పిండికొద్దీ ప్లేటు

Food Plate Manufacturing Company Edible Pro Special Story - Sakshi

కంచ భక్ష్యాలు

‘‘పాయసం అంతగా నచ్చిందట్రా!’’ అని స్పూను నాకుతున్న పిల్లల కప్పులో మరికొంత పాయసాన్ని వడ్డిస్తుంది... తల్లి ప్రేమ. ‘‘ఒరేయ్‌! కప్పులో ఐస్‌ క్రీమ్‌అయిపోయింది. కప్పును కూడా వదలకుండా తినేట్టున్నావ్‌. అది ప్లాస్టిక్‌ కప్పు. తిన్నాఅరగదు’’ అక్కల వెక్కిరింతలు ఇలాగే ఉంటాయి. ఇది ఇంతవరకు జరిగిన చరిత్ర.ఇకపై కప్పులు, స్పూన్లను కూడా తినవచ్చు. ఇది రేపటి తరం రాసుకునే కొత్త చరిత్ర.

షైలా గురుదత్, లక్ష్మీ భీమాచార్‌ ఇద్దరూ బెంగళూరులో ఐబీఎమ్‌లో ఉద్యోగం చేసేవాళ్లు. ‘‘పాతికేళ్లకు పైగా నైన్‌ టూ ఫైవ్‌ ఉద్యోగం చేశాం. ఉద్యోగం చేస్తే తప్ప తీరని ఆర్థిక అవసరాలేవీ ఇప్పుడు లేవు. కాబట్టి మరొకటి ఏదైనా చేద్దాం’’ అనుకున్నారిద్దరూ. ‘‘ఏదైనా చక్కటి పరిశ్రమ పెట్టి పదిమందికి ఉద్యోగం ఇద్దాం’’ అని కూడా అనుకున్నారు. ‘ఎడిబుల్‌ ప్రో’ అలా మొదలైంది. బెంగుళూరులో ఇలాంటి పరిశ్రమ ఇప్పటి వరకూ లేదు. ఇదే మొదటిది. ఈ ఉత్పత్తులు ఇప్పుడక్కడ సంపన్నుల వేడుకల్లో దర్శనమిస్తున్నాయి.

మన దగ్గర పదేళ్ల కిందటే
ప్లాస్టిక్‌ స్పూన్‌లకు బదులు తినగలిగిన స్పూన్‌ల తయారీకి శ్రీకారం చుట్టిన సైంటిస్ట్‌ పీసపాటి నారాయణరావు. ఆయన అనేక ప్రయోగాలు చేసి చేసి... పదేళ్ల కిందట ఒక రూపాన్నిచ్చారు. హైదరాబాద్‌లోనే ఆయన ఒక మోడల్‌ ఇండస్ట్రీని పెట్టి ఆసక్తి ఉన్న వాళ్లకు ఫార్ములా ఇస్తానని ఆహ్వానం పలికారు. గోధుమ, జొన్న, శనగ, రాగి పిండిలే ఈ స్పూన్లకు ముడి సరుకు. సరిగ్గా ఇదే ఫార్ములాను డీఆర్‌డీవో నుంచి తీసుకుని 2018లో బెంగళూరులో ఎడిబుల్‌ ప్రో ఇండస్టీని స్థాపించారు లక్ష్మి, షైలీ. ఒక ఫార్ములా మహిళల చేతిలోకి వస్తే అది వెంటనే సృజనాత్మకను సంతరించుకుంటుంది. రొట్టెల పిండితో స్పూన్‌లు, ఫోర్క్‌లు, కప్పులు చేయడంతో సరిపెట్టడం లేదు. ఆ పిండికి బీట్‌రూట్‌రసం, పుదీన రసంతో రంగులద్దుతున్నారు. పిల్లలు ఇష్టపడే టెడ్డీ బేర్‌ ఆకారంలో స్పూన్‌లు, కేక్‌ కట్‌ చేయడానికి పళ్ల చాకు, జ్యూస్‌ కోసం రాగి పిండి గ్లాసులకు కూడా రూపమిచ్చారు. వీటితోపాటు ఇంగ్లిష్‌ అక్షరాల ఆకారంలో ఐస్‌క్రీమ్‌ స్పూన్లు తయారు చేశారు. ఇలా ఎనభై రకాలు తయారవుతున్నాయి. ఇలా పిండితో తయారైన కప్పులు, ప్లేట్లు, స్పూన్లు ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి. ఇన్ఫోసిస్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి ఈ పరిశ్రమను సందర్శించి, లక్ష్మి, షైలీ ప్రయత్నాన్ని అభినందించారు.

వేడుకలే ప్రేరణ
‘‘ఫంక్షన్‌లకు వెళ్లినప్పుడు ఆ రెండు –మూడు గంటల్లో ఒక్కొక్కరు ఎంత ప్లాస్టిక్‌ని వాడుతున్నారో గమనిస్తే... మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. వెల్‌కమ్‌ డ్రింకు నుంచి మొదలవుతుంది. ఐస్‌క్రీమ్‌ స్పూన్‌ వరకు సాగుతుంది. సంపన్నులైతే ఎకో ఫ్రెండ్లీ పేరుతో ప్లాస్టిక్‌ గ్లాసులకు బదులు పేపర్‌ గ్లాసులు వాడతారు. వీలయినంత వరకు బయోడిగ్రేడబుల్‌ మెటీరియల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అది కూడా సహజవనరులకు నిరాఘాటంగా విఘాతం కలిగించే ప్రయత్నమే. వీటన్నింటికీ సమాధానంగా మేము ఈ తినే కప్పులు, స్పూన్లను తీసుకురావాలనుకున్నాం. వీటిని కొనుగోలు చేయడం కొంచెం ఖర్చుతో కూడిన పనే. స్పూన్‌ రెండు రూపాయలు, చిన్న ప్లేటు పది, పెద్ద ప్లేటు ఇరవై రూపాయల వరకు ఉంటుంది. అయితే కేటరింగ్‌లో భోజనానికి ప్లేట్‌కు వందలాది రూపాయలిస్తున్నప్పుడు అందులో స్పూను, ప్లేటు, కప్పుల కోసం మరో పాతిక రూపాయలు ఖర్చు పెట్టడం కష్టమేమీ కాదనే నమ్మకం మాది. ఆ నమ్మకంతోనే మొదలుపెట్టాం. ఎవరో ఒకరు తొలి అడుగు వేయాలి కదా! ఒకరు మొదలు పెడితే కొనసాగించడానికి మరికొంత మంది వస్తారు. మనదేశంలో ఏడాదికి తొంభై లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వేస్ట్‌ పోగవుతోంది. అందులో అరవై శాతం రీసైకిల్‌కి వెళ్తోంది. మిగిలినదంతా భూమిని కలుషితం చేస్తోంది. సముద్రాలకు పరీక్ష పెడుతోంది. మొత్తానికి పర్యావరణానికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనిని నివారించడానికి మా వంతు ప్రయత్నమే ఎడిబుల్‌ ప్రో’’ అని చెప్పారు లక్ష్మి, షైలీ. ఇకపై ఐస్‌క్రీమ్‌ తినడం పూర్తయిన తమ్ముడితో అక్కలు‘‘ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ కప్పుకు, స్పూన్‌కు ఏ మేరకు అంటుకుందో టెస్ట్‌ చేస్తావా’’ అని ఏడిపించవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top