిబంధనలని తప్పనిసరిగా చదివి ఏ పాలసీ కావాలో నిర్ణయించుకోండి.
 
మీ వయస్సు, సంపాదించడానికి మీకున్న కాలం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక బరువు బాధ్యతలు, భవిష్యత్తులో మీరు సంపాదించే మొత్తం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు... ఇలా పలు విషయాలను పరిగణనలోకి తీసుకొని మీ జీవితానికి ఉండే విలువను లెక్కలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగా జీవిత భీమాని ఈ టర్మ్ పాలసీ ద్వారా తీసుకోవచ్చు లేదా మీ వార్షిక ఆదాయానికి 10 నుండి 12 రెట్ల కవరేజీని తీసుకోవచ్చు.

మనిషి చనిపోతేనే కవరేజీ వస్తుంది, బతికి ఉన్నట్లయితే మనం కట్టిన ప్రీమియం మొత్తం పోతుంది కదా అనే ఒక అపోహతో ఈ పాలసీని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటన వల్లో, జబ్బునపడో, మరే ఇతర కారణం చేతనైనా మరణిస్తే అతను/ ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆ కుటుంబం, వారికుండే ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు ముందుకు వెళ్లాలి కాబట్టి అందుకు ఆర్థిక చేయూత ఎంతైనా అవసరం. ఆ చేయూతను సరైన భీమా పాలసీ మాత్రమే తీరుస్తుందని గుర్తించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement