మాంసాహారం ఎక్కువగా తింటే... గుండెజబ్బులు వస్తాయా?

Fat and heart disease - Sakshi

నా వయసు 38 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్‌ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్‌ అంటున్నారు. మాంసం మానేయాల్సిందేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. – మహ్మద్‌ సుబానీ, గుంటూరు

కొలెస్ట్రాల్‌ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్‌ (హెచ్‌డీఎల్‌)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్‌డీఎల్‌ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్‌) అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్‌ ఫాక్టర్‌. చెడు కొలెస్ట్రాల్‌ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్‌డీఎల్‌ 100 లోపు, హెచ్‌డీఎల్‌ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ అనే మరోరకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి.

ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్‌ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్‌ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్‌ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొలñ స్ట్రాల్‌ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్‌) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఇక రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే  ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్‌ వంటి వైట్‌మీట్‌ తీసుకోండి. వీటిలోనూ చికెన్‌ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు.

– డాక్టర్‌ అనుజ్‌ కపాడియా, సీనియర్‌ కార్డియాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top