మంచి పరుపూ తలగడతో హాయైన నిద్ర

Everyone Needs To Sleep Comfortably - Sakshi

సౌండ్‌ స్లీప్‌

మన జీవితంలో దాదాపు మూడోవంతు నిద్రలోనే గడుపుతాం. హాయిగా నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటూ ఉంటారు. మంచి నిద్ర వల్లనే వ్యాధి నిరోధక శక్తి పెరిగి దేహానికి అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనే శక్తి  వస్తుంది. హాయిగా నిద్రపోవడం కోసం ఎలాంటి పరుపు, ఎలాంటి తలగడ వాడాలో తెలుసుకుందాం.

మంచి పడక ఎలా ఉండాలంటే...
చాలా మంది నిద్ర కోసం పరుపు వాడటం మంచిది కాదని అంటుంటారు. వీపునొప్పితో బాధపడే చాలా మంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని చెబుతూ బెంచీ వంటి వాటిపైనా లేదా గచ్చు మీద పడుకుంటుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. నిజానికి మంచి పరుపు మీద పడుకోవడమే ఆరోగ్యానికి మేలు. అయితే అది శరీరానికి ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగానూ ఉండాలి. అదే సమయంలో మనం అందులోకి మరీ కూరుకుపోయేంత మెత్తగానూ ఉండకూడదు.

నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని చాలా మంది అపోహ పడుతుంటారు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంటిలో చాలా భాగాలు ఆ గట్టి ఉపరితలంతో నొక్కుకుపోయి ఒక్కోసారి నొప్పి వస్తుంటుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపునే ఎంచుకోవాలి.

పరుపును రెండు నుంచి మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత మార్చడమే మంచిది. పరుపు వాడే సమయంలోనూ ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన స్థితిస్థాపకతను కోల్పోయి, గుంటలా పడిపోతుంటుంది. మనం పడుకున్నప్పుడు ఏదో గుంతలో పడుకున్న ఫీలింగ్‌ రాగానే  పరుపు తిరగేయాలి.

తలగడ వాడితేనే మంచిది...
చాలామంది నిద్రపోయేటప్పుడు తలగడ వాడకపోవడమే మంచిదని అంటారు. కానీ నిజానికి మంచి నిద్ర కోసం సరైన తలగడ వాడాలి. మన తలకూ, భుజాలకూ మధ్య కాస్తంత ఒంపు ఉంటుంది. ఆ ఒంపు కారణంగానే పడుకునే సమయంలో తలకూ వీపుకూ సమన్వయం కుదరక ఇబ్బంది పడటం మనందరికీ అనుభవమే. ఆ ఒంపు (గ్యాప్‌ను) భర్తీ చేయడం కోసమే చాలామంది ఒక పక్కకు ఒరిగి భుజం మీద పడుకుంటుంటారు. ఒక రాత్రి నిద్రలో కనీసం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది.

అలా పక్కకు తిరిగి పడుకున్న  సమయంలో తలకూ, పడకకూ మధ్య గ్యాప్‌ అలా ఉండనే ఉంటుంది. ఆ గ్యాప్‌ను అలాగే ఉంచి రాత్రంతా నిద్రపోవడం ఎవరికీ సాధ్యం కాని విషయం. అందుకే మంచి తలగడను ఉపయోగించి ఆ గ్యాప్‌ను భర్తీ చేయడం అవసరం. అయితే ఎంత మంచి తలగడనైనా రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత తలగడ తన కంప్రెస్సబిలిటీ కోల్పోతుంది. ఇలా ఎలస్టిసిటీ తగ్గిన తలగడను వాడకపోవడమే అన్నివిధాలా మంచిది.  

మెడ ఇరుకుపడితే...
నిద్రలో తల ఇరుకుపడితే అది మళ్లీ నిద్రలోనే సరవుతుందని చాలామంది అంటుంటారు. మెడ పట్టేయడాన్ని సరిచేసేందుకు మొదటి మందూ, మంచి మందూ మంచి తలగడే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు. మెడపట్టేయడంతో బాధపడే రోగులపై వారొక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా వారి పరిస్థితిని చక్కదిద్దడానికి అనేక ప్రక్రియలను అనుసరించి చూశారు. అందులో కొందరికి మసాజ్‌ చేశారు. మరికొందరికి చిట్కా వైద్యాలు ప్రయోగించి చూశారు.

అయితే మరీ ఎక్కువ లావు, మరీ ఎక్కువ సన్నమూ కాని మంచి తలగడను ఉపయోగించడం వల్లనే మంచి ప్రయోజనం చేకూరిందని గ్రహించారు. అయితే  తలగడనెప్పుడూ కేవలం తలకు మాత్రమే  పరిమితం చేయకుండా, కాస్తంత భుజాల కింది వరకూ దాన్ని  జరిపితే ఫలితం మరీ బాగుందని ఈ అధ్యయనంతో పాటు చాలా అధ్యయనాల్లో తేలింది. తలగడ తర్వాత మంచి మార్గం స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలని ఇదే ఈ అధ్యయనంలో తేలింది.

మంచి తలగడ ఎలా ఉండాలంటే...
►తలగడ మృదువుగా ఉండలా.
►మన భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి.
►కుటుంబంలో ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. పిల్లలకు కూడా వాళ్ల తలగడ వాళ్లకే వేరుగా ఉండేలా చూడాలి.
►స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువుగా ఉండేలా తలగడను ఎంచుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top