పిల్లలు/ పెద్దలు  పాముకాటుకు గురైతే...?

Family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మాది పల్లెటూరు. దాదాపు పొలాల పక్కనే మా ఇళ్లు ఉంటాయి. స్కూలైపోగానే పిల్లలెప్పుడూ ఆ పొలాల్లోనే ఆడుతుంటారు. పాములేవైనా కాటేస్తాయేమోనని మాకు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. పాము కాటేసినప్పుడు ఎలాంటి ప్రథమచికిత్స చేయాలి? ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పండి. – ఆర్‌. విజయలక్ష్మి, పోతవరం

ఎవరినైనా పాము కాటు వేసినప్పుడు ముందుగా వారు ఆందోళన పడకుండా చూడాలి. అలాగే మనం కూడా కంగారు పడకూడదు. పాముకాటుకు గురయ్యామన్న భావనే చాలామందికి తీవ్ర ఆందోళన గొలుపుతుంది. కానీ పాముల్లో చాలావరకు విషసర్పాలు కావని గుర్తించాలి. విషసర్పం అయితే కాటువేసిన చోట రెండుగానీ లేదా ఒకటిగానీ గాట్లు ఉంటాయి. ముందుగా పాము కాటేసిన చోట సబ్బుతోనూ, నీళ్లతోనూ శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైనవారి తల వైపు ఎత్తు ఉండేలా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే విషం పైకి పాకే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత ఎలాస్టిక్‌ బ్యాండేజీ అంచులు ఒకదానిపై ఒకటి ఎక్కేలా (ఓవర్‌ల్యాపింగ్స్‌)తో అవయవం చుట్టూ ర్యాప్‌ చేస్తున్నట్టుగా కట్టాలి. ఇలా ఆ అవయవం పొడవునా... అంటే చేతికైతే భుజం వరకు, కాలికి అయితే పిక్కల వరకు కట్టాలి. మరీ బిగుతుగా కాకుండా చుట్టాలి. 

మరీ బిగుతుగా కడితే... ఆ కట్టిన అవయవానికి రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరీ వదులుగా చుడితే విషం పైకి ఎక్కకుండా ఆపడం కష్టం. కాబట్టి కట్టుకూ, చర్మానికి మధ్య మన చిటికెన వేలు పట్టేంత బిగుతుగా మాత్రమే ఆ కట్టు ఉండాలి. ఒకవేళ ఆ భాగంలో తిమ్మిరెక్కిట్లుగా ఉన్నా లేదా మొద్దుబారినట్లుగా ఉన్నా లేదా రంగు మారినట్లుగా అనిపించినా కట్టు మరీ బిగువైనట్టు అనుకోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా వదులు చేయాలి. ఎలాస్టిక్‌ బ్యాండేజీ లేని పక్షంలో రోలర్‌ బ్యాండేజీ వాడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కాటుకు గురైన అవయవం కదలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పాము కాటుకు గురయ్యే అవయవం కాలు. ఇలాంటప్పుడు చీలమండలు, పాదాలు ఈ రెండింటినీ ఒక బట్టతో కట్టవచ్చు. కాళ్లు ఎక్కువగా కదిపితే విషయం పైకి వేగంగా ఎక్కే ఆస్కారం ఉంటుంది. కదలకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం.ఈ విధంగా కట్టాక చిన్నారిని / బాధితులను వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి. పాము ఫొటోను గాని, పామును చంపితే... ఆ చచ్చిన పామును వైద్యులకు చూపించగలిగితే వారు దానికి సరైన యాంటీ స్నేక్‌ వీనం (విషానికి సరైన విరుగుడు మందు) ఇవ్వలా లేదంటే అది విషరహితమైనా పామా అన్నది నిర్ధారణ చేయడం సులభమవుతుంది. 

యాంటీస్నేక్‌ వీనం వల్ల కొంతమందికి రియాక్షన్‌ వచ్చి ప్రాణానికే ప్రమాదం అవ్వవచ్చు. అందువల్ల కాటేసింది విషసర్పమైతే తప్ప వైద్యులు ప్రతి పాముకాటుకూ యాంటీవీనం ఇవ్వరు. విషం శరీరంలోకి ఎక్కిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకునేందుకు అవకాశమున్న సూచనలను, పరీక్షలను బట్టి వైద్యులు యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. అవసరమైతే బాధితుడిని ఐసీయూలో ఉంచి చాలా జాగ్రత్తగా గమనిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సినిమాల్లో చూపినట్లుగా కొన్ని పనులు చేయడం ఏమాత్రం సరికాదు. ఉదాహరణకు పాము కాటు గాయానికి మరింత పెద్ద గాటు పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విషాన్ని నోటితో పీల్చడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల పీల్చేవారికీ విషం ఎక్కి వారి ప్రాణానికీ ప్రమాదం జరగవచ్చు. గాయం దగ్గర ఐస్‌ పెట్టవద్దు. ఆసుపత్రికి తరలించే సమయంలో దారిపొడవునా బాధితుడిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. స్పృహకోల్పోతే పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. శ్వాస ఆగిపోతే గుండెను పునరుత్తేజితం చేయడంతో పాటు శ్వాస ఆడేటట్లు చేసే సీపీఆర్‌ (కార్డియో పల్మునరీ రీససియేషన్‌) ప్రక్రియను ప్రారంభించాలి. (ఇలా చేయడం తెలిస్తే). ముందుగానే ఆసుపత్రికి ఫోన్‌ చేసి, పరిస్థితి వివరించాలి. ఇందువల్ల తగిన సలహా తీసుకోవడంతో పాటు... రోగి హాస్పిటల్‌కు చేరగానే అత్యవసర చికిత్స జరిగే ఏర్పాట్లను ముందుగానే చేయడానికి వీలవుతుంది. 

పిల్లల గొంతులో చేపముల్లు గుచ్చుకుంటే?
మాకు తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు చేపలను ఇష్టంగా తింటారు. అయితే ఒకసారి చేపముల్లు గుచ్చుకున్నట్లుగా ఉందని అన్నా... ఆ తర్వాత మళ్లీ మామూలైపోయారు. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ఒకవేళ పిల్లల గొంతుల్లో నిజంగానే చేపముల్లు గుచ్చుకోవడం లేదా ఇరుక్కుపోవడం జరిగితే ఏం చేయాలో సూచించండి.  – రేష్మీ, నెల్లూరు 
పిల్లల గొంతులో చేపముల్లు గుర్చుకోవడం లేదా ఇరుక్కుపోవడం అన్నది ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల ఒక్కోసారి గొంతు బాగా వాచి, గాలిపీల్చుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా గాలి అందని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. ఇలా పిల్లల గొంతులో గుచ్చుకున్న ముల్లును ఈఎన్‌టీ వైద్యులు చాల జాగ్రత్తగా తొలగిస్తారు. పిల్లల్ని వైద్యుల వరకు చేర్చేవరకు దారిపొడవునా పిల్లలతో ఐస్‌ చప్పరింపజేస్తూ ఉండాలి. ఈ చల్లదనం వల్ల వాపు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలా గొంతు వాపు రాకుండా, శ్వాసకి అడ్డం పడకుండా ఇలా కాస్తంత ముందుజాగ్రత్త తీసుకుంటే, గొంతులో ఉన్న ముల్లును తీయడం ఈఎన్‌టీ వైద్యులకు కూడా సులువవుతుంది. 

పాప  పాలు తాగగానే  వాంతి  చేసుకుంటోంది
మా పాపకు మూడు నెలలు. మా పాప పాలు తాగిన కొద్దిసేపటికే వాంతి చేసుకుంటోంది. ఇదేమైనా ఇబ్బందా? దీనికి పరిష్కారం ఏదైనా ఉందా?  – ఎల్‌. ప్రసూన, వైరా 
చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత కాసేపటికి కొద్దిగా పాలను బయటకు తియ్యడం మామూలే. పాలు తాగే పిల్లల్లో ఇది చాలా సాధారణం. దీనికి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదల బాగుండి, ఈ చిన్న చిన్న వాంతుల వల్ల దగ్గుగానీ, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలుగానీ, నెమ్ము రావడం వంటి సమస్యలు రానంతవరకు మనం ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. బిడ్డ పెరిగే కొద్దీ లేదా ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టాక ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. పాలు తాగించేటప్పుడు, తాగించాకగ కనీసం అరగంట సేపు తలవైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేటట్లుగా బిడ్డను ఎత్తుకుంటే చాలు... ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. పాలు తాగించాక తేన్పు తెప్పించడం కూడా ముఖ్యమే.  అయితే కొంతమంది చంటిపిల్లలు ఎక్కువగా వాంతులు చేసుకుంటారు. 

దాంతో బరువు సరిగా పెరగరు. కొంతమంది పిల్లల్లో ఈ వాంతుల వల్ల పొలమారి (పొరబోయి) మాటిమాటికీ నెమ్ముపడుతుంది. లేదా ఒక్కోసారి పొరబోయి గొంతులో అడ్డంపడి ఊపిరి అందక ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించి, తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. అరుదుగా ఒక్కోసారి ఆపరేషన్‌ కూడా అవసరం కావచ్చు. కొంతమంది చంటిపిల్లలకు వాంతుల సమస్య రెండో నెలలో మొదలవ్వవచ్చు. కష్టపడి వాంతులు చేస్తున్నట్లుగా పెద్ద పెద్ద వాంతులు చేస్తారు. వారు బరువు సరిగా పెరగకపోవచ్చు. అయితే కొందరు మామూలుగానే బరువు పెరగవచ్చు. పైలోరిక్‌ స్టెనోసిస్‌ అనే కండిషన్‌ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ఆపరేషన్‌ తప్పనిసరి. సమస్య ఏమైనప్పటికీ పిల్లలు మాటిమాటికీ వాంతులు చేసుకుంటుంటే మాత్రం ఒకసారి పిల్లల వైద్యనిపుణులను సంప్రదించడం అవసరం. 
డా‘‘ శివరంజని సంతోష్‌
సీనియర్‌ పీడియాట్రీషియన్,రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్‌

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top